పాతికా.. ఇరవయ్యారా?

ABN , First Publish Date - 2020-08-10T09:08:04+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా ఎన్ని జిల్లాలు ఏర్పాటు కానున్నాయి..? వాటితో కలిపి మొత్తం జిల్లాల సంఖ్య ఎంత..? ప్రభుత్వానికే దీనిపై స్పష్టత కనిపించడం లేదు. ప్రతి లోక్‌సభ స్థానాన్ని

పాతికా.. ఇరవయ్యారా?

  • ఇంతకూ కొత్త జిల్లాలెన్ని?
  • ప్రభుత్వానికే స్పష్టత కరువు
  • తొలుత 25 అంటూ జీవో
  • తర్వాత 26కి సవరిస్తూ ఉత్తర్వు
  • 3 గిరిజన జిల్లాలతో కలిపి
  • 28 ఉండొచ్చని రెవెన్యూ నివేదిక
  • సీఎస్‌ కమిటీ ఏం తేల్చుతుందో?


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఎన్ని జిల్లాలు ఏర్పాటు కానున్నాయి..? వాటితో కలిపి మొత్తం జిల్లాల సంఖ్య ఎంత..? ప్రభుత్వానికే దీనిపై స్పష్టత కనిపించడం లేదు. ప్రతి లోక్‌సభ స్థానాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న సర్కారు.. ఇప్పుడు డోలాయమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాల ఏర్పాటులో రెవెన్యూ శాఖ చేసిన అధ్యయనాన్ని, అది ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి.. ప్రభుత్వం సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో మరింత గందరగోళానికి లోనవుతోందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుకు అవసరమైన అధ్యయనం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ నెల 7వ తేదీన జీవో 2098 జారీ అయింది. ఇప్పుడున్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. సరిగ్గా 24 గంటలకే దానిని సవరించారు. మొత్తం జిల్లాలు 25 లేదా 26 అన్న పదం జోడిస్తూ శనివారం అర్ధరాత్రి దాటాక జీవో 2101 జారీ అయింది. ప్రభుత్వానికే దీనిపై స్పష్టత కొరవడిందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి కొత్త జిల్లాలు ఎన్ని ఉంటాయన్న విషయంలో రెవెన్యూ శాఖకు ఇప్పటికే ఓ స్పష్టత ఉంది. ఎందుకంటే.. గ్రామం, మండలం, రెవెన్యూ డివిజన్‌, జిల్లాల భౌగోళిక సరిహద్దులు, వాటి పునర్వ్యవస్థీకరణ, ఇప్పటికే ఉన్న జిల్లాల్లో నెలకొన్న సమస్యలు, కొత్తగా ప్రతిపాదించిన వాటి ని యథావిధిగా ఆమోదిస్తే వచ్చే చిక్కులన్నిటిపైనా దానికి అవగాహన ఉంది. ప్రతి లోక్‌సభ స్థానాన్ని ఓ జిల్లాగా ప్రకటిస్తామని రాజకీయ హామీ ఇచ్చేముందు వైసీపీ నాయకత్వం ఏమైనా ఏం అధ్యయనం చేసిందో లేదో తెలియదు. కానీ అదే అంశంపై ఇప్పుడు రెవెన్యూ శాఖ అధ్యయనం చేసి ఇచ్చిన ప్రాధమిక నివేదికలను కూడా ప్రభుత్వ పెద్దలు పట్టించుకున్నట్లు గానీ, వాటిని పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు గానీ లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి.


స్పష్టత ఎందుకు లేదు..? 

