ఒక ఆస్పత్రిలో ఒకే స్పెషాలిటీ

ABN , First Publish Date - 2021-07-28T08:55:40+05:30 IST

రాష్ట్ర రాజధానిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో స్పెషాలిటీ సేవలందించాలని భావిస్తోంది. గచ్చిబౌలిలోని టిమ్స్‌, సనత్‌నగర్‌లోని ఛాతీ ఆస్పత్రితో పాటు, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి

ఒక ఆస్పత్రిలో ఒకే స్పెషాలిటీ

హైదరాబాద్‌లో నిర్మించ తలపెట్టిన నాలుగు దవాఖానాల్లో ‘ప్రత్యేక’ సేవలు

గ్యాస్ట్రో, న్యూరో, నెఫ్రాలజీ, కార్డియాలజీ

కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని యోచన

భవన నిర్మాణం, డిజైన్ల బాధ్యత ఆర్‌అండ్‌బీకి


హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో స్పెషాలిటీ సేవలందించాలని భావిస్తోంది. గచ్చిబౌలిలోని టిమ్స్‌, సనత్‌నగర్‌లోని ఛాతీ ఆస్పత్రితో పాటు, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు  మధ్యలో ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని న్యూరో, గ్యాస్ట్రో, కార్డియాలజీ, నెఫ్రాలజీ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సర్కారు ఆలోచిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్‌ వద్ద జరిగిన సమీక్షలో కూడా ఇదే అంశంపై చర్చించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నాలుగు ఆస్పత్రుల ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది.


ఒక్కో ఆస్పత్రిని 1,000-1,500 పడకలతో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులుగా ఏర్పాటు చేసినా అవి కూడా సాధారణ ఆస్పత్రుల మాదిరిగానే ఉండిపోతాయని సర్కారు భావిస్తోంది. రూ.కోట్లు ఖర్చు పెట్టినా.. మామూలు ఆస్పత్రిగా మిగిలిపోవడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాస్తవానికి   నాలుగు ఆస్పత్రులను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులుగానే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత వాటిని ఒక్కో స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలన్న యోచనకు సర్కారు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు బెంగళూరులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జయ్‌దేవ్‌ ఆస్పత్రి కార్డియాలజీ సేవలనే అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఆ ఆస్పత్రి కార్డియాలజీ సేవల్లో పేరుగాంచింది. అందులో 20 క్యాథ్‌ల్యాబ్స్‌ ఉన్నాయి. 24 గంటల పాటు కార్డియాలజీ సేవలను అందిస్తున్నారు. మన దగ్గర కూడా అలాగే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర మూత్రపిండాలు, గుండె జబ్బులు, న్యూరో, గ్యాస్ట్రో సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇటువంటి వాటి కోసమే ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. కాగా, ఇప్పటికే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ ఆస్పత్రులకు ఎంతగానో పేరు వచ్చింది. కేన్సర్‌ రోగుల కోసం ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి, చిన్నారుల కోసం నిలోఫర్‌.. చెవి, ముక్కుగొంతు రోగుల కోసం ఈఎన్‌టీ, ఛాతీ, సరోజినీ దేవీ కంటి ఆస్పత్రి.. ఇలా అన్నీ కూడా ప్రత్యేక వ్యాధులకు చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసినవే.


60 శాతానికిపైగా పడకల కేటాయింపు..

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ కేంద్రాల్లో 60 శాతానికి పైగా బెడ్స్‌ ఆ ప్రత్యేక స్పెషాలిటీకే కేటాయిస్తారు. ఉదాహరణకు కార్డియాలజీ ఆస్పత్రిలో వెయ్యి  పడకలుంటే అందులో 500-600 పడకల వరకు కేవలం గుండె సంబంధిత జబ్బుల రోగులకే కేటాయిస్తారు. మిగిలిన 40 శాతం పడకల్లో ఇతర విభాగాలు కూడా ఉంటాయి. కానీ అవన్నీ కార్డియాలజీ సంబంధితమైనవిగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆస్పత్రిలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. రోజూ శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. దాంతో అసిస్టెంట్స్‌, పీజీలు కూడా అక్కడ చేరేందుకు ఆసక్తి చూపుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


భవన నిర్మాణ బాధ్యత ఆర్‌ అండ్‌ బీకి..

ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి రూ.600-రూ.900 కోట్లు ఖర్చు కానుంది. భవన డిజైన్లు, నిర్మాణ బాధ్యత రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. వైద్య వసతుల కల్పన(క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌) అంతా తెలంగాణ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ) చూసుకోనుంది. ఈ ఆస్పత్రుల నిర్మాణాన్ని ఏడాదిన్నర సమయంలో పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది.

Updated Date - 2021-07-28T08:55:40+05:30 IST