15 లక్షల కేసులు

ABN , First Publish Date - 2021-04-04T07:59:36+05:30 IST

రాష్ట్రంలో కరోనా రెండో దశ తీవ్రత ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. రోజూ పాజిటివ్‌లు భారీగా నమోదవుతున్నాయి. మార్చి 12 నుంచి నిదానంగా ప్రారంభమైన వ్యాప్తి.. క్రమంగా ఉధృతమవుతోంది.

15 లక్షల కేసులు

  • జూన్‌ నాటికి రాష్ట్రంలో కరోనా తీవ్రతపై వైద్య శాఖ అంచనా
  • దడ పుట్టిస్తున్న కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌
  • ఊహకు అందనంత వేగంగా వ్యాప్తి
  • 15 రోజుల్లోనే పాజిటివ్‌లు 5 రెట్లు
  • మరో 30 వేల పడకలు సిద్ధం
  • మళ్లీ పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రులు
  • రోగుల తరలింపునకు 108లు
  • హోం ఐసొలేషన్‌లో కాల్‌సెంటర్‌ సేవ
  • నగరంలో మళ్లీ క్వారంటైన్‌ కేంద్రాలు
  • జిల్లా ఆస్పత్రుల్లో కరోనా వార్డులు
  • కాంటాక్టుల ట్రేసింగ్‌కు యాప్‌: ఈటల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా రెండో దశ తీవ్రత ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. రోజూ పాజిటివ్‌లు భారీగా నమోదవుతున్నాయి. మార్చి 12 నుంచి నిదానంగా ప్రారంభమైన వ్యాప్తి.. క్రమంగా ఉధృతమవుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడిన వారి సంఖ్య 3.10 లక్షలు కాగా.. ప్రస్తుత పెరుగుదల తీరును బట్టి చూస్తే జూన్‌ చివరికి కేసులు 15 లక్షలకు చేరే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. అయితే, పాజిటివ్‌లు, మరణాల విషయంలో క్షేత్ర స్థాయిలో నమోదవుతున్న గణాంకాలకు, ప్రభుత్వం విడుదల చేస్తున్న లెక్కలకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. మహారాష్ట్ర మాదిరిగా పూర్తి స్థాయిలో వివరాలను ఇస్తే జూన్‌ నాటికి కేసుల సంఖ్య 15 లక్షలు దాటే అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి వైద్య ఆరోగ్య శాఖ అంచనాకు అందడం లేదు. మార్చి 15న కేవలం 204 కేసులు రాగా, ఏప్రిల్‌ 2 నాటికి ఆ సంఖ్య 1,078కి పెరిగింది. కరోనా తొలి దశలో గతేడాది మార్చి 2న తొలి కేసు నమోదు కాగా, జూన్‌ 27న 1,087 పాజిటివ్‌లు వచ్చాయి. అంటే ఒక్క రోజులో వెయ్యి కేసులు నమోదు కావడానికి అప్పట్లో నాలుగున్నర నెలలు పట్టింది. ఇప్పుడు ఆ వ్యవధి 15 రోజులకు పడిపోయింది. 


ఈ వేగం ఆధారంగానే కేసులు 15 లక్షలకు చేరతాయని వైద్య శాఖ భావిస్తోంది. ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో సెకండ్‌ వేవ్‌ తీవ్రస్థాయిలో ఉంటుందని వైద్య శాఖ చెబుతోంది. ఈ నెల చివరికి నగరాల్లో వ్యాప్తి రేటు ఎక్కువగా ఉం టుందని, మే, జూన్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు వస్తాయం టోంది. కాగా.. మొదటి దశలో పట్టణాల్లో 40-50% మంది కొవిడ్‌ బారినపడగా, గ్రామాల్లో అది 25 శాతమే. సెకండ్‌ వేవ్‌లో గ్రామాల్లో మరో 25-35% మందికి కరోనా సోకుతుందని అంచనా. కేసులు పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు రోగులతో నిండుతున్నాయి. మార్చి 12న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,169 మంది చికిత్స పొందుతుండగా, శుక్రవారానికి సంఖ్య 3,784కు చేరింది. మరోవైపు ఏడాదిగా గాంధీ, టిమ్స్‌, కింగ్‌ కోఠి లాంటి దవాఖానల్లో విరామం లేకుండా వైద్య సేవలందిస్తున్నారు. రెండో దశ దృష్ట్యా రెట్టింపు సంఖ్యలో కేసులు వస్తే తట్టుకోవడం కష్టమేనన్న అంటున్నారు.


వ్యాప్తి ఎంత వేగమో.. పతనమూ అంతే

రెండో దశ వ్యాప్తి చాలా వేగంగా ఉంది. జూన్‌ నాటికి తీవ్రమై తగ్గిపోతుందని అంచనా వేస్తున్నాం. వ్యాప్తి ఎంత వేగంగా ఉంటుందో అంతే వేగంగా తగ్గిపోతుంది. రానున్న 3 నెలలు అత్యంత కీలకం. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. పరీక్షలు భారీగా పెంచాం. సెకండ్‌ వేవ్‌ నుంచి బయటపడాలంటే 45 ఏళ్లు దాటినవారంతా టీకా తీసుకోవాలి. వైరస్‌ కట్టడిలో ప్రజల భాగస్వామ్యం కీలకం. మాస్క్‌లు, శానిటైజర్ల వాడకం ముఖ్యం.

డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు


ఉధృతిని ఆపకుంటే కొత్త వేరియంట్స్‌

యూర్‌పలో కరోనా రెండోదశ గతేడాది సెప్టెంబరు 21న మొదలై డిసెంబరులో ఉధృతమైంది. దీన్ని ఆపకుంటే కొత్త వేరియంట్లు వస్తాయి. బ్రిటన్‌లో అదే జరిగింది. అక్కడ మూడో దశ కూడా నడిచింది. మన వద్ద సెకం డ్‌ వేవ్‌ తీవ్రత 3-4 నెలలు ఉంటుంది. మే చివరికి దేశంలో 10 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

 డాక్టర్‌ మాదల కిరణ్‌, డబ్ల్యూహెచ్‌వో సర్టిఫైడ్‌ కొవిడ్‌ నిపుణులు

Updated Date - 2021-04-04T07:59:36+05:30 IST