Youth Congress Protest: ఈడీ కార్యాలయం ముట్టడి
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:30 AM
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ చార్జీషీట్‌పై యూత్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఈడీ కార్యాలయాన్ని ముట్టడి చేసి, కేసుల ఉపసంహరణ డిమాండ్ చేశారు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
సోనియా, రాహుల్ గాంధీపై కేసులకు నిరసన
కేసుల ఉపసంహరణకు డిమాండ్
హైదరాబాద్, రాంనగర్/బర్కత్‌పుర, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జీషీట్‌లో చేర్చడంపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ భగ్గుమంది. ఈడీ తీరును నిరసిస్తూ హైదరాబాద్, బషీర్‌బాగ్‌లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాన్ని శనివారం ముట్టడించింది. పెద్ద సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈడీ కార్యాలయం వద్ద రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. అయితే, నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించడమే కాక ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి ఖలీద్, రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ గుండాయిజం చేస్తుందని ఆరోపించారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు. రాహుల్‌గాంఽధీకి దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు బనాయించిందని పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందనే భయంతోనే అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.