300 టన్నుల ఆక్సిజన్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2021-05-14T08:17:30+05:30 IST

రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, కృష్ణపట్నం/ కడప స్టీల్‌ప్లాంట్‌ వద్ద 300 టన్నుల సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని

300 టన్నుల ఆక్సిజన్‌ ప్లాంట్‌

కృష్ణపట్నం/ కడప స్టీల్‌ప్లాంట్‌ వద్ద ఏర్పాటు 

కొవిడ్‌ వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్‌ టెండర్లు: సీఎం

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, కృష్ణపట్నం/ కడప స్టీల్‌ప్లాంట్‌ వద్ద 300 టన్నుల సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కొవిడ్‌ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు పిలిచామని చెప్పారు. కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 45ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేస్తామని ప్రకటించారు. తొలి డోస్‌ తీసుకున్నవారికి రెండో డోస్‌ వేసిన తర్వాతే మిగిలిన వారికి అందజేస్తామన్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకూ 75,49,960 డోసులు వచ్చాయని, వాటిలో 73,70,361 మందికి టీకా వేశామని జగన్‌ చెప్పారు. రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ల అవసరం పెరిగిందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్లాంట్ల స్థాపనపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత కృష్ణపట్నం, కడప స్టీల్‌ప్లాంట్‌కు ఉపయోగపడేలా, రోగుల అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గత నెల 20నాటికి రాష్ట్రానికి 360టన్నుల కేటాయింపులు ఉంటే, ప్రస్తుత వినియోగం సుమారు 600 టన్నులకు చేరిందని సీఎంకు అధికారులు వివరించారు. ప్రస్తుతానికి కేంద్ర కేటాయింపులు 590 టన్నుల వరకూ ఉన్నాయని చెప్పారు. 


వివిధ జిల్లాలకు 8 క్రయోజనిక్‌ స్టోరేజీ ట్యాంకులు పంపిణీ చేశామని చెప్పారు. ఒడిశాలోని వివిధ కర్మాగారాల నుంచి 210 టన్నుల ఆక్సిజన్‌ను సేకరిస్తున్నామని, దీనికోసం 36 వాహనాలు వినియోగిస్తున్నామన్నారు. అందులో 4వాహనాలు గన్నవరం విమానాశ్రయం నుంచి భువనేశ్వర్‌కు ఎయిర్‌లిఫ్ట్‌ చేస్తున్నామని చెప్పారు. దుర్గాపూర్‌లో ఆక్సిజన్‌ను నింపి రాష్ట్రానికి రెండు ఐఎ్‌సఓ ట్యాంకర్లు వస్తున్నాయని వివరించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సామర్థ్యం పెంచాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 15 వేల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 10వేల డి.టైప్‌ సిలిండర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని అధికారులు వివరించారు. అదనంగా 250 వెంటిలేటర్లను సేకరిస్తున్నామని, ఇప్పటికే 50 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 125 కిలోలీటర్ల మెగా స్టోరేజీ  ట్యాంకు కోసం విధివిధానాలు ఖరారు చేస్తున్నామన్నారు. దీన్ని ప్రతిపాదిత ఆక్సిజన్‌ తయారీ ప్లాంటు వద్ద పెట్టించాలని సీఎం సూచించారు. అనంతరం పోస్టుల భర్తీ, బెడ్ల సామర్థ్యంపైనా సీఎం సమీక్షించారు.

Updated Date - 2021-05-14T08:17:30+05:30 IST