సమగ్ర తెలుగు నిఘంటువు నా కల

ABN , First Publish Date - 2022-02-28T05:30:00+05:30 IST

సాహిత్య సృజనలో మహిళల సంఖ్యకు కొదవలేదు. అదే తెలుగు భాషాశాస్త్రంలో, నిఘంటువుల రూపకల్పనలో మహిళల సంఖ్యను వేళ్లమీద లెక్కించవచ్చు. అలాంటి అతి తక్కువ మందిలో ఒకరు ఆచార్య యద్దనపూడి రెడ్డి శ్యామల. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠాధిపతిగా,

సమగ్ర  తెలుగు నిఘంటువు నా కల

సాహిత్య సృజనలో మహిళల సంఖ్యకు కొదవలేదు. అదే తెలుగు భాషాశాస్త్రంలో, 

నిఘంటువుల రూపకల్పనలో మహిళల సంఖ్యను వేళ్లమీద లెక్కించవచ్చు. 

అలాంటి అతి తక్కువ మందిలో ఒకరు ఆచార్య యద్దనపూడి రెడ్డి శ్యామల. 

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠాధిపతిగా,

నిఘంటు నిర్మాణ శాఖాధిపతిగా ఆమె తెలుగు భాషాప్రియులకు సుపరిచితులు.

విద్యార్థుల కోసం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తరపున నిఘంటువును రూపొందించారు.

అదీ 22వేల పదాలతో... తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి తెలుగు పాఠాలు బోధిస్తున్న

ఆమె తన పయనాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు. 


‘‘ఒక నిఘంటువు రూపకర్తగా... కాలక్రమంలో కనుమరుగవుతున్న పద సంపదను గ్రంథస్తం చేయడం నా బాధ్యత. ఈ పని అనుకున్నంత సులువేమీ కాదు. కొన్నిసార్లు రోజుల తరబడి నిద్రాహారాలు మానేసి పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేము. అంత కష్టపడినా దక్కే గుర్తింపు అంతంత మాత్రమే. అందుకే ఇటు వైపు రావడానికి ఎక్కువమంది ఆసక్తి చూపించరు. ఇక ఈ విభాగంలో మహిళలు చాలా తక్కువ. కానీ నిఘంటువు నిర్మాణం చాలా గొప్ప పని. దీనిద్వారా  ఎన్నో పదాలు కలకాలం పదిలమవుతాయి. మన శ్రమ ఫలితం తరతరాలకూ నిలుస్తుంది. గడిచిన ముఫ్ఫై ఏళ్లలో అనేక నిఘంటువుల తయారీలో భాగస్వామినయ్యాను. విద్యార్థులకు ఉపయోగపడే డిక్షనరీ ఒకటి రూపకల్పన చేయమని ‘ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ’ వాళ్లు నన్ను సంప్రతించారు. అంతకుముందే వాళ్లు నమూనాగా రెండు వేల పదాలకు అర్థాలు నాతో రాయించారు. అవి నచ్చడంతో నాకు ఆ ప్రాజెక్టు ఇచ్చారు. అలా 22వేల పదాలతో ‘కంపాక్ట్‌ ఇంగ్లీష్‌ - ఇంగ్లీష్‌ - తెలుగు నిఘంటువు’ను రూపొందించాను. అందుకోసం రోజూ రాత్రి తొమ్మిది నుంచి అర్థరాత్రి రెండింటి వరకూ మూడేళ్లు కష్టపడ్డాను.


పగలంతా యూనివర్సిటీ బాధ్యతల్లో తలమునకలవుతూనే ఆ పని పూర్తిచేయగలిగాను. ఆ క్రమంలో నాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా కొన్ని వ్యవహారిక పదాల అర్థఛాయల్ని పట్టుకోవడం చాలా కష్టమైంది. నిఘంటువులో ఒక పదానికి అర్థం పొందుపరిచేపటప్పుడు... సమతూకం పాటించాలి. ఉదాహరణకు ఆంగ్లంలో ‘కౌ’ అంటే తెలుగులో ‘ఆవు’ అని రాయాలి. ‘గోవు’ అంటే అర్థం మారుతుంది. అలాగే ఆంగ్లంలో ‘జస్ట్‌’ అనే పదానికి తెలుగు అర్థం రాయడానికి నాకు వారం పట్టింది. ఇలాంటి అనుభవాలు ఎన్నో.


