టీకా.. ఓకే..!

ABN , First Publish Date - 2021-01-17T08:49:48+05:30 IST

కొవిడ్‌ టీకా కార్యక్రమం రాష్ట్రంలో తొలిరోజు విజయవంతమైంది. శనివారం ఉదయం 10.30కు వర్చువల్‌గా ప్రధాని ప్రసంగం పూర్తవ్వగానే.. రాష్ట్రంలోని 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో

టీకా.. ఓకే..!

కరోనాపై పోరులో.. ప్రపంచానికే భారత్‌ ఆదర్శం

టీకా తయారీలో శాస్త్రవేత్తల కృషి అమోఘం: మోదీ

రాష్ట్రంలో 94% మందికి వ్యాక్సిన్‌.. స్వల్ప దుష్ప్రభావాలు 

అందరికీ కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ

తొలిరోజు రాష్ట్రంలో కొవాగ్జిన్‌ నో

‘కన్సెంట్‌’ పత్రం రాకపోవడమే కారణం

టీకా తీసుకున్న వారికి ఇంకు చుక్క

భయంతో కొన్నిచోట్ల వైద్య సిబ్బంది దూరం

ప్రధాని వ్యాఖ్యలతో టీకా తీసుకోని ఈటల


సరిగ్గా ఏడాది కిందట.. చైనాలోని వూహాన్‌లో కరోనా! తొలుత యూరప్‌ అల్లకల్లోలం.. ఆ తర్వాత అమెరికాలో బీభత్సం! మన దేశానికి వైరస్‌ వస్తే.. బాబోయ్‌ అనుకునేలోపే వచ్చేసింది! 


ఏడాదిలో కోటికిపైగా కేసులు.. లక్షన్నర మందికిపైగా మృత్యువాత.. వారిలో మనం ప్రేమించే ప్రముఖులెందరో! ఏడాదిలో ఎన్ని కష్టాలు.. ఎన్ని కన్నీళ్లు! జీవితాలను తారుమారు చేసేసింది! కుటుంబాలను కల్లోల కడలిగా మార్చేసింది! మనుషులను ఇంట్లోనే బందీలను చేసింది! ఈ పీడ ఎప్పుడు పోతుందని అనుకోనివారు లేరు.


మన శాస్త్రవేత్తల కృషి ఫలించింది. దశాబ్దాలు పట్టే పరిశోధన ఏడాదిలోనే ముగిసింది! కరోనా పుట్టిన చైనాలోనూ ఇంకా పూర్తిస్థాయి టీకా అందుబాటులోకి రాలేదు. కానీ, ‘మేడిన్‌ ఇండియా.. మేకిన్‌ ఇండియా’ టీకాలు మన ముంగిటకు వచ్చాయి! దేశవ్యాప్తంగా శనివారం వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టుకుంది. ఇదో చరిత్రాత్మక సందర్భం! వైరస్‌పై వ్యాక్సిన్‌ విజయం సాధించిన రోజు ఇది! అనుమానాలను పటాపంచలు చేస్తూ విజయ ఢంకా మోగించిన రోజు ఇది. దాదాపు రెండు లక్షల మందికి టీకాలు వేస్తే.. స్వల్ప దుష్ప్రభావాలే కనిపించాయి. 


విజయం దక్కినా.. సంపూర్ణ విజయానికి ఇంకా దూరమే! అందరికీ టీకా అందడానికి మరికొన్నాళ్లు పట్టక తప్పదు. అప్పటి వరకూ మాస్కు.. భౌతిక దూరం.. శానిటైజర్‌ కొనసాగించక తప్పదు! 


దేశంలోనే మొట్టమొదటి టీకాను వేయించుకునేందుకు నేను సిద్ధమని మా సూపర్‌వైజర్‌కు చెప్పాను. టీకాలపై ప్రజలకున్న భయాలు, సందేహాలను దూరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.

