Abn logo
May 26 2020 @ 00:00AM

రైతు సంక్షమానికే సమగ్ర సాగు విధానం

ప్రతీ ఎకరాకు రైతుబంధు

నియంత్రిత వ్యవసాయంపై అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

ఇజ్రాయెల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి : ఎంపీ నామా 


ఖమ్మం, మే 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతు సంక్షేమం కోసమే సమగ్ర పంటల సాగు విధానాన్ని అమల్లోకి తెచ్చామని, ప్రతీ ఎకరాకు రైతుబంధు పథకం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి మంత్రిపువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు. ఖమ్మంలో టీటీడీసీ సమావేశ మందిరంలో సోమవారం వానాకాలంలో నియంత్రిత సాగు విధానంపై ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్‌, ఎన్నెస్పీ ఇరిగేషన్‌, సివిల్‌ సప్లయీస్‌ అధికారులతో జరిగిన అవగాహన సదస్సులో మంత్రి ప్రసంగించారు. ప్రతీ ఎకరానికి రైతుబంధు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పంటల విధానాన్ని అధికారులు పకడ్బందీగా అమలుచేయాలని, గ్రామస్థాయిలో ప్రతి రైతుకు అవగాహన కల్పించి లాభసాటి వ్యవసాయం, అధిక దిగుబడి, గిట్టుబాటు ధరలు పొందేలా ప్రోత్సహించాలన్నారు.


మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను వేయాలని సూచించారు. రాష్ట్రంలోనే భిన్నంగా ఉన్న ఖమ్మం జిల్లాలో మొత్తం 3,14,000 ఎకరాల్లో పత్తి, మిర్చి, కంది ,పెసర,వరి, మినుము వంటి అన్ని రకాల పంటలు సాగవ్వనున్నాయని అన్నారు. మొక్కజొన్న పంట వర్షాకాలంలో వేయకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా 3,18, 000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.354కోట్లు, 1,48,886 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేసి రూ.80కోట్లు రైతులకు చెల్లించామన్నారు. జిల్లాలో ఎన్నెస్పీ, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో చెవువులు నింపాలని, సీతారామ సాగునీటి ప్రాజెక్టు ద్వారా మెట్టప్రాంత ఆయకట్టుకు నీరందించాలని ఆదేశించారు. 


జిల్లా సమగ్రాభివృద్ధికి ఐదేళ్లప్రణాళిక అవసరం..ఎంపీ నామా నాగేశ్వరరావు

ఇజ్రాయిల్‌ దేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని పంటలు సాగుచేస్తే దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఎంపీ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఇజ్రాయెల్‌లో సాగునీటి పథకాలు లేనప్పటికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్కువ నీటితో వ్యవసాయం చేస్తున్నారని, అదే స్ఫూర్తితో ఖమ్మంజిల్లాలో కూడా నూతన వ్యవసాయ విధానం ముందుకు సాగాలని అన్నారు. జిల్లాలో ఐదేళ్ల సమగ్రాభివద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక ఏర్పాటుచేసి మ్యాపింగ్‌ చేయాలన్నారు. ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రాధాన్యం ఉందని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, జిల్లాలో అన్నిచోట్ల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రతిపాదనలు చేయాలని సూచించారు.  ఆర్గానిగ్‌ పంటల సాగును కూడా పెంచాలన్నారు. 


అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ జిల్లాలో నూతన వ్యవసాయ విధానానికి చేపడుతున్న చర్యలను వివరించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కిందిస్థాయిలో సమన్వయ లోపం వల్ల రైతులకు పంటలసాగుపై రైతులకు అవగాహ ఉండడంలేదని,  సబ్సిడీ పథకాలు అందడంలేదని అన్నారు.  ఈ సమావేశంలో పాలేరు, వైరా ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్‌, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌కొండబాల కోటేశ్వరరావు, మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్ర రాజశేఖర్‌, జడ్పీచైర్మన్‌ కమల్‌రాజ్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు వివిధ శాఖల అధికారులుపాల్గొన్నారు. అనంతరం ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లకు జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కృషిచేసిన జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ను, అదనపు కలెక్టర్‌ మధుసూదనరావు మార్క్‌ఫెడ్‌ డీఎం సుధాకర్‌లను మంత్రి పువ్వాడ, ప్రజాప్రతినిధులు శాలువా కప్పి సన్మానించారు.  

Advertisement
Advertisement