లాక్‌డౌన్‌ తర్వాతా రెడ్‌ జోన్‌లే

ABN , First Publish Date - 2020-04-06T09:15:57+05:30 IST

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు అమలులో ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌ తర్వాతా రెడ్‌ జోన్‌లే

  • వాటిలో అప్పుడూ మార్గదర్శకాల అమలు
  • ప్రతి ఆస్పత్రిలో ఐసొలేషన్‌ వార్డు
  • ల్యాబ్‌ల సామర్థ్యం పెంచండి
  • యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు
  • ప్రతి ఇంటా ఆరోగ్యంపై నిరంతర సర్వే
  • పక్కాగా కేంద్ర మార్గదర్శకాల అమలు
  • 14 తర్వాతి పరిస్థితికి రెడీ అవ్వండి
  • అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం
  • కరోనా కట్టడి చర్యలేంటి?
  • సీఎం జగన్‌కు ప్రధాని ఫోను
  • పాజిటివ్‌ కేసులు పెరగడంపై ఆరా!


అమరావతి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు అమలులో ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో మార్గదర్శకాలను కొనసాగించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ను ఈ నెల 14వ తేదీ తర్వాత కొనసాగించడమా.. విడతల వారీగా సడలించడమా.. లేదా పూర్తిగా ఎత్తివేయడమా అనే అంశాలపై కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడానికి సన్నద్ధం కావాలని ప్రభుత్వ యంత్రాంగానికి కర్తవ్యబోధ చేశారు. కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణను అమలులోకి తీసుకురావాలన్నారు. కరోనా వైరస్‌ విజృంభనపై ఆదివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఆస్పత్రిలోనూ ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.


కరోనా లక్షణాలతో ఏ రోగి వచ్చినా ముందస్తు జాగ్రత్తగా ఐసొలేషన్‌ వార్డులోనే చికిత్స అందించాలని సీఎం సూచించారు.  వైద్యులు, సిబ్బంది కూడా అన్ని రకాల రక్షణ చర్యలు పాటిస్తూ చికిత్స అందించాలన్నారు. తక్షణమే పరీక్షలు నిర్వహించి, యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందించాలని నిర్దేశించారు. ఢిల్లీలో మర్కజ్‌ సమావేశానికి హాజరైనవారు, వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ తర్వాత సెకండరీ కాంటాక్టులపై ఫోకస్‌ పెట్టాలన్నారు. ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతర సర్వే జరుగుతూనే ఉండాలని స్పష్టం చేశారు. ఇతరత్రా వ్యూహాలను అనుసరిస్తూనే ర్యాండమ్‌ చెక్‌పలకు సిద్ధమవ్వాలని సూచించారు. 


కాగా, ఇప్పటికే ఏడు చోట్ల ల్యాబ్‌లు ఉన్నాయని..విశాఖ, విజయవాడ సహా మూడు చోట్ల ల్యాబ్‌ల సామర్థ్యం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు వివరించారు. విశాఖలో రెడ్‌ జోన్లను 8 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌ నుంచి 20 నమూనాలు తీసుకుని పరీక్షించామని అధికారులు చెప్పగా, ఇది మరింత పకడ్బందీగా జరగాలని సీఎం ఆదేశించారు. కేటగిరీల వారీగా నమూనాలు పరీక్షిస్తూ ఉండాలన్నారు. సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


బాబూ జగ్జీవన్‌ రామ్‌కు నివాళి..: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి సీఎం జగన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు.

Updated Date - 2020-04-06T09:15:57+05:30 IST