మనీశ్‌కుమార్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

 కొవిడ్‌ టీకా కార్యక్రమం రాష్ట్రంలో తొలిరోజు విజయవంతమైంది. శనివారం ఉదయం 10.30కు వర్చువల్‌గా ప్రధాని ప్రసంగం పూర్తవ్వగానే.. రాష్ట్రంలోని 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటి టీకాను గాంధీ ఆస్పత్రిలో సఫాయీ కర్మచారిగా పనిచేస్తున్న వాల కిష్టమ్మకు వేశారు. ఆమె గాంధీ ఆస్పత్రిలో 14 ఏళ్లుగా సఫాయీ కర్మచారిగా పనిచేస్తున్నారు. కరోనా తారాస్థాయిలో ఉన్నప్పుడు ఆమె కుటుంబానికి దూరంగా ఉంటూ.. కొవిడ్‌ వార్డుల్లో సేవలు అందించారు. కొన్నిచోట్ల వ్యాక్సినేషన్‌కు రాకపోవడంతో.. 94% మందికే టీకాలు ఇచ్చారు. అధికారులు తొలుత ప్రతి కేంద్రానికి 30 మంది చొప్పున మొత్తం 4,200 మందికి టీకాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసినా.. పలు కారణాలతో 232 మంది వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నారు. దాంతో.. 3,962 మందికి టీకాలు ఇచ్చారు. గైర్హాజరైనవారిలో.. గర్భిణులు, బాలింతలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు. చాలా మంది భయంతో టీకా వేయించుకునేందుకు రాలేదని తెలుస్తోంది. వారి స్థానంలో.. రెండో జాబితాలో ఉన్న లబ్ధిదారులకు టీకాలు పంపిణీ చేశారు.


అన్నిచోట్లా.. టీకా తీసుకున్న వారి బొటనవేలిపై సిరా చుక్కతో గుర్తుపెట్టారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నాక.. లబ్ధిదారులను అరగంట పాటు పర్యవేక్షణ గదిలో ఉంచారు. అక్కడ వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఆ తర్వాత మరో గంట పాటు వెయింట్‌ హాల్‌లో కూర్చోబెట్టారు. అన్ని చోట్లా కొవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ఏ కేంద్రంలోనూ కోవాగ్జిన్‌ను వాడలేదు. తొలిరోజు కొవాగ్జిన్‌ ‘కన్సెంట్‌’ రాకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెప్పారు. టీకాలు తీసుకున్న వారిలో 11 మందిలో మైనర్‌ సైడ్‌ఎఫెక్ట్‌ కనిపించినట్లు అధికారులు తెలిపారు. నిమ్స్‌ ఆస్పత్రిలో గవర్నర్‌ తమిళిసై, గాంధీలో మంత్రి ఈటల రాజేందర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తిలక్‌నగర్‌ యూపీహెచ్‌సీలో మంత్రి కేటీఆర్‌.. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. వైద్య శాఖ హెచ్‌వోడీలందరికీ తొలిరోజే టీకా ఇచ్చారు. వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ఐపీఎం డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌, గచ్చిబౌలి టిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విమలాథామ్‌సలు గాంధీలో టీకా తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రి సూపరెంటెండ్‌ డాక్టర్‌ నాగేందర్‌, ఛాతీ ఆస్పత్రి చీఫ్‌ మహబూబ్‌ఖాన్‌, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌ ఆయా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ‘‘వ్యాక్సిన్‌పై అపోహలు, అనుమానాలను దూరం చేసేందుకు తొలి టీకాను నేనే వేయించుకుంటా’’ అని ప్రకటించిన మంత్రి ఈటల.. వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. ‘‘ప్రధాని భావోద్వేగంతో మాట్లాడారు. వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు కరోనాపై యుద్ధం చేశారని, వారిలో కొందరు ప్రాణాలను త్యాగం చేశారంటూ కన్నీళ్లు పెట్టారు.


దాంతో.. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నా. నేను టీకా వేయించుకోలేదు. మొదటి వ్యాక్సిన్‌ను సఫాయీ కర్మచారి కిష్టమ్మకు గాంధీ ఆస్పత్రిలో వేశాం’’ అని మంత్రి చెప్పారు.  అటు గ్రేటర్‌ హైదరాబాద్‌లో 34 కేంద్రాల్లో 949 మంది లబ్ధిదారులకు టీకాలు వేశారు. వీరిలో ఎక్కువ మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. ఆ తర్వాత వైద్యులు, నర్సులు, ఆశావర్కర్లకు ప్రాధాన్యమిచ్చారు. గాంధీ ఆస్పత్రిలో 10మంది వైద్యులు, 10 మంది నర్సులు, 10మంది పారిశుధ్య కార్మికులకు టీకా వేశారు. 


అక్కడక్కడా దుష్ప్రభావాలు

కుషాయిగూడలోని యూపీహెచ్‌సీలో ఎంపీహెచ్‌ఏ మహిళకు టీకా వేసిన కొద్ది సేపటికి వాంతులయ్యాయి. ఆమెను మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రికి తరలించి, వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుందని వైద్యులు తెలిపారు.


హైదరాబాద్‌ వెంకట్‌రెడ్డినగర్‌ యూహెచ్‌సీలో నర్స్‌ మాధవికి కొద్దిగ నలతగా అనిపించడంతో.. ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు.

