ఎగుమతుల్లో 9% క్షీణత

ABN , First Publish Date - 2020-12-03T06:22:57+05:30 IST

ఎగుమతుల రంగం నవంబరులో కూడా నిరాశావహంగానే ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎగుమతులు 9 శాతం క్షీణించి 2343 కోట్ల డాలర్లకు (రూ.1.76 లక్షల కోట్లు) పరిమితమయ్యాయి.

ఎగుమతుల్లో 9% క్షీణత

8 నెలల్లో 17.84 శాతం డౌన్‌

రూ. 74,700 కోట్లకు వాణిజ్య లోటు


న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం నవంబరులో కూడా నిరాశావహంగానే ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎగుమతులు 9 శాతం క్షీణించి 2343 కోట్ల డాలర్లకు (రూ.1.76 లక్షల కోట్లు)  పరిమితమయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌, రసాయనాల ఎగుమతులు తగ్గడం ఇందుకు కారణమని ప్రభుత్వం విడుదల చేసిన అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. దిగుమతులు కూడా 13.33 శాతం క్షీణించి 3339 కోట్ల డాలర్లకు (రూ.2.51 లక్షల కోట్లు) తగ్గాయి. వాణిజ్యలోటు 996 కోట్ల డాలర్లకు (రూ.74,700 కోట్లు) తగ్గింది. ఆయిల్‌ దిగుమతులు 43.34 శాతం క్షీణించి 627 కోట్ల డాలర్లకు దిగివచ్చాయి. కాగా ఏప్రిల్‌-నవంబరు నెలల మధ్య కాలంలో ఎగుమతులు 17.84 శాతం ప్రతికూల వృద్ధితో 17,349 కోట్ల డాలర్లకు దిగజారాయి. వాణిజ్య దిగుమతులు 33.56 శాతం క్షీణించి 21,567 కోట్లకు తగ్గాయి.  


కార్పొరేట్ల ఆదాయాల్లో వృద్ధి

ఆర్థిక కార్యకపాలు క్రమంగా పుంజుకుంటున్నాయని.. వచ్చే ఏడాది భారత కార్పొరేట్‌ రంగంలో పరిస్థితులు మెరుగుపడనున్నాయని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. అన్ని రంగాల్లోనూ గిరాకీ పునరుద్ధరణతో కార్పొరేట్‌ కంపెనీల ఆదాయాలు వృద్ధి చెందనున్నాయని అంటోం ది. ఆర్థిక పరిపుష్టి కలిగిన కంపెనీలు సులభంగా నిధులు సమీకరించగలుగుతాయని, మిగతా కంపెనీలకు మాత్రం సవాళ్లు తప్పవని అభిప్రాయపడింది. కాగా 2020-21లో భారత జీడీపీ వృద్ధి రేటు - 10.6 శాతం క్షీణతను నమోదు చేసుకోవచ్చని మూడీస్‌ అంచనా. 


నియామకాల జోరు

ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం ఉద్యోగ నియామకాలపై సానుకూల ప్రభావం చూపుతోందని టీమ్‌లీజ్‌ పేర్కొంది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో కంపెనీల నియామకాల ఉద్దేశం మరో 3 శాతం పెరగనుందని అంటోంది. కొత్త ఉద్యోగులను నియమించుకునే ఉద్దేశంలో ఉన్న వాటిలో బడా, మధ్య కంపెనీలే ముందున్నాయి.  చిన్న తరహా సంస్థలు కూడా ఈ త్రైమాసికంలో గణనీయ వృద్ధిని నమోదు చేసుకున్నాయని తెలిపింది. 


మళ్లీ ప్రగతి పథంలోకి : రాజీవ్‌కుమార్‌

వృద్ధి క్షీణత నుంచి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బయటపడుతోందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. తాజాగా విడుదలైన రెండో త్రైమాసిక(క్యూ2) జీడీపీ గణాంకాలే ఇందుకు నిదర్శనమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. డిసెంబరుతో ముగియనున్న మూ డో త్రైమాసికం(క్యూ3)లో వృద్ధి రేటు ఏడాది క్రితం స్థాయిలో ఉండనుందని.. నాలుగో త్రైమాసికం(క్యూ4)లో మళ్లీ పాజిటివ్‌ జోన్‌లోకి ప్రవేశించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేపట్టిన వ్యవస్థాగత సంస్కరణలు ఇందుకు దోహదపడనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-12-03T06:22:57+05:30 IST