అరెరే పోలీసులు ఎంత పని చేశారు.. చెప్తున్నా వినకుండా యువకుడిని అనవసరంగా..

ABN , First Publish Date - 2022-01-29T02:39:01+05:30 IST

పోలీసులు తప్పులో కాలేశారు. ముందూ వెనకా ఆలోచించకుండా, కేవలం రెండు విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని అమాయకుడిని అరెస్ట్ చేశారు. ‘మీరు అనుకుంటున్న వ్యక్తిని నేను కాదు బాబోయ్’

అరెరే పోలీసులు ఎంత పని చేశారు.. చెప్తున్నా వినకుండా యువకుడిని అనవసరంగా..

ఎన్నారై డెస్క్: పోలీసులు తప్పులో కాలేశారు. ముందూ వెనకా ఆలోచించకుండా, కేవలం రెండు విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని అమాయకుడిని అరెస్ట్ చేశారు. ‘మీరు అనుకుంటున్న వ్యక్తిని నేను కాదు బాబోయ్’ అని అతడు ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు. ఐదు రోజుల పాటు కస్టడీలో పెట్టారు. చివరకు తప్పు తెలుసుకుని నాలుక కరుచుకుని, అతడిని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాకు చెందిన లియోనార్డో సిల్వా ఒలివెరా అనే యువకుడికి ప్రస్తుతం 26ఏళ్లు. దొంగతనం కేసులో పోలీసులు ఇతడిని 2017లో అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల కళ్లు కప్పి ఈ యువకుడు తప్పించుకున్నాడు. దీంతో అధికారులు అతడి కోసం వేట ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఫ్లోరిడా అధికారులు అదే పేరు, దాదాపు సమాన వయసున్న మరో యువకుడిని పట్టుకున్నారు. ఎత్తూ, పర్సనాలిటీ సుమారు ఒకే విధంగా ఉండటంతో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 



‘నేను స్థానికంగా ఉన్న రెస్టారెంట్‌లో వంట చేస్తుంటాను, ఇది నా డ్రైవింగ్ లైసెన్స్’ అని ఎన్ని ఆధారాలు చూపించినా అధికారులు మాత్రం వినిపించుకోలేదు. ఈ క్రమంలో అతడి తరఫు లాయర్ రంగంలోకి దిగాడు. ‘జైలు నుంచి పారిపోయిన వ్యక్తి 213 పౌండ్ల బరువు ఉంటే.. నా క్లయింట్ 150 పౌండ్ల కంటే తక్కువ ఉన్నాడు. నా క్లయింట్‌పై ఇప్పటి వరకూ ఏ కేసూ నమోదు కాలేదు’ అని వాదించాడు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా అధికారుల ముందు పెట్టాడు. చివరకు ఫింగర్‌ ప్రింట్స్‌ను పరిశీలించిన అధికారులు.. తప్పు తెలుసుకున్నారు. దాదాపు ఐదు రోజుల తర్వాత ఆ యువకుడిని రిలీజ్ చేశారు. కాగా.. అధికారులు వ్యవహరించిన తీరు స్థానికంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది.




Updated Date - 2022-01-29T02:39:01+05:30 IST