కూరగాయల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకోండి-నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-03-29T19:57:40+05:30 IST

తెలంగాణ లాక్‌డౌన్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని కూరగాయల ధరలు పెంచి అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు.

కూరగాయల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకోండి-నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ లాక్‌డౌన్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని కూరగాయల ధరలు పెంచి అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. పండ్లు, కూరగాయల రవాణాకు ఆయా మార్కెట్‌ల అధికారుల నుంచి వాహనాలకు అనుమతి పత్రాలు పొందవచ్చని వ్యాపారులకు సూచించారు. కూరగాయల ధరలు అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు అందుబాటులో ఉంచడానికి మార్కెటింగ్‌శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు సూచించారు. మార్కెట్‌లలో రైతులకు కరోనా వైరస్‌ సోకకుండా తగిన జాగ్రత్తలు చెప్పడంతో పాటు మార్కెట్‌లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కరోనా వైరస్‌ ప్రబల కుండా మార్కెట్‌లలో పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు అధికారులు, సిబ్బంది కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. సాధారణ ప్రజలకు కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. 


అందులోభాగంగానే అవసరాలకు సరిపడా ఉల్లి, ఆలుగడ్డ నిల్వలు ఉంచామన్నారు. నగరానికి 6500 క్వింటాళ్ల ఉల్లిఉల్లిని మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పారు. యూపీ నుంచి నగరానికి సరిపడినంత ఆలుగడ్డ దిగుమతి అయ్యిందన్నారు. గత కొన్నిరోజులుగా లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఇతర రాష్ర్టాల నుంచి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 331 ప్రాంతాల్లో 177 మొబైల్‌ రైతుబజార్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లిడించారు. ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ కూరగాయల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-03-29T19:57:40+05:30 IST