Advertisement
Advertisement
Abn logo
Advertisement

చాలా కాలం తర్వాత Telugudesam ఆఫీసులో సందడి.. హైకమాండ్ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి దిగనున్న Nara Lokesh!

చాలా కాలం తర్వాత ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సందడి మొదలవ్వడానికి కారణమేంటి? పార్టీని సంస్థాగతంగా మరితం పటిష్టం చేసే దిశగా అడుగులు పడుతున్నాయా? కార్యకర్తల్లో కొత్త జోష్ నింపేందుకు ప్రధాన నేతలు సిద్ధమయ్యారా? పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు అందుబాటులో ఉండాలని తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద కసరత్తే జరిగిందా..? ఈ గ్రౌండ్ వర్క్ వెనుక ఉన్న అసలు కథేంటి..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.

లోకేష్ ఉద్యమానికి మంచి రెస్పాన్స్..!

ఏపీలో అధికార మార్పిడి జరిగి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. సంస్థాగతంగా పటిష్టమయ్యేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రతిపక్ష పార్టీగా తొలి ఏడాది ప్రజా సమస్యలపై బాగానే పోరాడింది. పార్టీ అధినేతతో పాటు ప్రధాన నేతలు సైతం నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు. కరోనా కారణంగా తర్వాత పరిస్థితి మారింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఇతర నేతలంతా జూమ్‌లోనే సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. పార్టీ నేతలపై కేసులు, అరెస్టులకు నిరసనగా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. జాబ్ క్యాలెండర్, గుంటూరులో రమ్య హత్య కేసు, కర్నూలులో మరో యువతి హత్య కేసు వ్యవహారంలోనూ తెలుగుదేశం క్రియాశీలకంగా వ్యవహరించింది. టెన్త్, ఇంటర్ విద్యార్దుల పరీక్షల రద్దుపై కూడా లోకేష్ ఉద్యమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కరోనా తగ్గడంతో ఇక పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని అధిష్టానం నిర్ణయించింది.

ఇదే జోష్ కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారా..?

గత కొద్దిరోజులుగా పార్టీ ముఖ్య నేతలతో పాటు జిల్లాల్లో కార్యకర్తలు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నేతల్లో వచ్చిన ఇదే జోష్ ను కొనసాగించాలని పార్టీ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గాల ఇన్ ఛార్జిలను వెంటనే నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీని కోసం నియోజకవర్గాలలో ఉండే పార్టీ నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. మరికొన్ని నియోజకవర్గాలలో ఇన్ ఛార్జిలు ఉన్నప్పటికీ.. వారు అంత క్రియాశీలకంగా లేకపోవడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో వారిని పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. వారికి ఆసక్తి లేకపోతే, ఆ స్థానంలో కొత్తవారిని వెంటనే నియమించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.

యాక్టీవ్‌గా లేని ఇన్ ఛార్జిలకు క్లాస్..?

పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రతిరోజూ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల నుంచి ద్వితీయ శ్రేణి నేతలు, ఇన్ ఛార్జిలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు వీరికి అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఒక వారం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు, మరో వారం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉండనున్నారు. కార్యకర్తలు, నేతలు చెప్పే సమస్యలు, సలహాలతో పాటు పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. క్రీయాశీలకంగా లేని నియోజకవర్గాల ఇన్ ఛార్జిలను కూడా రాష్ట్ర కార్యాలయానికి పిలిపించి.. పని తీరును మెరుగు పరచుకోకపోతే తప్పించాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించి పంపుతున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, క్రమశిక్షణా చర్యలును పెండింగ్ లో ఉంచడం ఇలాంటివి ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు.

లోకేష్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు ప్లాన్..!

రానున్న రెండు, మూడు నెలల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడం, సంస్థాగతంగా పటిష్టం కావడంపై చంద్రబాబు, లోకేష్, అచ్చెంనాయుడు దృష్టి సారించారు. లోకేష్ ఇక ప్రజాసమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా విస్తతంగా పర్యటించాలని నిర్ణయించారు. చిన్న సంఘటన జరిగినా అక్కడకు వెళ్లనున్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి ఆపద వచ్చినా వెళ్లి పరామర్శించడం, వారిని న్యాయపరంగా ఆదుకోవడం లాంటి అంశాలపై లోకేష్ దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా తెలుగు విద్యార్ధి, తెలుగు యువత, ఇతర అనుబంధ సంఘాలపై ఆయన ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.

కార్యాలయంలో నేతలు, కార్యకర్తల సందడి..

గత కొద్ది రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం.. నేతలు, కార్యకర్తలతో హడావుడిగా కనిపిస్తోంది. ముఖ్యంగా అచ్చెంనాయుడు పార్టీ కార్యాలయంలోనే మకాం వేశారు. గుంటూరు, కృష్ణాతో పాటు ఇతర జిల్లాల నుంచి ఆయా నియోజకవర్గాల నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళంపై కూడా ఆయన దృష్టి సారించారు. నియోజకవర్గాల ఇన్ ఛార్జిలను రాబోయే నెలరోజుల లోపు పూర్తిగా నియమించాలని నిర్ణయించారు. ఆ తర్వాత క్రియాశీలకంగా లేని వారిని తొలగించేందుకు కూడా వెనుకాడకూడదని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

మాస్టర్ ప్లాన్ ఇదీ..

పలు నియోజకవర్గాలలో నేతల మధ్య విభేదాలపై కూడా టీడీపీ దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు వీటిని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించి, గ్రామస్థాయిలోకి వెళ్లాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.


Advertisement
Advertisement