మరో ఎమ్మెల్యేకు కరోనా

ABN , First Publish Date - 2020-07-09T09:04:04+05:30 IST

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు

మరో ఎమ్మెల్యేకు కరోనా

  • రాష్ట్రంలో కొత్త కేసులు 1062..
  • సచివాలయంలో మరో 3 కేసులు నమోదు 
  • చిత్తూరులో అత్యధికంగా 308 మందికి..
  • 7 జిల్లాల్లో మరో 12 మంది మృతి
  • మొత్తం పాజిటివ్‌లు 22259 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైరస్‌ బారిన పడగా తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇటీవల అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. పలు ప్రజాకార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బుధవారం సాయం త్రం 7.30 గంటలకు ఆయన జిల్లా కొవిడ్‌ సెంటర్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యాధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 1,062 కొత్త కేసులు వెలుగుచూశాయి. మంగళవారం 27,643 మందికి పరీక్షలు నిర్వహించగా 1,051మంది స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 9మంది, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు కరోనా బారిన పడినట్లు ఆరోగ్యశాఖ నిర్ధారించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 22,259కి చేరింది. తాజాగా 1,332 మంది కరోనా నుంచి కోలుకున్నారు. బుధవారం కర్నూలులో ముగ్గురు, అనంతపురం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 264కు పెరిగాయి.


రాష్ట్ర సచివాలయంలో మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మూడో బ్లాక్‌లో ఐటీఅండ్‌ఈసీ విభాగంలో ఎలక్ర్టికల్‌ ఇంజనీర్‌గా పనిచేసే ఉద్యోగితో పాటు ఇద్దరు బ్యాటరీ వెహికిల్‌ సిబ్బందికి కొవిడ్‌ సోకింది. దీంతో సచివాలయం(31), అసెంబ్లీ(2)ల్లో కలిపి మొత్తం 33 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 24గంటల వ్యవధిలోనే 308 కేసులు వెలుగు చూశాయి. ఈ జిల్లాలో ఒకేరోజు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. ఇందులో తిరుపతి నగరంలోనే 125మంది వైరస్‌ బారినపడ్డారు. గుంటూరు జిల్లాలో మరో 202మందికి కరోనా సోకింది. వీరిలో గుంటూరు నగరంలోనే 87మంది ఉన్నారు. తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాల ఆర్‌ఎంఓ కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 65కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ భార్య, కుమార్తెకు కొవిడ్‌ నిర్ధారణ అయింది.


పెద్దాపురం పరిధిలో ఇటీవల కరోనా సోకిన ఓ బ్యాంకు ఉద్యోగి ద్వారా పదిమందికి వైరస్‌ సంక్రమించింది. జిల్లాలో కొవిడ్‌ లక్షణాలతో బుధవారం మరో నలుగురు మృతిచెందారు. నెల్లూరు జిల్లాలో మరో 31 కేసులు నమోదయ్యాయి. వీటిలో 22 నెల్లూరు నగరానికి చెందినవి. కరోనాతో చికిత్స పొందుతూ మరో ముగ్గురు బుధవారం మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో మరో 51మందికి కరోనా సోకింది. ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయంలో ఓ అధికారికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లాలో 140, శ్రీకాకుళంలో 112, ప్రకాశం జిల్లాలో 110, అనంతపురంలో 87, పశ్చిమగోదావరి జిల్లాలో 78, కృష్ణాజిల్లాలో 70, కడపలో 68, విజయనగరంలో 43 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-07-09T09:04:04+05:30 IST