TTD చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

ABN , First Publish Date - 2021-07-17T18:30:35+05:30 IST

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డినే కొనసాగిస్తున్నట్లు జగన్ సర్కార్ తెలిపింది..

TTD చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

అమరావతి : టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డినే కొనసాగిస్తున్నట్లు జగన్ సర్కార్ తెలిపింది. శుక్రవారం నాడు పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా టీటీడీ విషయం గురించి ప్రస్తావించిన ఆయన.. సుబ్బారెడ్డినే మరో రెండున్నరేళ్ల పాటు కొనసాగిస్తున్నట్లు సజ్జల ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వైవీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. కాగా.. జోడు పదవులకు ఈసారి జగన్ సర్కార్ బ్రేక్ వేసింది. ఇవాళ ప్రకటించిన పదవుల్లో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది.


అప్పట్లో ఇలా ప్రచారం..

ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసి తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసిన సమయంలో రెండున్నరేళ్లకు మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తానని ప్రకటించారు. కనీసం 80శాతం మందిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తానని వెల్లడించారు. ఆ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైవీ భవిష్యత్తులో వచ్చే రాజ్యసభ సభ్యత్వం తీసుకుని ఢిల్లీలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తారా లేక ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నిస్తారా అన్న ఊహాగానాలు వచ్చాయి. ఆయన్ను తిరిగి టీటీడీ చైర్మన్‌గానే కొనసాగించాలని జగన్‌ భావిస్తున్నట్లు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో పలు కథనాలు కూడా వచ్చాయి. శనివారం నాడు ఆంధ్రజ్యోతి చెప్పినట్లుగానే వైవీని చైర్మన్‌గానే కొనసాగిస్తున్నట్లు జగన్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది.

Updated Date - 2021-07-17T18:30:35+05:30 IST