మళ్లీ లాక్‌

ABN , First Publish Date - 2021-05-12T05:40:02+05:30 IST

కరోనా మరణాలు, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలాక్‌డౌన్‌ ప్రకటించడంతో బుదవారం నుంచి జనజీవనం స్తంభించనుంది. పలు రకాల దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడనున్నాయి.

మళ్లీ లాక్‌
మద్యంషాపుల వద్ద బారులు

కరోనా కట్టడికి నేటినుంచి లాక్‌డౌన్‌

ఉదయం ఆరుగంటలనుంచి 10గంటలవరకే దుకాణాలు

ప్రభుత్వ ప్రకటనతో వైన్‌షాపుల వద్ద పెరిగిన రద్దీ

ఖమ్మం, మే 11(ఆంధ్రజ్యోతిప్రతినిధి): కరోనా మరణాలు, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలాక్‌డౌన్‌ ప్రకటించడంతో బుదవారం నుంచి జనజీవనం స్తంభించనుంది. పలు రకాల దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడనున్నాయి. ఉదయం ఆరుగంటలనుంచి 10గంటల వరకు నాలుగుగంటలు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. జనసంచారానికి అనుమతి ఉంటుంది. బుధవారం నుంచి పదిరోజులపాటు లాక్‌డౌన్‌ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఉమ్మడి జిల్లాలో పోలీసులు చెక్‌పోస్టులు, ఫెన్సింగ్‌లు తదితర ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం ఈసారి లాక్‌డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అత్యవసర వైద్యసేవలకు అనారోగ్యంతో బాధపడుతున్నా వారు ఎప్పుడైనా బయటకు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చారు. వైద్యసేవలతోపాటు ఇతర అత్యవసర కారణాలు ఏమైనా ఉంటే వారు సొంతవాహనాల్లో వెళ్లే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులు అనుమతి ఉన్న నాలుగుగంటల సమయంలో స్థానికంగా మాత్రమే తిరగనున్నాయి. ఆయా డిపోల సమీపంలో ఉన్న మండల కేంద్రాలకు ఉదయం ఆరుగంటలకు బయలుదేరి ఉదయం 10గంటలకు డిపోకుచేరే విధంగా ఆర్టీసీ బస్సులు పరిమితితంగా తిప్పనున్నారు. ఖమ్మం రిజియన్‌లో 610బస్సులు ఉండగా 50నుంచి 100బస్సులు మాత్రమే ఆయా డిపోల సమీప మండలాలకు తిరిగే పరిస్థితి ఉంది. మెడికల్‌షాపులు, ఆసుపత్రులకు ఎప్పట్లానే 24గంటల అనుమతి కలిపించనున్నారు. మద్యం షాపులకు ఉదయం 7గంటలనుంచి 10గంటలలోపు విక్రయించుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మంగళవారం లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడగానే జిల్లాలోని మద్యం షాపుల వద్దమద్యం ప్రియులు బారులు తీరారు. దీంతో డిమాండ్‌ గ్రహించిన మద్యంసాపుల యజమానులు ఎంఆర్‌పీ కటే అదనంగా రూ.10అదనంగా తీసుకుని విక్రయాలు జరిపారు. లాక్‌డౌన్‌లో మద్యం వ్యాపారం ఉండదని మద్యం ప్రియులు ఎగబడ్డారు. లాక్‌డౌన్‌ విషయం తెలుసుకుని కిరాణషాపులతోపాటు ఇతర నిత్యావసర దుకాణాలు వద్ద జనం బారులుతీరారు. సూపర్‌మార్కెట్లలో పదిరోజులకు సరిపడా నిత్యావసరాలు విక్రయాలు సాగించారు. లాక్‌డౌన్‌ బుధవారం నుంచి పదిరోజులపాటు పటిష్టంవగా అమలు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రత్యామ్నాయంగా పలువ్యాపార సంస్థలు లాక్‌డౌన్‌కు నిర్ణయం తీసుకున్నాయి. సెలూన్‌షాపులు వారం పాటు బంద్‌చేయాలని నిర్ణయించి మంగళవారంనుంచి బంద్‌పాటిస్తున్నారు. గతేదాది కూడా కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని మేలో లాక్‌డౌన్‌ నడిచింది. మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతోంది.

 భద్రాద్రి రామాలయంలో దర్శనాల నిలిపివేత

భద్రాచలం, మే 11: లాక్‌డౌన్‌ నేపధ్యంలో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం 10గంటల నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు. ఇప్పటికే రామాలయంలో గత రెండు రోజులుగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ నేపధ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా నేటి నుంచి భక్తులకు పూర్తిగా దర్శనాలు నిలిపివేయనున్నారు.  ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య సేవలను మాత్రం ఆంతరంగికంగా కొనసాగించనున్నారు. ఇదిలాఉండగా దేవస్థానంలో గత రెండు రోజులుగా అమలవుతున్న రోజు విడిచి రోజు ఉద్యోగుల విధి నిర్వహణ యథావిధిగా కొనసాగనుంది.

Updated Date - 2021-05-12T05:40:02+05:30 IST