ఔత్సాహికులకు శిక్షణనిస్తాం...

రసాయన, భౌతిక, జీవ, వైజ్ఞానిక, మనోవైజ్ఞానిక, ఖగోళ... ఇలా 22 విభాగాల్లోని రెండు లక్షలకుపైగా పారిభాషక పదాలను సమీకరించి ‘శాస్త్ర, సాంకేతిక పద నిధి’ నిఘంటువును తయారు చేశాం. దీనికోసం మేమంతా ఐదేళ్లు శ్రమించాం. కానీ, నిధులు లేక అది బీరువాలకే పరిమితమైంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోయ, సవర నిఘంటువుల నిర్మాణంలోనూ పాల్గొన్నాను. తెలంగాణ పదకోశం తయారీకి నా వంతు సహకారం అందించాను. అసలు నా ప్రయాణం 1989లో తెలుగు యూనివర్సిటీ చేపట్టిన ‘పత్రిక భాషా నిఘంటువు’ రూపకల్పనతో ప్రారంభమైంది. ఇక్కడ పనిచేసిన ఆచార్య బాలసుబ్రహ్మణ్యన్‌ శిక్షణ నాకెంతగానో తోడ్పడింది. ప్రస్తుతం అదే యూనివర్సిటీలో నిఘంటు నిర్మాణ శాఖాధిపతిగా ఉన్నాను. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కొత్తపదాలు తయారుచేయడం, పాత పదాలకు కొత్త అర్థాన్ని చేర్చడం లాంటివన్నీ అందులో భాగమే. నిధుల లేమి, ఉద్యోగుల కొరత వల్ల ఆ పనిలో ముందుకు వెళ్లలేకపోతున్నాం. ఒక సమగ్ర తెలుగు నిఘంటువును రూపొందించాలనేది నా కల. దానికోసం నా వంతుగా ప్రయత్నిస్తున్నాను. ఔత్సాహికులకు నిఘంటువు నిర్మాణంలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆసక్తి ఉన్న వారు నాంపల్లి తెలుగు వర్సిటీలో నన్ను సంప్రతించవచ్చు. 


గవర్నర్‌కు తెలుగు పాఠాలు...

ఇప్పుడు ‘తెలుగు బోధన’ మా ముందు ఉన్న అతి పెద్ద సవాలు. అందులోనూ తెలుగేతర వ్యక్తులకు నేర్పడం ఇంకా కష్టం. అదీ అభ్యాసకుల అవసరం, ఆసక్తి, చొరవ మేరకు చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగ, వాణిజ్య అవసరాల రీత్యా చాలామంది ఇతర ప్రాంతీయులు తెలుగు నేర్పించాలని మమ్మల్ని కోరుతూ ఉంటారు. తమ వద్దకు వచ్చే రోగులు చెప్పేది వినడం, తిరిగి తెలుగులో సమాధానం ఇవ్వడం కోసం మన భాషను నేర్పమని హైదరాబాద్‌లో ప్రాక్టీసు చేస్తున్న ఇతర రాష్ట్రాల వైద్యులు కొందరు నన్ను కోరారు. వాళ్ల అవసరం వరకే ప్రత్యేక సిలబస్‌ రూపొందించి ఇచ్చాను. అలాగే ఒక సందర్భంలో తనకు తెలుగు నేర్పమని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా అడిగారు. నా గురించి ఆమెకు ఎవరో చెప్పారట. తెలుగు నేర్చుకోవడానికి లాక్‌డౌన్‌ సమయాన్ని ఆమె చక్కగా వినియోగించుకున్నారు. ఆమెకు ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు తీసుకున్నాను. తర్వాత కూడా వారానికి నాలుగు రోజులు ప్రత్యక్షంగానూ బోధించాను. ఒక పదాన్ని ఒకసారి వింటే చాలు, ఆమె ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. చాలా వేగంగా నేర్చుకున్నారు.


