మీమాంసం!..బర్డ్‌ ఫ్లూ గుబులు..చికెన్‌ తినేందుకు జంకు

ABN , First Publish Date - 2021-01-11T07:27:49+05:30 IST

చికెన్‌ ప్రియులు, బర్డ్‌ ఫ్లూ భయంతో ఇప్పుడు కోడికూర తినేందుకు జంకుతున్నారు. కొన్నాళ్లుగా చికెన్‌ సెంటర్ల వైపే వెళ్లడం లేదు. పలుచోట్ల ధరలు రూ. 60 నుంచి 80 మేర తగ్గినా చికెన్‌

మీమాంసం!..బర్డ్‌ ఫ్లూ గుబులు..చికెన్‌ తినేందుకు జంకు

50%రాష్ట్రంలో తగ్గిన కోళ్ల అమ్మకాలు

పడిపోయిన ధరలు.. గతంలో కిలో 200-220

పలుచోట్ల ఇప్పుడు రూ.120 నుంచి 160

వనపర్తిలో కిలో చికెన్‌ ధర రూ.120.. 

కామారెడ్డిలో 90 రూపాయలే..

పాతబస్తీలో లైవ్‌ 70కే.. వ్యాపారులు లబోదిబో

పెరిగిన చేపలు, మటన్‌ విక్రయాలు

రొయ్యలు కిలోకు 100, కొర్రమీను 150 పెంపు


బాగా ఉడకబెట్టి తినొచ్చు: డబ్ల్యూహెచ్‌వో

బర్డ్‌ఫ్లూ వల్ల చికెన్‌ అమ్మకాలు నెమ్మదించాయి. వైరస్‌ భయంతో వినియోగం తగ్గింది. కానీ.. కోడి, బాతు మాంసం, గుడ్లు నిర్భయంగా తినొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సగం ఉడికినవి తినొద్దని.. బాగా ఉడకబెట్టిన తర్వాతే తినాలని సూచించింది. కనీసం 70డిగ్రీల సెంటీగ్రేడు(సాధారణంగా వండుకునే ఉష్ణోగ్రత) వద్ద ఉడికిస్తే ఆ వైరస్‌ చనిపోతుందని పేర్కొంది.


హైదరాబాద్‌ సిటీ, న్యూస్‌నెట్‌వర్క్‌ జనవరి 10 (ఆంధ్రజ్యోతి): చికెన్‌ ప్రియులు, బర్డ్‌ ఫ్లూ భయంతో ఇప్పుడు కోడికూర తినేందుకు జంకుతున్నారు. కొన్నాళ్లుగా చికెన్‌ సెంటర్ల వైపే వెళ్లడం లేదు. పలుచోట్ల ధరలు రూ. 60 నుంచి 80 మేర తగ్గినా చికెన్‌ కొనేందుకు ఇష్టపడకపోవంతో ఆ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మునుపటి స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూతో పక్షులు, కోళ్లు చనిపోతున్నాయనే వార్తలు రావడం, మన రాష్ట్రంలోనూ దీనిపై బాగా ప్రచారం జరగుతుండడంతో చికెన్‌ ప్రియులు జంకుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్‌లో ఏదైనా వైరస్‌ ఉంటే 60-70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చనిపోతుందని పశువైద్యాధికారులు చెబుతున్నప్పటికీ. చాలామంది బర్డ్‌ ఫ్లూ భయంతో చికెన్‌ కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. దీంతో గతంలో రోజుకు క్వింటాళ్ల కొద్దీ కోళ్లను, కోడి మాంసాన్ని విక్రయించిన వ్యాపారులు.. అందులో ఇప్పుడు 10 నుంచి 20 శాతం అమ్మకాలు కూడా చేయలేకపోతున్నారు. 


కొక్కెర వ్యాధితోనే!

వనపర్తి జిల్లా కొత్తకోట మునిసిపాలిటీలో 40 నాటుకోళ్లు చనిపోయాయి. ఇవన్నీ బర్డ్‌ ఫ్లూతో చనిపోయాయని వదంతులు రావడంతో పశుసంవర్థకశాఖ అధికారులు కోళ్లకు పరీక్షలు నిర్వహించి కొక్కెర వ్యాఽధితో చనిపోయినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని తాంసి, బోథ్‌, ఆదిలాబాద్‌ మండలాల్లో ఇప్పటివరకు 100 కోళ్లు చనిపోయాయి. కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోళ్లు చనిపోతున్నా వాటిలో బర్డ్‌ ఫ్లూ నిర్థారణ కాలేదు. బర్డ్‌ ఫ్లూ నేపథ్యంలో నిర్మల్‌ జిల్లాలో 18 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చేశారు. ఎక్కడా బర్డ్‌ ఫ్లూ లక్షణాలు కనిపించడంలేదని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. బర్డ్‌ ఫ్లూ భయంతో మాంసాహార ప్రియులు చికెన్‌కు బదులుగా మటన్‌, చేపలను కొంటున్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా చికెన్‌ అమ్మకాలు 50-60 శాతానికి పడిపోగా, చేపలు, మటన్‌ విక్రయాలు మాత్రం జోరుగా సాగాయి. నగరంలోని పాతబస్తీలో లైవ్‌ బర్డ్‌ కిలో రూ.70 నుంచి 80, చికెన్‌ స్కిన్‌లెస్‌ రూ.110 నుంచి రూ.120 వరకు ధర పలికింది. సంగారెడ్డిలో రూ.150కి, సిరిసిల్ల, సిద్దిపేటలో రూ.160కి, వనపర్తిలో రూ.120కి, కామారెడ్డిలో రూ.90కి పడిపోయింది.


