Abn logo
Jul 2 2021 @ 00:00AM

జవాబు చెప్పుకోవాల్సింది ఆయనకే

పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. అతను గర్విష్టి. అంతకు మించి పిసినారి. అతనికి అపారమైన సంపద ఉండేది. దాన్ని ఎక్కడ దాచాలా అని ఆలోచించేవాడు. కొన్నాళ్ళ తరువాత ఒక ఆలోచన కలిగింది. ఒక శిల్పిని పిలిచి, రహస్య ధనాగారాన్ని దృఢంగా నిర్మించాలని ఆదేశించాడు. దానికి ఉండే రహస్య ద్వారం సంగతి కనీసం భార్యకూ, పిల్లలకూ సైతం తెలియనివ్వలేదు. స్వయంగా తాళం వేసేవాడు. తాళం చెవిని తన దగ్గరే ఉంచుకొనేవాడు. 


ఆ ధనాగారాన్ని నిర్మించిన శిల్పి కూడా ధనాశలో రాజుకు తగినవాడే. రాజుకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. దానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ధనాగారం గోడలకు అమర్చిన రాతి పలకల్లో... రాజుకు తెలియకుండా రహస్య మార్గం ఏర్పాటు చేశాడు. మరణించే ముందు తన కుమారులిద్దరికీ ఆ సంగతి చెప్పి కన్ను మూశాడు. డబ్బు కావలసివచ్చినప్పుడల్లా వాళ్ళిద్దరూ ఆ మార్గాన్ని ఉపయోగించుకొనేవారు.


రోజూ డబ్బును చూసి మురిసిపోయే అలవాటు ఉన్న రాజు క్రమంగా తన ధనం మాయం కావడం గమనించాడు. ‘ఈ పని నా దర్బారులో ఉన్న వాళ్ళే చేస్తున్నారు’ అనుకున్నాడు. ధనాగారంలో కత్తెర బోను ఏర్పాటు చేశాడు. 


ఎప్పటిలాగానే దొంగతనానికి వచ్చిన సోదరులిద్దరిలో ఒకడు ఆ బోనులో చిక్కుకున్నాడు. తనను గుర్తుపట్టే పరిస్థితి రాకూడదని అన్నతో తన తల నరికించేసుకున్నాడు. ఆ తలను అతని అన్న ఇంటికి తీసుకుపోయాడు.


మర్నాడు ధనాగారానికి వచ్చిన రాజుకు... దొంగతనాలు చేస్తున్నది ఇద్దరని అర్థమైపోయింది. కత్తెర బోనులో ఉన్న మొండేన్ని కోట గోడకు వేలాడదీయించాడు. ఎవరైనా దాన్ని చూసి, ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తే బంధించాలని కాపలావాళ్ళకు ఆదేశాలిచ్చాడు. 


శిల్పి తల్లి తన కుమారుడి తలను చూసి కన్నీరుమున్నీరయింది. మొండేన్ని కూడా తీసుకురావాలని పోరుపెట్టింది. దీంతో అన్న బయలుదేరాడు. కాపలా వాళ్ళను తప్పతాగించి, మత్తులో ముంచి, తమ్ముడి మొండేన్ని దించుకొని ఇంటికి తీసుకుపోయాడు. 


ఇది తెలుసుకున్న రాజుకు అతను అసాధ్యుడని అర్థమయింది. అందాలరాశి అయిన తన కూతురును ఈసారి ఎర వేశాడు. నేర్పుతో కూడిన సాహస కార్యం చేసిన వాణ్ణే పెళ్ళాడతానని ఆమెతో ప్రకటింపజేశాడు. 


అప్పుడు శిల్పి  పెద్ద కొడుకు అక్కడకు వెళ్ళాడు. తన సోదరుడి తలనూ తీసుకుపోవడం, మొండేన్ని మాయం చెయ్యడం గురించి చెప్పి... తనను పెళ్ళాడమన్నాడు. ఆమె అతణ్ణి కాపలా వాళ్ళకు పట్టించబోయింది. కానీ అతను తెలివిగా తప్పించుకున్నాడు.


ఇదంతా గమనించిన రాజుకు ఆ యువకుడు అసాధ్యుడనిపించింది. ‘ఇలాంటి వాడు నాకు అల్లుడయితే ఇక దిగులే ఉండదు’ అనుకున్నాడు. ఖజానాదొంగను శిక్షించే ప్రసక్తే లేదని చాటించాడు. అప్పుడు ఆ యువకుడు బయటపడి, రాజు దగ్గరకు వచ్చాడు.


‘‘ఇప్పుడు నిన్ను నరికేస్తే నీకు దిక్కెవరు?’’ అని అడిగాడు రాజు. 


‘‘మీరు రాజు కాబట్టి మిమ్మల్ని అడిగే సాహసం ఎవరికీ లేదు. కానీ, ఒక సంగతి ఆలోచించండి. మీరు ఆడిన మాట తప్పితే... పరలోకంలో అల్లా్‌హకు కచ్చితంగా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. మీరైనా, నేనైనా, ఎవరైనా సరే... చివరకు సమాధానం చెప్పాల్సింది ఆయనకే కదా!’’ అన్నాడతను.


అతని ధైర్యానికి రాజు ముచ్చటపడ్డాడు. తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేసి, అర్థరాజ్యాన్ని కానుకగా ఇచ్చాడు.


మహమ్మద్‌ వహీదుద్దీన్‌