అల్వాల్‌ పీహెచ్‌సీలో ఆయుర్వేద వైద్యాధికారి శైలజకు టీకా వేశాక.. ఆమె తల తిరిగినట్లువుతోందని ఆందోళన చెందారు. ఫార్మసిస్ట్‌ వీరయ్యకు కూడా ఇవే లక్షణాలు కనిపించాయి. ఇక్కడే భాగ్య అనే మహిళ వాంతులు అయినట్లుగా అనిపిస్తోందని వైద్యులకు తెలిపారు.

ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వేసుకున్న ముగ్గురికి చెమటలు పట్టాయి. 15 నిమిషాల తర్వాత కోలుకున్నారు.

సంగారెడ్డిలో టీకా తీసుకున్న ఏఎన్‌ఎం సంగీత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి, పర్యవేక్షణలో ఉంచారు. రక్తపోటు కారణంగా ఆమెకు అస్వస్థత కలిగినట్లు వైద్యులు నిర్ధారించారు.

కొత్తగూడెం జిల్లా ఏరియా ఆస్పత్రిల్లో హెల్త్‌వర్కర్‌ దేవీశ్రీకి వ్యాక్సిన్‌ తీసుకున్నాక కళ్లు తిరగడం, ఆయాసం రావడంతో వెంటనే చికిత్స అందించారు. ఇదే ఆస్పత్రిలో శివారెడ్డి అనే హెల్త్‌వర్కర్‌కు కూడా వ్యాక్సిన్‌ వేసుకున్నాక తలనొప్పి వచ్చింది.

వనపర్తి జిల్లా రేవల్లి సీహెచ్‌సీలో జహీరా అనే పారుశుధ్య కార్మికురాలికి వ్యాక్సిన్‌ తీసుకున్నాక కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఫ్లూయిడ్స్‌ పెట్టారు. ఆమె కొద్దిరోజుల క్రితం రక్తదానం చేయడం వల్ల కళ్లు తిరిగి ఉంటాయని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆమె కోలుకోవడంతో ఇంటికి పంపారు.


టెన్షన్‌ లేకుండా టీకాలు

ఎలాంటి టెన్షన్‌ లేకుండానే కొవిడ్‌ టీకాలు వేయించుకున్నాం. వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు అనిపించలేదు. 30 నిమిషాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండి బయటకు వచ్చాం. మొదటి విడతలో వ్యాక్సిన్‌ వేసుకోవడం సంతోషంగా ఉంది. టీటీ ఇంజక్షన్‌ మాదిరిగా అనిపించింది. వ్యాక్సిన్‌ పై ఎలాంటి అందోళనలు పెట్టుకొవద్దు.

రవళి, కవిత, హసీనా, నిమ్స్‌ స్టాఫ్‌ నర్సులు


టీకా తీసుకున్న తర్వాత డ్యూటీ చేశాను

వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల అనర్థాలు కలుగుతాయన్న అపోహలు పోగొట్టేందుకు అందరికన్నా ముందు టీకా తీసుకున్నా. వ్యాక్సిన్‌ చేయించుకున్న తర్వాత చాలామంది ఫోన్‌లు చేసి ఎలా ఉందని క్షేమ సమాచారం ఆరా తీశారు. ప్రస్తుతానికి ఎలాంటి సమస్య రాలేదు. టీకా తీసుకున్న తర్వాత విధులు  నిర్వహించాను.

డాక్టర్‌ గోపాల్‌, 

గోల్కొండ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌




మోదీనోట గురజాడ గేయం


నార్సింగ్‌, విజయనగరం రూరల్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభం సందర్భంగా దేశమంతా ప్రధాని మోదీ సందేశం కోసం ఎదురు చూస్తోంది. అంతలో.. వ్యాక్సినేషన్‌ సెంటర్లలో ఏర్పాటు చేసిన తెరలపైన మోదీ కనిపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ అని చెబుతున్నారు. అంతలోనే ఆయన తెలుగులో కొన్ని పదాలు చెప్పారు. గురజాడ అప్పారావు రాసిన ‘దేశభక్తి’ గేయంలోని ఓ చరణాన్ని చదివి వినిపించారు. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కేరింతలు, చప్పట్లు కొట్టారు. నార్సింగ్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో.. చప్పట్ల మోత మోగింది. గురజాడ స్వస్థలం విశాఖ, స్థిరపడ్డ జిల్లా విజయనగరంలోనూ స్థానికులు మోదీ నోట గురజాడ గేయం రావడంతో పులకించిపోయారు. దీనిపట్ల తెలుగు సాహితీవేత్తలు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


