రాష్ట్రంలో కొత్త కేసులు 2,055

ABN , First Publish Date - 2021-04-09T08:15:57+05:30 IST

రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు 2 వేలు దాటాయి. బుధవారం 2,055 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని, ఏడుగురు చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

రాష్ట్రంలో కొత్త కేసులు 2,055

జీహెచ్‌ఎంసీలోనే 398 నమోదు.. రంగారెడ్డిలో 174..

వైర్‌సతో మరో ఏడుగురి మృతి

పాలమూరులో 55 మంది వలస కార్మికులకు వైరస్‌

మల్యాలలో బోనాల్లో పాల్గొన్న 46మందికి పాజిటివ్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు 2 వేలు దాటాయి. బుధవారం 2,055 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని, ఏడుగురు చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 398 నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 174, నిజామాబాద్‌లో 169, నిర్మల్‌లో 100 మందికి వైరస్‌ సోకింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,362కి చేరింది. 65,468 మందికి టీకా మొదటి డోసు ఇచ్చారు. 6,084 మంది రెండో డోసు తీసుకున్నారు. గురువారం 87,332 మందికి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌ పౌర సరఫరాల భవన్‌లో 15 మంది అధికారులకు పాజిటివ్‌ వచ్చింది. కమిషనర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, జనరల్‌ మేనేజర్‌తో పాటు పలువురు అధికారులకు వైరస్‌ సోకింది. వ్యవసాయ శాఖ కమిషనరేట్‌, తెలంగాణ మార్క్‌ఫెడ్‌ కార్యాలయాల్లో పలువురు ఉన్నతాధికారులు కరోనా బారినపడ్డారు. కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 19 మంది చనిపోయారు. ఈ మరణాలు బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి మధ్య చోటుచేసుకున్నాయి. 


జిల్లాల్లో వందల కేసులు

జగిత్యాల జిల్లా మల్యాల ఎస్సీ కాలనీలో పది రోజుల క్రితం నిర్వహించిన ఎల్లమ్మ బోనాల్లో పాల్గొన్న 46 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాలనీలో గురువారం వైద్య సిబ్బంది ప్రత్యేక శిబిరం నిర్వహించారు. వీరితోపాటు గ్రామానికి చెందిన మరో 13 మందికి వైరస్‌ సోకింది. కరీంనగర్‌ జిల్లాలో గురువారం 112 మందికి పాజిటివ్‌ వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో 90, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 185, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 209, మంచిర్యాల జిల్లాలో 219, ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో 550 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భూత్పూర్‌ మండలంలో కర్వెన రిజర్వాయర్‌ పనుల్లో పాల్గొంటున్న 55 మంది వలస కార్మికులకు వైరస్‌ సోకింది.


మాస్క్‌లేని 90 మందికి ఫైన్‌

సంగారెడ్డి జిల్లాలో మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారికి అధికారులు జరిమానా విధిస్తున్నారు. సంగారెడ్డి, జిన్నారం తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మున్సిపల్‌, పంచాయతీ అధికారులు మాస్క్‌లు ధరించని ఒక్కొక్కరికి రూ.వెయ్యి జరిమానా విధించారు. మొత్తం 94 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిని మెజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెడతామని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.


ఏపీలో 2,558 కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2,558 మందికి కరోనా సోకింది. కొవిడ్‌కు చికిత్స పొందుతూ ఒకరోజు వ్యవధిలో ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 9,15,832కి, మరణాలు 7,268కి చేరుకున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 465 మందికి వైరస్‌ సోకగా.. గుంటూరులో 399, కర్నూలులో 344, విశాఖపట్నంలో 290, నెల్లూరులో 204, శ్రీకాకుళంలో 185, ప్రకాశంలో 153, కృష్ణాలో 152, అనంతపురంలో 131, కడపలో 94 కేసులు బయటపడ్డాయి. కాగా, తమిళనాడులో ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వెళ్లి వచ్చిన పశ్చిమగోదావరి జిల్లా పోలీసుల్లో పది మందికి కరోనా వైరస్‌ సోకింది.

Updated Date - 2021-04-09T08:15:57+05:30 IST