రాష్ట్రంలో 3 ప్రమాదకర వేరియంట్లు

ABN , First Publish Date - 2021-05-08T08:54:16+05:30 IST

రాష్ట్రంలో కరోనా ఉధృతికి అత్యంత ప్రమాదకరమైన మహారాష్ట్ర, సౌత్‌ ఆఫ్రికా, యూకే వేరియంట్సే కారణమని నిర్ధారణ అయింది.

రాష్ట్రంలో 3 ప్రమాదకర వేరియంట్లు

  • మహారాష్ట్ర, సౌత్‌ఆఫ్రికా, యూకే వైర్‌సల ఉధృతి
  • కేసులు, మరణాల్లో పెరుగుదలకు కారణమిదే
  • సీఎస్ఐఆర్‌-సీసీఎంబీ జన్యు విశ్లేషణలో వెల్లడి
  • ప్రస్తుతం పతాక స్థాయిలో వైరస్‌..
  • త్వరలోనే తగ్గుముఖం పట్టే అవకాశం


హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరోనా ఉధృతికి అత్యంత ప్రమాదకరమైన మహారాష్ట్ర, సౌత్‌ ఆఫ్రికా, యూకే వేరియంట్సే కారణమని నిర్ధారణ అయింది. వీటితోపాటు బ్రెజిల్‌, విచిత్రంగా నైజీరియా వేరియంట్‌ను సైతం గుర్తించినట్లు సీఎ్‌సఐఆర్‌- సీసీఎంబీ పేర్కొంది. ఈ మేరకు జన్యు విశ్లేషణ వివరాలను గ్లోబల్‌ ఇన్షియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లుయెంజా డేటా (జీఐఎ్‌సఎఐడీ)లో ఉంచింది. తెలంగాణలో సెకండ్‌వేవ్‌ ప్రారంభమైన తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి మే 7వ తేదీ మధ్య పలు ప్రాంతాల్లో శాంపిల్స్‌ను సేకరించి, జన్యు విశ్లేషణ చేశారు. మొత్తం 206 నమూనాలు సేకరించగా.. ఇందులో మహారాష్ట్ర వేరియంటే 31 శాతం ఉంది. ఆ తర్వాత సౌత్‌ఆఫ్రికా వేరియంట్‌ 9.7శాతం, నైజీరియా వేరియంట్‌ 8.25 శాతం, యూకే వేరియంట్‌ 7.28 శాతం, ఇతర వేరియంట్స్‌ అన్నీ కలిపి 44 శాతం ఉన్నట్లు జన్యు విశ్లేషణలో తేలింది. ఇందులో ఎక్కువ నమూనాలు హైదరాబాద్‌ (138)లో సేకరించగా, యూకే, సౌత్‌ ఆఫ్రికా, మహారాష్ట్ర, నైజీరియా, బ్రెజిల్‌ వైరస్‌ వేరియంట్లు ఉన్నట్లు వెల్లడైంది. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల వల్ల ఇక్కడ అనేక రకాల వేరియంట్స్‌ ఉన్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, వికారాబాద్‌లో 6, గద్వాలలో 2, నాగర్‌ కర్నూల్‌లో ఒక నమూనాను పరీక్షించగా మహారాష్ట్ర వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారు. 


పతాక స్థాయిలో వైరస్‌..

రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ దాదాపు పతాక స్థాయికి చేరుకుందని, జిల్లాల్లో గత కొన్ని రోజులుగా స్థిరంగా కేసులు నమోదవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాల్లో పడకల కోసం వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ఏప్రిల్‌ చివరి వరకూ పెరుగుతూ వచ్చిన కేసులు ఇప్పుడు తగ్గుతున్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే, హైదరాబాద్‌లో మాత్రం అలాంటి పరిస్థితి లేదని, కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ మూడు ప్రమాదకరమైన వేరియంట్స్‌ ఉండడం వల్లే వైరస్‌ వ్యాప్తి, మరణాల రేటు ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సౌత్‌ ఆఫ్రికా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమైందని, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనూ దాని ప్రభావశీలత 40 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. సౌత్‌ ఆఫ్రికా, మహారాష్ట్ర వేరియంట్స్‌ పరీక్షలకూ చిక్కడం లేదని, బాధితుల ఆరోగ్యం చాలా త్వరగా క్షీణిస్తోందని, మహారాష్ట్ర వేరియంట్‌ సోకిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.


పతాక స్థాయి దశకు చేరుకున్నాం

తూర్పు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న తెలంగాణ జిల్లాల్లో మహారాష్ట్ర వేరియంట్‌ ప్రబలింది. ఇక్కడి నుంచి రాష్ట్రమంతా వ్యాపించింది. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల వల్ల హైదరాబాద్‌లో మహారాష్ట్ర వేరియంట్‌తో పాటు యూకే, సౌత్‌ఆఫ్రికా, నైజీరియా వేరియంట్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లో పతాక స్థాయి దశకు చేరుకున్నాం. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే త్వరలోనే సురక్షిత దశకు చేరుకుంటాం. 

డాక్టర్‌ మాదల కిరణ్‌, హెచ్‌వోడీ, క్రిటికల్‌ కేర్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

Updated Date - 2021-05-08T08:54:16+05:30 IST