క్యాప్సికమ్ పనీర్ రైస్
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:35 PM
క్యాప్సికమ్ పనీర్ రైస్‌ను చాలామంది ఇష్టంగా తింటారు. అయితే.. దాన్ని తయారు చేయడంలోనే ఉంటుంది అసలు పనితీరు. దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పదండి మరి..

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం-ఒకటిన్నర కప్పు, పనీర్ - 200గ్రాములు, క్యాప్సికమ్ ముక్కలు - అర కప్పు, క్యారెట్, ఉల్లి ముక్కలు - అర కప్పు, బీన్స్ ముక్కలు - అర కప్పు, టామాటా - అర కప్పు, అల్లం, వెల్లుల్లి ముక్కలు - స్పూను, గరం మసాలా - స్పూను, మిరియాల పొడి - అర స్పూను, నిమ్మరసం - స్పూను, బటర్ - స్పూను, పచ్చి మిర్చి - అర స్పూను, నీళ్లు, నూనె, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: బాస్మతి బియ్యాన్ని నీళ్లలో పదిహేను నిమిషాలు నానబెట్టాలి. ఓ ప్యాన్‌లో కాస్త నూనె వేసి పనీర్, క్యాప్సికమ్ ముక్కల్ని దోరగా వేయించి పక్కన పెట్టాలి. పైన కాస్త ఉప్పు, మిరియాల పొడి జల్లాలి. మరో ప్యాన్‌లో నూనె, బటర్‌ను వేయాలి. కరిగాక ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలూ వేయించాలి. మూడు నిమిషాల తరవాత టామాటా, ఉప్పు, మిరియాల పొడి, బీన్స్, క్యారెట్ ముక్కలూ వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత వడగట్టిన బాస్మతి బియ్యాన్ని కలిపి, తక్కువ మంట మీద ఫ్రై చేయాలి. మసాలా పొడినీ చేర్చాలి. అయిదు నిమిషాల తరవాత తగినంత నీళ్లు పోసి మూత పెట్టాలి. ముప్పావు వంతు బియ్యం ఉడికాక మూత తీసి ఫ్రై చేసిన పనీర్, క్యాప్సికమ్ ముక్కలు జతచేసి బాగా కలపాలి. మరో నాలుగు నిమిషాల తరవాత స్టవ్ కట్టేస్తే క్యాప్సికమ్ పనీర్ రైస్ సిద్ధం.