ఇళ్ల పథకం అప్పీల్‌పై విచారణ 30కి వాయిదా

ABN , First Publish Date - 2021-11-26T09:37:38+05:30 IST

ఇళ్ల పథకం అప్పీల్‌పై విచారణ 30కి వాయిదా

ఇళ్ల పథకం అప్పీల్‌పై విచారణ 30కి వాయిదా

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం విషయంలో సింగిల్‌ జడ్జి ఇచ్చినతీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ... కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్లకు ఇళ్ల స్థలాలు కేటాయింపు విషయంలో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశామన్నారు. సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యం దాఖలు చేసిన 128మంది పిటిషనర్లలో చాలామందికి ఇళ్లస్థలాలు కేటాయించామన్నారు. పిటిషనర్లలో ఎవరికైనా అర్హత ఉన్నా ఇంటి స్థలం రాకపోతే అలాంటివారికి కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీఎ్‌సఆర్‌ ఆంజనేయులు వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం వివరాలు అందజేస్తే వాదనలు వినిపించేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. అందుకు సమయం ఇవ్వాలని కోరారు. అర్హులైన పిటిషనర్లకు ఇంటి స్థలం కేటాయించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యవహారంపై తగిన నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది. విచారణను నవంబరు 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

Updated Date - 2021-11-26T09:37:38+05:30 IST