వెలుగు వైపు నడుద్దాం

ABN , First Publish Date - 2021-07-02T05:30:00+05:30 IST

లోకం అంటేనే వెలుగు, చీకటుల సమ్మేళనం! వెలుగును జ్ఞానంతో, మంచితో... చీకటిని అజ్ఞానంతో, చెడుతో పోల్చడం అనాదిగా ఉన్నదే. వెలుగు అంటే సత్యం. దైవమే సత్యం. ఆ సత్యాన్ని నమ్ముకొనేవాడికి మరి....

వెలుగు వైపు నడుద్దాం

లోకం అంటేనే వెలుగు, చీకటుల సమ్మేళనం! వెలుగును జ్ఞానంతో, మంచితో... చీకటిని అజ్ఞానంతో, చెడుతో పోల్చడం అనాదిగా ఉన్నదే. వెలుగు అంటే సత్యం. దైవమే సత్యం. ఆ సత్యాన్ని నమ్ముకొనేవాడికి మరి దేనితోనూ పని ఉండదు. అతను అనుసరించేది దైవాన్ని... ఆ దైవ కుమారుడైన ఏసు ప్రభువు చూపిన మార్గాన్ని. అందుకే  సజ్జనుడు నిర్భయంగా ఉంటాడు. దైవం అనే వెలుగును జీవితంలోకి తెచ్చుకోలేనివాడు అంధకారంలో ఉండిపోతాడు. అలాంటి అంధకారంలో అతను దేన్నీ చూడలేడు. విచక్షణ కోల్పోతాడు. చివరకు వెలుగంటే భయపడతాడు. దైవానికి దూరంగా, నిష్పలంగా బతుకుతాడు. ఇదే విషయాన్ని యోహాను తన సువార్తలో స్పష్టం చేశాడు. చెడ్డ పనులు చేసే వ్యక్తికి వెలుతురంటే భయంగా ఉంటుంది. ఎందుకంటే అతను దుష్ట కర్మలు చేసేదంతా చీకటిలోనే.


వెలుగులోకి వస్తే అతను చేసిన చెడ్డ పనులు బయట పడిపోతాయి. అందుకే అతను చీకటినే ప్రేమిస్తాడు. చీకటికే పరిమితమైపోతాడు. వెలుగులోకి రాడు. కానీ మంచి పనులు చేసే వ్యక్తి అలా కాదు. అతనికి భయం ఉండదు. వెలుగులోకి ధైర్యంగా అడుగు పెడతాడు. అతను దేవుడి ఆదేశానుసారం నడుస్తాడు. అతను చేసే కార్యాలన్నీ దైవ సమ్మతమైనవే... కాబట్టి భయం అనేది అతని దగ్గరకు కూడా చేరదు. విశ్వాసులు ఎందరో ఉంటారు. కానీ దైవంతో ఆత్మానుబంధాన్ని ఏర్పరచుకొనేవారు చాలా తక్కువ. అటువంటివారు ముందుకు వెళ్ళలేరు. వారిని ఇంకా చీకటి ఆవరించి ఉన్నట్టే! ఈ చీకటి వెలుగుల్లో మనం ఎక్కడున్నామో తెలుకోవాలి. వెలుగు వైపు నడవాలి. దైవ విశ్వాసమనే కాంతిలో మనల్ని మనం పరిపూర్ణం చేసుకోవాలి. దైవమార్గంలో సాఫల్యాన్ని సాధించాలి.

Updated Date - 2021-07-02T05:30:00+05:30 IST