తాము అధికారంలోకి వస్తే ప్రతి లోక్‌సభ స్థానాన్ని ఓ జిల్లాగా మారుస్తామని వైసీపీ ప్రకటించింది. అందులో ఒక గిరిజన జిల్లా ఉంటుందని చెప్పింది. అధికారంలోకి రాగానే ఈ ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలని రెవెన్యూ శాఖను జగన్‌ ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. 25 లోక్‌సభ స్థానాలను జిల్లాలుగా మారిస్తే అప్పుడు మొత్తం జిల్లాలు ఎన్ని ఉంటాయి? ఇప్పటికే ఉన్నవాటిని పునర్వ్యవస్థీకరించకుండా కొత్తవాటిని ఏర్పాటు చేయడం అసాధ్యం. రెవెన్యూ శాఖ కూడా ఇదే చెబుతోంది. అయితే అన్నీ కలిపి 25 జిల్లాలే ఉండాలని, ఈ దిశగా కసరత్తు చేయాలని ఆ శాఖను ప్రభుత్వ వర్గాలు ఆదేశిచాయి. ముందుగానే ఓ సంఖ్యను నిర్ణయించి.. దాని ప్రకారమే పునర్విభజన అంటే అనేక చిక్కులు ఉంటాయని రెవెన్యూ శాఖ సర్కారుకు, పలుసార్లు మంత్రివర్గానికి ఇచ్చిన నివేదికల్లో పేర్కొంది. ‘ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా  విభజించవచ్చు. అయితే, అరకు (ఎస్టీ), ఏలూరు లోక్‌సభ స్థానాలకు ఈ సూత్రం వర్తించకపోవచ్చు. ఎందుకంటే విస్తీర్ణం, రోడ్‌నెట్‌వర్క్‌ విషయంలో ఈ రెండు చాలా పెద్దవి. అరకు స్థానాన్ని పార్వతీపురం, అరకు, రంపచోడవరం అనే మూడు జిల్లాలుగా విభజించాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చింది. ఏలూరు లోక్‌సభ స్థానాన్ని కూడా ఏలూరు, పోలవరం జిల్లాలుగా విభజించాల్సి వస్తుందని పేర్కొంది.


ప్రధాన కేంద్రాలు ఎక్కడ?

కొత్త జిల్లాల ఏర్పాటులో జిల్లా ప్రధాన కేంద్రం ఎక్కడుండాలన్నది కీలకమైన అంశమే. ఇప్పుడున్న ఏడు జిల్లాల్లో ప్రధాన కేంద్రాలు సుదూరంగా ఉన్నాయి. ప్రతిపాదిత కొత్త 9 జిల్లాల్లోనూ ఇదే సమస్య. కాబట్టి జిల్లా ప్రధాన కేంద్రం అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త జిల్లాల విభజన చేయాలని రెవెన్యూ శాఖ సూచించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం.. ఇప్పటికే అరకు, ఏలూరు ఎలాగూ జిల్లాలుగా ఉంటాయి కాబట్టి, వాటిని పునర్విభజన చేయడంతో వచ్చే మూడు కొత్త జిల్లాలను కలిపితే జిల్లాలు 28 ఉంటాయని అంచనావేసింది. అయితే అధ్యయన నివేదికలు, డివిజన్‌, మండలాల పునర్విభజన డిమాండ్లు కళ్లముందు ఉన్నా ప్రభుత్వం మాత్రం 25 సంఖ్యనే చెబుతోంది. ఇప్పుడు అనూహ్యంగా అధ్యయన కమిటీని నియమించచాక 25 లేదా 26 జిల్లాలకు పెంచాలన్నది ప్రభుత్వ అభిమతమని ఆదేశాలిచ్చింది. ఈ సంఖ్య అయినా చివరిదాకా ఉం టుందా.. మారిపోతుందా అన్న సందేహాలూ ఉన్నాయి. జిల్లాల విభజనకు ముందే గ్రామం, మండలం, రెవె న్యూ డివిజన్ల వారీగా పునర్విభజన చేపట్టాలి. అప్పుడు తెరపైకి అనేక సమీకరణాలు, వ్యూహాలు వస్తాయి. అప్పటి పరిస్థితులను బట్టి రెవెన్యూశాఖ నివేదికలనే పరిగణనలోకి తీసుకుంటారన్న చర్చ సాగుతోంది.

Updated Date - 2020-08-10T09:08:04+05:30 IST