 గురజాడ స్మరణ

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ సందర్భంగా ప్రధాని మోదీ విఖ్యాత తెలుగు సాహితీవేత్త, మహాకవి గురజాడ అప్పారావును గుర్తుచేసుకున్నారు. ఆయన రాసిన ‘దేశభక్తి’ గేయంలోని చరణాలను వినిపించారు. ‘‘సొంత లాభం కొంత మానుకు.. పొరుగు వారికి తోడు పడవోయ్‌..! దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’’ అన్న చరణాన్ని గుర్తు చేశారు. గురజాడ సిద్ధాంతాన్ని దేశం ఆచరించిందని.. టీకా వచ్చిందని అన్నారు. గురజాడ చెప్పినట్లు పరుల కోసం మనందరం పాటుపడాలని వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలో.. తొలి వ్యాక్సిన్‌ను గాంధీ ఆస్పత్రిలో వేయించుకున్న కిష్టమ్మ; ఆమెకు అభినందనలు తెలుపుతున్న కిషన్‌రెడ్డి, ఈటల, సోమేశ్‌


మా పెద్ద కొడుకు వద్దన్నా..: కిష్టమ్మ

నేను టీకా వేసుకోవాలని అనుకున్నా. అయితే మా పెద్ద కొడుకు వద్దన్నాడు. వేరేవాళ్లు వేసుకున్నాక చూద్దువులే అని చెప్పాడు. అయినా రాష్ట్రంలో నేనే తొలి టీకా వేసుకున్నా. మంత్రి ఈటల సార్‌, వైద్యులు నాకు ధైర్యం చెప్పారు. టీకా వేసుకునేప్పుడు ఈటల సార్‌ నన్ను భయపడుతున్నావా? అని అడిగారు. అవునని చెబితే.. ఏంకాదని భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ ముందుగా సఫాయీ కార్మికులకు టీకాలివ్వాలనడం ఆనందాన్ని కలిగించింది.


కామారెడ్డిలో అదనంగా టీకాలు

రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో నిర్ణీత ప్రణాళిక ప్రకారం 100ు మందికి టీకాలివ్వగా.. మరో 16 జిల్లాల్లో ఆ లక్ష్యం నెరవేరలేదు. కామారెడ్డి జిల్లాలో అనూహ్యంగా 55 మందికి అదనంగా టీకాలిచ్చారు. ఇక్కడ షెడ్యూల్‌ ప్రకారం తొలిరోజు 120 మందికి టీకాలు ఇవ్వాల్సి ఉంది. అయితే.. 55 మందికి అదనంగా వ్యాక్సిన్‌ వేశారు. సంగారెడ్డి జిల్లాలో 180 మందికి గాను.. 147 మందే టీకాలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 35, సిద్దిపేటలో 24, పెద్దపల్లిలో 30, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 35, మెదక్‌లో 20, ములుగులో 20, జగిత్యాలలో 22, వరంగల్‌ అర్బన్‌లో 16, నారాయణపేట్‌లో 13, కొత్తగూడెంలో 7, హైదరాబాద్‌లో ముగ్గురు, ఖమ్మంలో 10, మహబూబాబాద్‌లో ఐదుగురు, నల్లగొండలో ఏడుగురు, సూర్యాపేటలో 10 మంది టీకా వేయించుకునేందుకు ఆసక్తి కనబర్చలేదు. కొన్ని చోట్ల టీకాలు వేయించుకునేందుకు వైద్య సిబ్బంది ఇష్టపడకపోవడంతో.. వారి స్థానంలో రెండో విడత జాబితాలో ఉన్న వారికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. వరంగల్‌ అర్బన్‌లోని వర్ధన్నపేటలో సమయాభావం వల్ల 11 మందికి టీకా ఇవ్వలేకపోయారు.



ఆనందంగా ఉంది

కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల నాకు ఎలాంటి అలసట, నొప్పులు కలగలేవు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రాంనగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో మొదటి టీకా వేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

 బింగి మంజుల, ఆశా కార్యకర్త


శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు

తొలి రోజు తొలి టీకా తీసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. కరోనా వ్యాక్సిన్‌ రూపొందించిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు. కరోనా కష్ట సమయంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ కర్ణన్‌ మా వెన్నువెంట ఉండి ధైర్యం కల్పించారు. 

సూర్యపోగు మేరీ, హెడ్‌నర్స్‌



Updated Date - 2021-01-17T08:49:48+05:30 IST