తెలుగు పట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల ఆమెకు మమకారం జాస్తి. ఇక్కడి సంప్రదాయాలు, ఆచారాల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకునేవారు. పశ్చిమ బెంగాల్‌ మంత్రి శశి పంజా లాంటి చాలామంది ప్రముఖులు సైతం తెలుగు నేర్పమని అడుగుతున్నారు. ఈ డిజిటల్‌ యుగంలో ఇతర భాషలు నేర్చుకోవడం మరింత సులువయింది. కాకపోతే అందుకు అనుగుణంగా సులువైన బోధనాప్రణాళికను రూపొందించడమే భాషా బోధకుల ముందున్న కర్తవ్యం. అలాంటి ప్రత్యేకమైన వాచకాలను, పుస్తకాలను చాలానే తయారుచేశాను. 


పాఠ్యపుస్తక రచన...

జానపద పరిశోధనలోనూ నాకు కొంత అభినివేశం ఉంది. మాకు ఇదివరకు ప్రముఖ పరిశోధకుడు వెల్చేరు నారాయణరావు జానపద సాహిత్య శోధన మీద కార్యశాలలు నిర్వహించారు. ఆ అవగాహనతో నేను జానపద ప్రదర్శనల రూపురేఖలపై పలు పరిశోధనా పత్రాలు రాశాను. తెలుగు సామెతల్లోని ‘నకారాత్మ’ ప్రయోగాన్ని తొలిసారిగా వెలుగులోకి తెచ్చాను. అన్నమయ్య భక్తిని మధురభక్తిగా నిరూపిస్తూ ‘అన్నమాచార్యుల పదకవితలు - మధురభక్తి’ అంశంమీద పరిశోధనా గ్రంథం రాశాను. అదే అంశంపై ‘హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం’ నుంచి పీహెచ్‌డీ పట్టా తీసుకున్నాను. దళిత స్త్రీల జానపద రూపాల మీద, శతకాల మీద, పర్యాయ పదకోశాల మీద... ఇలా పలు వైవిధ్యభరిత అంశాల పరిశోధనకు మార్గనిర్దేశకురాలిగా వ్యవహరించాను. మారిష్‌సకు చెందిన విద్యార్థిని ప్రవాసి చెన్నయ్య నా పర్యవేక్షణలోనే తన దేశంలోని తెలుగు బోధకులు ఎదుర్కొంటున్న సాధకబాధకాల మీద పరిశోధన పూర్తి చేశారు. ఒకటవ తరగతి నుంచి ఎంఏ వరకు... పలు యూనివర్సిటీల కోసం తెలుగు పాఠ్య పుస్తకాలు రాశాను. వాటిలో ప్రజాస్వామిక విలువలతో కూడిన పదజాలాన్ని పొందుపరిచేందుకు ప్రయత్నించాను.




తెలుగును ఇష్టంగా నేర్చుకున్నాను: తమిళిసై సౌందరరాజన్‌, గవర్నర్‌

‘‘తెలంగాణ గవర్నరుగా బాధ్యతలు స్వీకరించాకే తెలుగు నేర్చుకున్నాను. అదీ డా. యద్దనపూడి రెడ్డి శ్యామల సహాయంతో! నేనిక్కడి వాళ్లతో ఇక్కడి మాతృభాషలో మాట్లాడినప్పుడే, అవి నేరుగా వాళ్ల హృదయాలకు చేరుతాయని నమ్ముతాను. పైగా నేను ఇక్కడి ప్రజల భాష తెలియకుండా, వాళ్ల సాధకబాధకాలు తెలుసుకోలేను. కనుక కాస్త కష్టమైనా ఇష్టంగా తెలుగు నేర్చుకున్నాను. ఇప్పుడు తెలుగులో కొంతమాట్లాడగలుగుతున్నాను. ఇతరుల చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నాను.’’


