Abn logo
Oct 28 2020 @ 05:03AM

ఎర్ర బంగారం క్వింటాలు రూ. 19,500

ఖమ్మం మార్కెట్‌ , అక్టోబరు 27: ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఎర్ర బంగారానికి (తేజా రకం ఏసీ మిర్చికి) రోజు రోజుకూ ధరల పెరుగుదల కొనసాగుతోంది. మంగళవారం మార్కెట్‌లో ఏసీ మిర్చిని క్వింటాలు రూ. 19,500లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. కరోనా ప్రత్యేక సెలవుల అనంతరం మార్కెట్‌లో క్వింటాలు రూ.14,000 ల నుంచి ప్రారంభమైన ఏసీ మిర్చి ధరలు కొన్ని రోజులు ధర పెరుగుతూ, మరికొన్ని రోజులు ధర తగ్గుతూ ప్రస్తుతం క్వింటాలుకు రూ 19,500 వేలకు చేరింది.  సెప్టెంబరు 25 న మార్కెట్‌లో క్వింటాలు రూ. 2,0175 లు రికార్డు ధర పలికిన మిర్చి ధరలు తగ్గడంతో రైతులు నిరాశ చెందారు. వారం క్రితం క్వింటాలు రూ. 19,000లు పలికిన తేజారకం ఏసీ మిర్చి రోజు రోజుకూ రూ. 100,  రూ.200లు ధర పెరుగతూ క్వింటాలుకు రూ. 500 పెరిగింది. మిర్చికి దేశీయంగా, అంతర్జాతీయంగా చైనా, థాయిలాండ్‌, మలేషియా, సింగపూర్‌, శ్రీలంకలో డిమాండ్‌  పెరగటంతో ధరలు పెరుగుదల ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లను మార్కెట్‌ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ ఛైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, మార్కెట్‌ కార్యదర్శి రుద్రాక్షల మల్లేశం సమీక్షిస్తున్నారు.

Advertisement
Advertisement