Abn logo
Jul 14 2020 @ 02:45AM

దేవాంశ.. రాక్షసాంశ

మహాహాటక దేశానికి రాజు ఉద్యోతనుడు. అతనికి కోమలి, సుతీక్ష్ణ అని ఇద్దరు భార్యలు. కోమలి కుమారుడు సర్వహితుడు. సుతీక్ష్ణ కుమారుడు చండార్కుడు. పేర్లకు తగినట్టుగానే.. సర్వహితుడు అందరితో సౌమ్యంగా ఉంటే, చండార్కుడు అందరితో చాలా కరుకుగా ఉండేవాడు. దీనికి కారణం వారి తల్లులే. సర్వహితుడికి అతడి తల్లి రామయాణ, భారతాది ధర్మగ్రంథాల గురించి చెప్తే.. సుతీక్ష్ణ చండార్కుడికి ఆ గ్రంథాల్లోని రావణ, దుర్యోధనాదుల రాచఠీవి గురించి చెప్పేది. వారు శత్రువుల చేతుల్లో చనిపోయినా.. బతికినంత కాలం రారాజులుగా ఉన్నారని, కనుక వారిలాగా జీవించాలని బోధించేది. ఇద్దరూ గురుకులానికి వెళ్లారు. కొద్దిరోజుల్లోనే ఇద్దరి మనస్తత్వాల్లోని తేడాను గురువు గమనించాడు. సర్వహితుడికి శాస్త్రపాఠాలను, చండార్కునికి పురాణకథలను చెబుతుండేవాడు. పండ్లు, సమిధల కోసం ఒకసారి అడవిలోకి వెళ్లిన చండార్కునిపైకి.. పర్వతాకారంలో ఉన్న పెద్ద అడవిదున్న వచ్చి కుమ్మబోయింది.


గుండెలవిసిపోయేంత భయంతో కొయ్యబారిపోయాడు చండార్కుడు. ఇక తన పని అయిపోయిందని అనుకునేంతలో.. ఒక పెద్ద గండభేరుండ పక్షి వచ్చి అతణ్ని అమాంతం కాళ్లతో పట్టుకొని ఆకాశంలోకి దూసుకెళ్లింది. అక్కడికి దూరంలోని ఒక మర్రిచెట్టుపై వాలి అతణ్ని పొడుచుకు తినే ప్రయత్నం చేసింది. ఇంతలో మరో భేరుండం అక్కడికి రావడంతో రెండూ కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో చెట్టు మీద నుంచి కింద పడ్డ చండార్కుడు బతుకుజీవుడా అని కుంటుకుంటూ ఆశ్రమానికి వెళ్లాడు. గురువు ఆజ్ఞ మేరకు సర్వహితుడు అతడికి మూలికలతో చికిత్స చేయగా మరునాటికి నొప్పి తగ్గిపోయింది. కొన్నాళ్లకు..  గురువుగారు చెప్పే పురాణకథలో దైవాంశ, రాక్షసాంశ అనే విషయాలు చర్చకు వచ్చాయి. ఈ అంశలను మానవులందరిలో ఉంటాయని గురువు చెప్పాడు. అప్పుడు చండార్కుడు.. ‘వారిని గుర్తించడం ఎలా?’ అని అడిగాడు.


‘నువ్వు అడవికి వెళ్లిరా. ఈసారి నీతో సర్వహితుని కూడా తీసుకుని వెళ్లు. నీ ప్రశ్నకు సాయంత్రం జవాబు చెబుతాను’ అన్నాడు గురువు. చండుడు తన సోదరునితో కలిసి అడవిలోకి వెళ్లాడు. అక్కడ అతడికి తనపైకి దూకిన అడవి దున్న కనిపించింది. కానీ, దాని కన్నుల్లో క్రౌర్యం లేదు. అది చాలా వినయంగా వారి వైపు వచ్చింది. పక్కనే ఉన్న చెట్టు పై నుంచి గండభేరుండం వారి ముందు వాలింది. దున్న తన కాలికి ఉన్న గాయాన్ని, పక్షి తన రెక్కలకు ఉన్న గాయాన్ని సర్వహితునికి చూపించాయి. వాటిని ప్రేమగా నిమిరిన సర్వహితుడు.. దగ్గరగా ఉన్న  ఆకుల పసరు వాటికి పూశాడు. అవి కళ్లల్లో కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ వారికి దూరంగా వెళ్లాయి.


ఆశ్చర్యంగా చూస్తున్న చండునితో.. ‘‘నీ మీద దాడి చేసినప్పుడు చెట్టు బోదె తగిలి కాలు విరిగి బాధపడుతున్న ఎనుముకు, రెక్క విరిగి పడి ఉన్న భేరుండానికి నేను చికిత్స చేశాను. అందుకే అవి నాదగ్గరకు అలా వచ్చాయి’ అని చెప్పాడు సర్వహితుడు. ఇద్దరూ ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి గురువు వారిని చిరునవ్వుతో స్వాగతించి సాభిప్రాయంగా చండుని వైపు చూశాడు. తన ప్రశ్నకు గురువుగారు సమాధానం చెప్పకనే చెప్పారని చండార్కునికి అర్థమైంది. నాటి నుంచి సర్వహితుడిలా అతడు కూడా మంచి గుణాలతో మెలగసాగాడు. మనం కూడా సర్వహితునిలాగా దైవీ గుణాలను అలవరచుంటే లోకమంతటికీ బంధువులం కావచ్చు.


ఆచార్య రాణి సదాశివ మూర్తి

Advertisement
Advertisement
Advertisement