భద్రాద్రి వైద్యశాలకు అరుదైన ఘనత

ABN , First Publish Date - 2022-01-19T05:18:18+05:30 IST

భద్రాద్రి వైద్యశాలకు అరుదైన ఘనత

భద్రాద్రి వైద్యశాలకు అరుదైన ఘనత
భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయు విభాగం ఎదుట వైద్యులు

ఎస్‌ఎన్‌సీయూ విభాగానికి ఎన్‌ఎన్‌ఎఫ్‌ గుర్తింపు

భద్రాచలం, జనవరి 18: ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల మరో అరుదైన ఘనతను సాధించింది. వైద్యశాలలోని నవజాత శిశు చికిత్స కేంద్రానికి(ఎస్‌ఎన్‌సీయూ) నేషనల్‌ నియోనేటనాలజీ ఫోరం(ఎన్‌ఎన్‌ఎఫ్‌) నుంచి అధికారిక గుర్తింపు లభించింది. లెవల్‌-2ఏ కింద భద్రాచలం వైద్యశాలను గుర్తిస్తూ ఎన్‌ఎన్‌ఎఫ్‌ అక్రెడిటేషన్‌- 2021-22/294 జారీ చేస్తూ మంగళవారం ఇందుకు సంబంధించిన సమాచారం ఏరియా వైద్యశాల అధికారులకు అందింది. 2021 డిసెంబరు 27న ఎన్‌ఎన్‌ఎఫ్‌ అధికారుల బృందం భద్రాచలం ఏరియా వైద్యశాలను క్షేత్రస్థాయిులో తనిఖీ చేసింది. ఈ క్రమంలో ఎన్‌ఎన్‌ఎఫ్‌ నిర్దేశించిన మౌళిక సదుపాయాలు, వసతులు ఉండటం, ఆ స్థాయిలో వైద్యం నవజాత శిశువులకు అందుతున్న విషయాన్ని గుర్తించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ అధునాతన సాంకేతిక పరికరాలతో భద్రాచలంలోని ఎస్‌ఎన్‌సీయులోనే నవజాత శిశువులకు అత్యవసర వైద్యం అందిస్తుండటంతో ఎన్‌ఎన్‌ఎఫ్‌ అక్రెడిటేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ఎన్‌ఎన్‌ఎఫ్‌ జాతీయ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ దినేష్‌ తోమర్‌ నుంచి అధికారిక సమాచారం ఎస్‌ఎన్‌సీయూ వైద్యాధికారులకు అందింది.  

దశాబ్ధకాలం క్రితం ఆవిర్భావం

ఏజెన్సీ ప్రాంతంలో జన్మించిన శిశువుల్లో పలువురు వివిధ సమస్యలతో సతమతమవుతున్న విషయాన్ని గుర్తించి వీరికి అత్యవసర వైద్యం అందించేందుకు 2012ఆగస్టు 8న భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రాంగణంలో నవజాత శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 17వేల మంది శిశువులు అత్యవసర వైద్యం కోసం ఎస్‌ఎన్‌సీయులో చేరగా అందులో 16వేలకు పైగా మెరుగైన చికిత్స పొందారు. ఈ నవజాత శిశు కేంద్రంలో తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన శిశువులకు ఇక్కడ వైద్య సహాయం అందించారు. ఐటీడీఏ పీవో సహకారంతో ఈ విభాగానికి అత్యాధునిక పరికరాలు సమకూర్చారు.  

డిసెంబరు 27న సందర్శించిన ఎన్‌ఎన్‌ఎఫ్‌ అధికారులు 

భద్రాచలం ఎస్‌ఎన్‌సీయుకు లెవల్‌-2ఏ అక్రెడిటేషన్‌ ఇచ్చేందుకు గత ఏడాది డిసెంబరు 27న  నేషనల్‌ నియోనేటనాలజీ ఫోరానికి చెందిన అధికారుల బృందం తనిఖీ చేసింది. నిబంధనల ప్రకారం పరికరాలు, వసతులు, మెరుగైన వైద్యసేవలు ఉండటంతతో అధికారికంగా గుర్తింపునిస్తూ మంగళవారం సమాచారం పంపారు. అధికారిక ధ్రువీకరణ పత్రం త్వరలో అందజేస్తారు. భద్రాద్రి ఏరియా వైద్యశాల ఎస్‌ఎన్‌సీయు విభాగం ద్వారా అరుదైన ఘనతను సాధించడంతో వైద్యులు, సిబ్బంది హర్హం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏరియా వైద్యశాల సూపరింటెండ్‌ డాక్టర్‌ ఎం.రామకృష్ణ ఎస్‌ఎన్‌సీయు విభాగం బాధ్యులు డా.క్రాపా విజయ్‌ మాట్లాడుతూ ఇది సమిష్టికృషి వల్లనే సాధ్యమైందన్నారు. ఇందుకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2022-01-19T05:18:18+05:30 IST