Share News

West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:40 AM

నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లిన పశ్చిమ గోదావరి యువకుడు అక్కడ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య

గోవాలో న్యూ ఇయర్‌ వేడుకలు..

కర్రలతో కొట్టి చంపిన రెస్టారెంట్‌ సిబ్బంది

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లిన పశ్చిమ గోదావరి యువకుడు అక్కడ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డీఎఎస్‌ చెరువు ప్రాంతానికి చెందిన రవితేజ(27) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అందరితో సౌమ్యంగా, స్నేహంగా ఉండే రవితేజ తన సోదరుడు ఫణితో కలిసి తక్కువ సమయంలోనే కన్సల్టెన్సీ పెట్టారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుని, కొత్త జీవితం ప్రారంభించాలని భావించారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం వేడుకల కోసం నలుగురు యువకులు, ముగ్గురు యువతులతో కలిసి రవితేజ గోవాకు వెళ్లారు. అక్కడ తన స్నేహితురాలితో రెస్టారెంట్‌ నిర్వాహకులు అసభ్యంగా మాట్లాడటంతో వారిని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తులైన రెస్టారెంట్‌ సిబ్బంది రవితేజపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తలకు తీవ్ర గాయమైన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యమైందని, అరగంట ముందు తీసుకొచ్చి ఉంటే బతికేవాడని గోవా ఆస్పత్రి వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు రెస్టారెంట్‌ నిర్వాహకుడు సిల్వేరాతోపాటు, సిబ్బందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. రవితేజ తండ్రి బొల్లా సుబ్రహ్మణ్యం లారీ మెకానిక్‌గా పనిచేస్తూ.. ఇద్దరు కుమారులను బాగా చదివించి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను చేశారు. ఈ ఏడాది రవితేజకు వివాహం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో హత్యకు గురికావడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.

‘బాయ్‌కాట్‌ గోవా..’ నినాదాలు..

గోవాలో హత్యకు గురైన రవితేజ మృతదేహం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ చొరవతో స్వస్థలానికి చేరింది. రవితేజ స్నేహితులు, కుటుంబ సభ్యులు మృతదేహంతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రవితేజ ఫొటోలు ప్రదర్శిస్తూ.. ‘బాయ్‌కాట్‌ గోవా’ అంటూ నినాదాలు చేశారు. ఆటవిడుపు కోసం గోవాకు వెళ్తే రక్షణ కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jan 04 , 2025 | 05:40 AM