Abn logo
Oct 22 2021 @ 02:20AM

తెలంగాణను అప్పుల్లో ముంచారు

  • బాకీలు కట్టేందుకు ప్రభుత్వ ఆస్తుల తాకట్టు 
  • టీఆర్‌ఎ్‌సపై  బండి సంజయ్‌ మండిపాటు


హుజూరాబాద్‌/హైదరాబాద్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 21: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు సిగ్గులేకుండా తమపై విమర్శలు చేస్తున్నారన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. బీజేపీ ఆస్తులను అమ్ముతోందని టీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. భూములను అమ్ముతున్నది టీఆర్‌ఎస్సేనని పేర్కొన్నారు. తెలంగాణలో గడీల రాజ్యం కావాలా..? పేదోళ్ల రాజ్యం కావాలా..? ఆలోచించాలని కోరారు. గురువారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని సింగాపూర్‌, తుమ్మనపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లె, కనుకులగిద్దె గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం ప్రచారం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి వెచ్చించే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివేనని అన్నారు. ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌ నాయకులు డబ్బులతో ఓట్లు కొని గెలవాలని చూస్తున్నారని, దొంగ ఉత్తరాలు సృష్టించి గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దళితబంధుపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో భూసార పరీక్షల కోసం కేంద్రం రూ.120 కోట్లు ఇస్తే ఆ డబ్బులను సీఎం కేసీఆర్‌ దారి మళ్లించి హుజూరాబాద్‌లో పంచే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్‌ విమర్శించారు.


టీఆర్‌ఎస్‌ బీసీలను అణచివేస్తోంది: లక్ష్మణ్‌

బీసీలను టీఆర్‌ఎస్‌ అణచివేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. గురువారం లక్ష్మణ్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సమగ్ర సర్వే చేసి కూడా రాష్ట్రంలోని బీసీల జనాభా వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌ బీసీలను ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. దళిత బంధు పథకం కేసీఆర్‌ మాయ అని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. గురువారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అవసరం ఉన్నంత వరకు నాయకులను వాడుకొని వదిలేయడం కేసీఆర్‌కు అలవాటేనని తెలిపారు. 


హుజూరాబాద్‌ ప్రచారంపై అమిత్‌ షా ఆరా

హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచార సరళిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ నాయకత్వం మొత్తం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తోందని సంజయ్‌ వివరించారు. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అది ఓటు రూపంలో వెల్లడి కావడం ఖాయమని అమిత్‌ షాతో పేర్కొన్నారు.