11 మందికి నెగెటివ్‌

ABN , First Publish Date - 2020-03-30T09:52:30+05:30 IST

తెలంగాణ ప్రజలకు శుభవార్త. కరోనా సోకి చికిత్స పొందుతున్నవారిలో 11 మందికి తాజాగా నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. వీరిని సోమవారం డిశ్చార్జి చేయనున్నారు.

11 మందికి నెగెటివ్‌

నేడు డిశ్చార్జి చేయనున్న వైద్యులు

వారిలో 9 మంది ఇండోనేషియన్లు

ఢిల్లీ వెళ్లొచ్చిన ఇద్దరికి పాజిటివ్‌

వారి ద్వారా స్థానికంగా మరొకరికి

పలు జిల్లాల్లో అనుమానితుల గుర్తింపు

రాష్ట్రంలో 70కు చేరిన కేసుల సంఖ్య

11 నెగెటివ్‌తో యాక్టివ్‌ కేసులు 57


హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలకు శుభవార్త. కరోనా సోకి చికిత్స పొందుతున్నవారిలో 11 మందికి తాజాగా నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. వీరిని సోమవారం డిశ్చార్జి చేయనున్నారు. రాష్ట్రంలో నమోదైన 70 కేసుల్లో ఒకరు చనిపోగా మరొకరు డిశ్చార్జి అయ్యారు. ఇక చికిత్స పొందుతున్న 68 మందిలో తాజాగా 11 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని తొలుత ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ కూడా మీడియా సమావేశంలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో 57 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు కరీంనగర్‌లో మత ప్రచారానికి వచ్చిన 9 మంది ఇండోనేషియన్లకూ తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు తెలిసింది.


వారితో ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు. వారిద్దరికి కూడా తాజా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. మొత్తం 11 మందికి నెగెటివ్‌ రాగా, వారిని సోమవారం డిశ్చార్జి చేయనున్నారు. రాష్ట్రంలో ఆదివారం మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 70కి చేరింది. కొత్త కేసుల్లో ఇద్దరు ఇటీవలే ఢిల్లీలోని ప్రార్థనా మందిరానికి వెళ్లివచ్చినట్లు సమాచారం. వారి ద్వారా స్థానికంగా మరో వ్యక్తికి కరోనా సోకింది.


ఈ మూడు కేసుల్లో ఫారిన్‌ ట్రావెల్‌ హిస్టరీ లేదని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వారితో కాంటాక్టు అయిన వారందర్నీ ఐసోలేషన్‌లో ఉంచారు. ఇప్పటి దాకా ఢిల్లీ ప్రార్థనా మందిరానికి వెళ్లి వచ్చినవారిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో పాతబస్తీ, నాంపల్లి, కుత్బుల్లాపూర్‌కు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. యాదాద్రి భువనగరి జిల్లాకు చెందిన నలుగురు, మహబూబాద్‌ జిల్లాకు చెందిన ముగ్గురు, ఖమ్మం రూరల్‌కు చెందిన ఒకరు కూడా ఢిల్లీ వెళ్లివచ్చిన మతప్రచార బృందంలో ఉన్నారు. వారిని పోలీసులు గుర్తించి, ఐసోలేషన్‌ వార్డులకు తరలించినట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీలోని దర్గాను సందర్శించి వచ్చిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఐదుగురిని కూడా కరోనా అనుమానితులుగా గుర్తించి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకడంతో అదే కార్యక్రమానికి వెళ్లిన నిర్మల్‌ జిల్లాకు చెందిన 33 మందిని, కామారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగుర్ని ఐసోలేషన్‌కు తరలించారు. 


మాల్దీవుల నుంచి వచ్చిన ముగ్గురు యువకులకు కానిస్టేబుల్‌ ఆశ్రయం

తిరుమలగిరి: మాల్దీవుల నుంచి వచ్చిన ముగ్గురు యువకులకు ఓ కానిస్టేబుల్‌ తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. వారు హైదరాబాద్‌ నుంచి వచ్చారని ఇంటి యజమానిని నమ్మించాడు. ఈ నెల 26 వారు కానిస్టేబుల్‌ ఇంట్లో ఉంటున్నారు. స్థానికుల సమాచారంతో అసలు విషయం బయటపడింది. దీంతో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి స్టేషన్‌ కానిస్టేబుల్‌ మాండ్ర శ్రీనును, అతని ఇంట్లో ఉన్న ముగ్గురు యువకులకు చేతిపై స్టాంప్‌ వేసి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచనలు చేశారు. 


హైదరాబాద్‌లోని మదీనాగూడ మైత్రి నగర్‌కు చెందిన ఓ వృద్ధుడికి (70) కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 14న ఆయన అమెరికా నుంచి వచ్చాడు.  22 నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, కొవిడ్‌-19 బృందం ఆయనను 26న గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు కనిపించాయి. అతని కుటుంబ సభ్యుల వివరాలను వైద్య బృందం సేకరిస్తోంది. 


ఆటో డ్రైవర్‌ కుటుంబం క్వారంటైన్‌

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం పొలికేపాడు  గ్రామానికి చెందిన ఓ డ్రైవర్‌ లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తిని తన ఆటోలో క్వారెంటైన్‌కు తరలించాడు. ఆ తర్వాత గ్రామానికి చేరుకున్నాడు. అతను తీసుకెళ్లిన  వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. సీసీ ఫుటేజీ ద్వారా హైదరాబాద్‌ అధికారులు ఆటో డ్రైవర్‌ వివరాలు తెలుసుకొన్నారు. ఆదివారం గ్రామానికి వచ్చిన పోలీసులు అతను ఎవరెవర్ని కలిశాడో ఆరా తీశారు. ఆటోడ్రైవర్‌ కుటుంబ సభ్యులందరికీ క్వారెంటైన్‌ స్టాంపులు వేసి, నాగవరం కేంద్రానికి తరలించారు. 

Updated Date - 2020-03-30T09:52:30+05:30 IST