గుడిలో మూడు సార్లు తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా..? తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై తుడుచుకుంటున్నారా..?

ABN , First Publish Date - 2021-09-30T01:04:02+05:30 IST

ఆలయాలకు వెళ్లినప్పుడు స్వామి, లేదా అమ్మవారి దర్శనం అనంతరం ఎవరైనా ప్రసాదం కోసం వేచిచూస్తారు. ఆ ప్రసాదాన్నే మహాప్రసాదంగా స్వీకరిస్తారు. అలాగే పురోహితుడు మంత్రాలు చదువుతూ చేతిలో పోసే తీర్థం.. అమృతంతో సమానంగా

గుడిలో మూడు సార్లు తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా..? తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై తుడుచుకుంటున్నారా..?

ఆలయాలకు వెళ్లినప్పుడు స్వామి, లేదా అమ్మవారి దర్శనం అనంతరం ఎవరైనా ప్రసాదం కోసం వేచిచూస్తారు. ఆ ప్రసాదాన్నే మహాప్రసాదంగా స్వీకరిస్తారు. అలాగే పురోహితుడు మంత్రాలు చదువుతూ చేతిలో పోసే తీర్థం.. అమృతంతో సమానంగా భావిస్తారు. తీర్థం తీసుకోగానే... ఏదో తెలీని శక్తి వచ్చినట్లు ఉంటుంది. పంచామృతాలు, తులసీ దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తులు అందులో ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. దీంతోనే ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది. ఆరోగ్యం, ఆధ్యాత్మికత పెరుగుతుంది అనే భావనతో తీర్థం తీసుకోవాలని సూచిస్తున్నారు. పురోహితులు తీర్థం మూడు సార్లు ఇవ్వడం మనం చూస్తుంటాం.. 


అయితే, తీర్థం ఎలా తీసుకోవాలి..? మూడు సార్లే ఎందుకు తీసుకోవాలి.. ? అనే విషయాల గురించి మీకు తెలుసా. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. రెండోసారి తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడో సారి తీసుకునేటప్పుడు.. పరమేశ్వరుడి పరమ పదం అనుకుని తీసుకోవాలి. వీటిని సేవిచండం ద్వారా కనిపించే, కనిపించని రోగాలు కూడా త్వరలో నయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి.


 తీర్థం ఎలా తీసుకోవాలనే విషయం చాలా మందికి తెలీదు. మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం.. తీర్థ ప్రసాదాల్లో వివిధ రకాలు ఉన్నాయి. జల తీర్థం, కషాయ తీర్థం, పంచామృత తీర్థం, పానక తీర్థం ఇస్తూ ఉంటారు. జల తీర్థం ద్వారా.. అకాల మరణం, సర్వ రోగాలు నివారించాబడతాయి. అలాగే కష్టాల నుంచి ఉపశమనాన్ని ఇచ్చి.. అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.  కషాయ తీర్థాన్ని.. కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మి, కొల్లూరు ముకాంబిక, హిమాచలప్రదేశ్‌‌లోని జ్వాలమాలిని, అస్సాంలోని శ్రీ కామాఖ్య ఆలయాల్లో ఇస్తారు. అదేవిధంగా పంచామృత అభిషేక తీర్థాన్ని సేవించడం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవడంతో పాటూ బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందని ప్రతీతి.


మంగళగిరి నరసింహస్వామి, అహోబిల నరసింహ స్వామికి పానకం నైవేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి, పానకాల నరసింహస్వామిగా ఖ్యాతినార్జించారు. స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి, వచ్చే భక్తులకు పానకాన్ని ప్రసాదంగా ఇస్తుంటారు. దీన్ని తీసుకోవడం ద్వారా దేహంలో ఉత్సాహం పెరగడం వల్ల కొత్త చైతన్యం వస్తుంది. దేహంలోని వేడి సమ స్థితికి వచ్చేలా పని చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి, తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదని చెబుతున్నారు. అలాగే ఎముకలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవని పురోహితులు వ్యాఖ్యానిస్తున్నారు.


 చాలా మంది తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడని.. దీంతో మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసినట్లు అవుతుంది. అందుకే అలా చేయకుండా కళ్లకద్దుకోవడం మంచిదని సూచిస్తున్నారు. తీర్థాన్ని పంచామృతంతో చేస్తారు కాబట్టి.. అందులో పంచధార, తేనే వంటివి ఉంటాయి. కనుక దీన్ని తలకు అంటించడం వల్ల జుట్టుకు మంచిది కాదని.. సైన్స్ చెబుతోంది. గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలకు రాసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఇంట్లో తీర్థం తీసుకునేప్పుడు కింద కూర్చునే తీసుకోవాలి. గుడిలో మాత్రం నిలబడే తీసుకోవాలని పురాణాలు సూచిస్తున్నాయి.

Updated Date - 2021-09-30T01:04:02+05:30 IST