కె. వెంకటేశ్‌

ఫొటోలు: ఎం.అనీల్‌ కుమార్‌


నా గురువుల ప్రోత్సాహం వల్లే...

మా సొంత ఊరు తిరుపతి. మా నాన్న యద్దనపూడి వెంకట రమణరావు హెచ్‌సీయూలో హిందీ శాఖాధిపతిగా పనిచేశారు. మా అమ్మ రాజేశ్వరి డెభ్భై ఏళ్ల కిందటే తెలుగులో బిఏ చేశారు. ఎన్నడూ బడిలో చదవని మా అమ్మమ్మ శారదమ్మ ఒకవైపు ఇంట్లో బండెడు చాకిరీ చేస్తూనే, మరోవైపు రేడియో వింటూ హిందీ నేర్చుకుంది. వాళ్ల భాషాభిమానం వల్లే నాకు తెలుగు మీద మక్కువ కలిగింది. విజయనగర్‌ కామర్స్‌ కాలేజీలో బీకాం చదువుతున్న నాకు అక్కడ అధ్యాపకుడు ఓగేటి అచ్యుతరామశాస్త్రి ప్రోత్సాహం లభించింది. ఆయన మార్గనిర్దేశంతోనే తర్వాత హెచ్‌సీయూలో ఎంఏ తెలుగులో చేరాను. అక్కడ సి.ఆనందారామం, జి.వి.సుబ్రహ్మణ్యం, పరిమి రామనర్సింహం, రవ్వా శ్రీహరి లాంటి గురువుల పరిచయం, బోధన నన్ను భాషాశాస్త్రం వైపు మళ్లించాయి. వారి శిష్యరికం వల్లనే భాషాశాస్త్రంలో రాణించగలుగుతున్నాను, నిఘంటువులను తయారుచేస్తున్నాను. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు అధ్యయనం... రెండిటిలో కొనసాగడానికి నా భర్త సిరియపురాజు శేషగిరిరావు సహకారం ప్రత్యేకమైంది. మా పిల్లలు కార్తిక్‌ భార్గవ్‌, హరిణి అమెరికాలో స్థిరపడ్డారు. అయినా, వాళ్లకు తెలుగు భాషమీదే కాదు, భాషాశాస్త్రంమీదా అవగాహన ఉందని చెప్పడానికి గర్వపడుతున్నాను.’’


భాషాశాస్త్రవేత్తలకు బోలెడు అవకాశాలు

నిఘంటు నిర్మాణకర్తలకు ప్రజాస్వామిక దృక్పథం కచ్చితంగా ఉండాలి. వాళ్లు అన్ని మాండలికాలను గౌరవిస్తూ, వాటికి సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ పదనిధికి ఒక అర్థం, పరమార్థం. ఉదాహరణకు ‘బర్రె’ అనడం మొరటుగా ఉంటుంది కనుక ‘గేదె’ అనడం సరైనది అనే తరహా ఆధిపత్య ధోరణి నిఘంటు నిర్మాణంలో అస్సలు కూడదు. ‘బర్రె, గేదె, ఎనుము’... ఇలా ఇతర మాండలికాల్లోని పదాలను సేకరించి.. వాటన్నిటినీ పొందుపరిచినప్పుడే ఆ నిఘంటువుకు సార్వజనీనత సమకూరుతుంది. ఇప్పుడు తెలుగు కోర్సులు చదివేవాళ్లే తక్కువ. అందులోనూ భాషాశాస్త్రం వైపు వచ్చేవాళ్లు మరింత తగ్గారు. నిజానికి భాషాశాస్త్రం అభ్యసించిన వాళ్లకు ఇతర దేశాల్లోనే కాదు, సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు బోలెడు.



Updated Date - 2022-02-28T05:30:00+05:30 IST