దుబాయిలో 24 గంటల స్టెరిలైజేషన్ కార్య‌క్ర‌మం.. రెండు వారాల పాటు..

ABN , First Publish Date - 2020-04-05T15:13:58+05:30 IST

ప్ర‌పంచాన్ని క‌మ్మేస్తున్న క‌రోనావైర‌స్ గ‌ల్ఫ్‌లోనూ వీర‌విహారం చేస్తోంది. దీంతో ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు గ‌ల్ఫ్ దేశాలు చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

దుబాయిలో 24 గంటల స్టెరిలైజేషన్ కార్య‌క్ర‌మం.. రెండు వారాల పాటు..

దుబాయి: ప్ర‌పంచాన్ని క‌మ్మేస్తున్న క‌రోనావైర‌స్ గ‌ల్ఫ్‌లోనూ వీర‌విహారం చేస్తోంది. దీంతో ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు గ‌ల్ఫ్ దేశాలు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఇప్ప‌టికే ప్ర‌జల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం చేసి, ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించాయి. మ‌సీదుల్లో ప్రార్థ‌న‌లను నిషేధించ‌డంతో పాటు స్కూల్స్, మాల్స్‌, పార్క్స్ మూసివేశాయి. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను సైతం ర‌ద్దు చేశాయి. ఇలా కొవిడ్‌-19 నుంచి దేశ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డానికి గ‌ల్ఫ్ దేశాల‌న్ని క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాయి. తాజాగా దుబాయ్  ఓ అడుగు ముందుకేసి ఏకంగా రెండు వారాల పాటు 24 గంటల స్టెరిలైజేషన్ క్యాంపెయిన్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్రకటించింది. శ‌నివారం రాత్రి నుంచి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది.


ఈ స్టెరిలైజేషన్ క్యాంపెయిన్ విజ‌య‌వంతం కావాలంటే ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దని సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ సుప్రీం కమిటీ సూచించింది. వైరస్‌ను ఎదుర్కోవటానికి మరియు అత్యున్నత స్థాయి రక్షణ చర్యల విజయానికి ప్రజలందరి సమ్మతి చాలా కీల‌క‌మ‌ని ఈ సంద‌ర్భంగా సుప్రీం క‌మిటీ పేర్కొంది. నిత్యావ‌స‌ర స‌రుకుల కొనుగోలుకు ప్ర‌తి ఇంటి నుంచి ఒక్కొ వ్య‌క్తిని మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని క‌మిటీ తెలిపింది. ఇంట్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు ముఖానికి మాస్కులు త‌ప్ప‌నిస‌రి అని చెప్పింది. ప్ర‌జ‌లు ఇంట్లో ఉన్న సామాజిక దూరం పాటించాల‌ని, చేతుల‌కు గ్లౌజ్‌లు, ఎప్ప‌టిక‌ప్పుడు చేతుల‌ను స‌బ్బుతో శుభ్రం చేసుకోవాల‌ని సూచించింది. కీల‌క స‌ర్వీసుల్లో ప‌ని చేసే ఉద్యోగుల‌కు మాత్రం ఈ ఆంక్ష‌ల నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. 


ఆంక్ష‌ల నుంచి మిన‌హాయింపు ఉన్న స‌ర్వీసులివే..

1) ఆరోగ్య సంరక్షణ సేవలు (ఆసుపత్రులు, క్లినిక్‌లు మరియు ఫార్మసీలు)

2) ఆహార సరఫరా అవుట్లెట్లు (యూనియన్ కోఆపరేటివ్ అవుట్లెట్లు, సూపర్ మార్కెట్లు, కిరాణ)

3) డెలివరీ సేవలు (ఆహారం, మెడిసిన్‌)

4) రెస్టారెంట్లు (హోం డెలివరీలకు మాత్రమే పరిమితం చేయబడిన కార్యకలాపాలు)

5) ఔషధాల తయారీదారులు, ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య సామాగ్రిని అందించేవారు

6) పారిశ్రామిక రంగం (ముఖ్యమైన పరిశ్రమలు మాత్రమే)

7) నీరు మరియు విద్యుత్ రంగం, పెట్రోల్ మరియు గ్యాస్ స్టేషన్లు, జిల్లా శీతలీకరణ సేవలు

8) టెలికమ్యూనికేషన్ రంగం

9) మీడియా రంగం

10) కస్టమ్స్ డ్యూటీ, సరిహద్దు క్రాసింగ్‌లు

11) ప్రభుత్వ మరియు ప్రైవేట్ భద్రతా సేవలు

12) మున్సిపాలిటీ సేవలు (చెత్త సేకరణ, మురుగునీటి నిర్వహణ, పారిశుద్ధ్యంలో పాల్గొన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ సర్వీసు ప్రొవైడర్లు)

13) ప్రజా రవాణా (బస్సులు, టాక్సీలకు మాత్రమే అనుమ‌తి; మెట్రో మరియు ట్రామ్ సేవలు నిలిపివేత)

14) నిర్మాణ రంగం (దుబాయ్ మునిసిపాలిటీ మరియు కార్మిక వ్యవహారాల శాశ్వత కమిటీ నుండి అనుమతి పొందిన వాటికి మాత్ర‌మే)

15) బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్‌ సేవలు

16) సామాజిక సంక్షేమ సేవలు

17) నిర్వహణ సేవలు

Updated Date - 2020-04-05T15:13:58+05:30 IST