‘కృష్ణపట్నం’లో 100శాతం వాటా అదానీ పోర్ట్స్‌ చేతికి..

ABN , First Publish Date - 2021-04-06T06:45:04+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టులో మిగిలిన 25 శాతం వాటాను కూడా అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ సొంతం చేసుకుంటోంది...

‘కృష్ణపట్నం’లో 100శాతం వాటా అదానీ పోర్ట్స్‌ చేతికి..

  • 25శాతం వాటా రూ.2,800 కోట్లకు కొనుగోలు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టులో మిగిలిన 25 శాతం వాటాను కూడా అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ సొంతం చేసుకుంటోంది. కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్‌లో ఇప్పటికే అదానీ పోర్ట్స్‌కు 75 శాతం వాటా ఉండగా.. మిగిలిన 25 శాతం వాటాను విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ పోర్ట్స్‌ తెలిపింది. 25 శాతం వాటాను రూ.2,800 కోట్ల కు సొంతం చేసుకుటోంది. ఈ ప్రక్రియ 3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. చట్టపరమైన అనుమతుల మేరకు ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని పేర్కొంది. దీంతో అదానీ పోర్ట్స్‌కు కృష్ణపట్నం పోర్టు 100 శాతం అనుబంధ కంపెనీ అవుతుంది. గత ఏడాది అక్టోబరులో కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను అదానీ పోర్ట్స్‌ కొనుగోలు చేసింది. తాజాగా 25 శాతం వాటా కొనుగోలుతో కృష్ణపట్నం పోర్టు ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.13,675 కోట్లవుతుంది. 

డీప్‌ వాటర్‌ పోర్టు: కంటైనర్లు, బొగ్గు, బ్రేక్‌ బల్క్‌, లిక్విడ్‌ కార్గో మొదలైన ఉత్పత్తులు కృష్ణపట్నం పోర్టు నుంచి ఎగుమతి, దిగుమతి అవుతున్నాయి. అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన డీప్‌ వాటర్‌ పోర్టు ఇది. ప్రస్తుతం దీని వార్షిక హ్యాండ్లింగ్‌ సామర్థ్యం 64 మిలియన్‌ టన్నులు. భవిష్యత్తులో దీన్ని 300 మిలియన్‌ టన్నులకు పెంచాలన్నది లక్ష్యం. పోర్టు కు భారీ నౌకలు రావడానికి వీలుగా 20 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్‌ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంలో నౌక రవాణా వ్యాపారంపై పట్టుబిగించే లక్ష్యంలో భాగంగా కృష్ణపట్నం పోర్టులో మొత్తం వాటాను అదానీ పోర్ట్స్‌ సొంతం చేసుకుంది. 1996 మార్చిలో ఈ పోర్టు ప్రారంభమైంది. 


2019-20 ఆర్థిక సంవత్సరంలో పోర్టు ఆదాయం రూ.1,975 కోట్లు. 2020-21కి 38 మిలియన్‌ టన్నుల సరుకును పోర్టు హ్యాండ్లింగ్‌ చేయగలదని.. ఆదాయం రూ.1,840 కోట్లకు పరిమితం కాగలదని అంచనా వేస్తున్నారు. 2025 నాటికి 500 మిలియన్‌ టన్నుల సామర్థ్యాన్ని సమకూర్చుకునే లక్ష్యంలో భాగంగా కృష్ణపట్నం పోర్టులో 100 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు అదానీ పోర్ట్స్‌  సీఈఓ కరణ్‌ అదానీ తెలిపారు. 


Updated Date - 2021-04-06T06:45:04+05:30 IST