Venkaiah Naidu: మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:21 AM
ప్రతి ఒక్కరూ తొలుత మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని, దీంతోపాటు వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.

హిందీ ఏ భాషకు హానికరం కాదు: వెంకయ్య నాయుడు
ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు పత్ర ప్రదానం
రాంగోపాల్‌పేట్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ తొలుత మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని, దీంతోపాటు వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. మాతృభాష కంటిచూపు లాంటిదని, ఇతర భాషలు కళ్లద్దాలవంటివని, కంటి చూపే లేనప్పుడు కళ్లద్దాలు ఏం పనిచేస్తాయని ప్రశ్నించారు. ఇతర భాషలు నేర్చుకుంటే మనం చెప్పదలచుకున్నది ఎదుటివారికి అర్ధమయ్యేలా స్పష్టంగా చెప్పగలమన్నారు. తాను కూడా చిన్నప్పుడు హిందీకి వ్యతిరేకంగా పోరాటాలు చేశానని, కానీ ఎప్పుడైతే బీజేపీకి జాతీయ కార్యదర్శినయ్యానో అప్పుడు హిందీ ఆవశ్యకతను గుర్తించానని, హిందీ ఏ ఇతర భారతీయ భాషలకు హానికరం కాదని అన్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో కిమ్స్ ఆస్పత్రి అనుబంధ సంస్థ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు పత్ర ప్రదానోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు.. గిన్నిస్ బుక్ ప్రతినిధి రిషినాథ్‌తో కలిసి ఫౌండేషన్ ఫౌండర్ చైౖర్మన్ పద్మశ్రీ డాక్టర్ రఘురామ్‌కు పత్రాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. డాక్టర్ రఘురామ్ రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు చేసిన యూట్యూబ్ వీడియోను 24 గంటల్లో 11 వేల మందికి పైగా చూశారని, ఈ విధంగా వేలాది మందికి అవగాహన కల్పించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారని చెప్పారు. వైద్య వృత్తిలో ఉన్నవారు తమకు సమీపంలోని బస్తీల్లో పర్యటించి రొమ్ము క్యాన్సర్‌పై పేదలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి సీఎండీ బొల్లినేని భాస్కర్ రావు, కిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.