సీబీఐ స్వాధీనంలోని 103 కిలోల పసిడి మాయం

ABN , First Publish Date - 2020-12-13T08:44:22+05:30 IST

ప్రతిష్ఠా త్మక కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ స్వాధీనంలో ఉన్న రూ.43 కోట్ల విలువైన 103.864 కిలోల బంగారం మాయం కావడం తీవ్ర సంచలనం రేపింది. 72 తాళాలు ఉన్న లాకర్ల నుంచి పసిడి అదృశ్యమైన ఘటనపై తమిళనాడు హైకోర్టు...

సీబీఐ స్వాధీనంలోని 103 కిలోల పసిడి మాయం

  • 72 తాళాలున్న లాకర్ల నుంచి అదృశ్యం
  • ఘటనపై మద్రాస్‌ హైకోర్టు విస్మయం
  • సీబీసీఐడీ విచారణకు ఆదేశం.. 
  • 6 నెలల గడువు

చెన్నై, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠా త్మక కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ స్వాధీనంలో ఉన్న రూ.43 కోట్ల విలువైన 103.864 కిలోల బంగారం మాయం కావడం తీవ్ర సంచలనం రేపింది. 72 తాళాలు ఉన్న లాకర్ల నుంచి పసిడి అదృశ్యమైన ఘటనపై తమిళనాడు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దర్యాప్తు సంస్థ నిజాయితీకే ఇది అగ్నిపరీక్ష వంటిందని, దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళ్తే.. 2012లో చెన్నై నగరంలో చట్టవ్యతిరేకంగా బంగారం దిగుమతి అవుతున్న ట్లు సీబీఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో చెన్నై బోస్‌ రోడ్డులోని ప్రముఖ నగల దుకా ణం సురానా కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.


400.47 కిలోల బంగారు కడ్డీలు, నగలను స్వాధీనం చేసుకుని, సురానా సంస్థపైన, ఆ సంస్థకు సహకరించిన కొందరు అధికారులపైన కేసు నమోదు చేశారు. అనంతరం, స్వాధీనం చేసుకున్న బంగారాన్ని సురానా సంస్థలోని లాకర్లలో భద్రపరిచి, సీలు వేశారు. ఆ లాకర్లకు సంబంధించిన 72 తాళాలను, బంగారం స్వాధీనానికి సంబంధించిన రాతపూర్వక రికార్డులను అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో సమర్పించారు. అయితే.. సీబీఐ విచారణలో సదరు బంగారం నిల్వల విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని, బంగారం దిగుమతి విషయంలో విదేశీ వాణిజ్య విధానాలను పాటించలేదని తేలింది. అదేసమయంలో తమ స్వాధీనంలోని బంగారాన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(డీజీఎ్‌ఫటీ)కి బదిలీ చేసేందుకు అనుమతించాలని కోర్టును అభ్యర్థించింది. ఈ క్రమంలో సురానా సంస్థ సీబీఐతో తీవ్రంగా విభేదించింది. డీజీఎ్‌ఫటీకి బంగారాన్ని అప్పగించరాదని వాదనలు వినిపించింది. ఇదిలావుంటే, సురానా సంస్థకు కోట్లలో రుణాలు ఇచ్చిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి.. సదరు బంగారాన్ని తమకు అప్పగించేలా ఆదేశించాలని కోరింది. ఈ క్రమంలో ప్రత్యేక అధికారి(లిక్విడేటర్‌) సమక్షంలో ఆ బంగారాన్ని సురానాకు రుణాలు ఇచ్చిన ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఐడీబీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, స్టాండర్ట్‌ చార్టెడ్‌ బ్యాంక్‌లకు అప్పగించాలని ఆదేశించింది. దీంతో ప్రత్యేక అధికారి.. సీబీఐ అధికారుల సమక్షంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27, 29 తేదీల్లో సురానా సంస్థలోని లాకర్లను తెరచి చూడగా.. వాటిలో 296.606 కేజీల బంగారుపు కడ్డీలు, నగలు మాత్రమే లభించాయి. మిగిలిన 103.864 కేజీల బంగారం మాయమైనట్లు గుర్తించారు. దీంతో మాయమైన 103.864 కేజీల బంగారాన్ని తనకు అప్పగించేలా సీబీఐకి ఉత్తర్వులివ్వాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 


ఎస్పీ స్థాయి అధికారితో విచారణ

ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎన్‌ ప్రకాశ్‌ సీబీఐ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ స్వాధీనంలో ఉన్న బంగారం మాయం కావడం హాలీవుడ్‌ సినిమాలలో జరిగే దోపిడీ సీన్‌లను మించిపోయేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఘ టనపై ఎస్పీ స్థాయి అధికారితో సీబీసీఐడీ విచారణ జరపాలని, 6 మాసాల్లోపు తమకు నివేదికను సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.    


మా పరువు పోతుంది!

విచారణ సందర్భంగా.. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. స్థానిక పోలీసులతో సీబీఐపై విచారణ వేయడం వల్ల సంస్థ పరువు పోతుందని అన్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న న్యాయమూర్తి సీబీఐకి ప్రత్యేకంగా కొమ్ములు లేవని, సీఐడీ విచారణకు సహకరించాలని ఆదేశించారు. ఇదిలావుంటే, బంగారం మాయం ఘటనపై సీబీఐ అంతర్గత విచారణకు ఆదేశించింది. ఎస్పీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించింది. 

Updated Date - 2020-12-13T08:44:22+05:30 IST