ఖమ్మం జిల్లాలో మాత్రం గరిష్ఠంగా కిలో చికెన్‌ రూ.260 నుంచి రూ.270 దాకా పలకడం విశేషం. ఇక హైదరాబాద్‌ రాంనగర్‌లోని చేపల మార్కెట్‌ ఆదివారం కిటకిటలాడింది. సాధారణ రోజుల కంటే మార్కెట్‌కు పెద్ద ఎత్తున చేపలు దిగుమతి అయ్యాయి. కొర్రమీనును మునుపు రూ. 400 నుంచి రూ. 450 విక్రయించగా ఆదివారం రూ. 500 నుంచి రూ. 600 వరకు విక్రయించారు. రొయ్యలు శనివారం కిలో రూ.300కు విక్రయించగా ఆదివారం రూ.400కు, బొచ్చ చేప రూ. 120 నుంచి రూ.140, రవ్వ చేప రూ. 130 నుంచి రూ.150 వరకు విక్రయించారు. ఆన్‌లైన్‌లోనూ చేపల విక్రయాలు పెరిగాయి. ఫ్రెష్‌ టు హోమ్‌, బిగ్‌బాస్కెట్‌, లిసియస్‌ తదితర యాప్‌లపై చికెన్‌ కన్నా చేపలకే డెలివరీలు ఎక్కువగా ఉన్నాయని పలువురు డెలివరీ బాయ్స్‌ తెలిపారు. 


ఈయన పేరు వెంకటేశ్వర్లు. మూసాపేటలో ఉంటూ సనత్‌నగర్‌, మూసాపేట, కూకట్‌పల్లిలోని హోటళ్లకు హోల్‌సేల్‌గా చికెన్‌, మటన్‌ సరఫరా చేస్తుంటారు. పది రోజుల క్రితం దాకా రోజుకు 10 క్వింటాళ్ల చికెన్‌ , ఆదివారమైతే 15 క్వింటాళ్ల వరకు అమ్మేవారు. ఇందులో ఇప్పుడు 10-15 శాతం కూడా సరఫరా చేయడం లేదు. వ్యాపారాన్ని 6 నెలల క్రితం దాకా కరోనా దెబ్బతీస్తే, ఇప్పుడు బర్డ్‌ ఫ్లూతో మళ్లీ కష్టాలు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హోటళ్ల ఆర్డర్లు భారీగా తగ్గిపోయాయని చెప్పారు.


చికెన్‌ ఆస్వాదించండి! 

 చికెన్‌ అమ్మకాలలో తగ్గుదల కనిపించడంతో స్పందించిన పలు యాప్‌ల నిర్వాహకులు వినియోగదారులలో నమ్మకం కలిగించడానికి తమ కోళ్లను ఎంత జాగ్రత్తగా కాపాడతామనేది వివరించారు. వినియోగదారుల ఆరోగ్యానికి ఎప్పుడూ ప్రాధాన్యమిస్తామని, తమ  కోళ్లను బయో సెక్యూర్‌ వాతావరణం కలిగిన ఫామ్స్‌లో, వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో పెంచుతుంటామని, చికెన్‌ను ఆస్వాదించమని సందేశాలు పంపుతున్నారు.  


పాత వీడియోలతో దుష్ప్రచారం 

బర్డ్‌ ఫ్లూ అన్నది కేవలం అపోహే. మన దగ్గర అలాంటి ఆనవాళ్లు ఏమీ లేవు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు కూడా ఇదే చెప్పారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. స్నాప్‌ చాట్‌, తదితర సోషల్‌ మీడియాలో పాత వీడియోలను వైరల్‌ చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలి. ఇలాంటి ప్రచారంతో వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. వదంతులు ఎవరూ నమ్మొద్దు 70 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో చికెన్‌ వండుకుంటాం కాబట్టి అసలు ఎలాంటి సమస్యలుండవు. 

- సత్యనారాయణ రెడ్డి, సిరి ఫామ్స్‌.

Updated Date - 2021-01-11T07:27:49+05:30 IST