దేశంలోని రెండో అతిపెద్ద టెల్కోగా ఎయిర్‌టెల్.. జియోదే అగ్రస్థానం!

ABN , First Publish Date - 2020-06-30T23:07:32+05:30 IST

దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థలలో భారతీ ఎయిర్‌టెల్ రెండో స్థానానికి చేరుకుంది. మొత్తం మార్కెట్ షేర్‌లో ఫిబ్రవరి

దేశంలోని రెండో అతిపెద్ద టెల్కోగా ఎయిర్‌టెల్.. జియోదే అగ్రస్థానం!

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థలలో భారతీ ఎయిర్‌టెల్ రెండో స్థానానికి చేరుకుంది. మొత్తం మార్కెట్ షేర్‌లో ఫిబ్రవరి మాసాంతానికి 28.35 శాతం సొంతం చేసుకున్న ఎయిర్‌టెల్ రెండో స్థానానికి చేరుకున్నట్టు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఫిబ్రవరిలో 62 లక్షల మంది కొత్త ఖాతాదారులను చేర్చుకుని అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో వొడాఫోన్ ఐడియా 34 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయి మూడో స్థానంలో ఉంది. వొడాఫోన్ ఐడియా జనవరిలో రెండో స్థానంలో ఉండగా, నెల రోజులు తిరిగే సరికి ఆ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం.


భారత ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులను పెంచుకుంది. ఫిబ్రవరిలో 4 లక్షల మంది కొత్త ఖాతాదారులు బీఎస్‌ఎన్ఎల్‌ను ఎంచుకున్నారు. కాగా, దేశంలో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 156 కోట్ల నుంచి 160 కోట్లకు పెరిగినట్టు ట్రాయ్ తెలిపింది. 


ఫిబ్రవరి నెలకు సంబంధించి ట్రాయ్ గణాంకాల ప్రకారం.. రిలయన్స్ జియో 32.99 మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా 28.35 శాతంతో ఎయిర్‌టెల్ రెండో స్థానానికి ఎగబాకింది. 28.05 శాతంతో వొడాఫోన్ ఐడియా, 10.32 శాతంతో బీఎస్ఎన్ఎల్ మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 0.29 శాతం మార్కెట్ షేర్‌తో ఎంటీఎన్ఎల్ ఆ తర్వాతి స్థానంలో ఉంది.


జియో మొత్తం ఖాతాదారుల సంఖ్య 38.2 కోట్లకు చేరుకోగా, భారతీ ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్ బేస్ 32.9 కోట్లుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న వొడాఫోన్ ఖాతాదారుల సంఖ్య 32.5 కోట్లు కాగా, బీఎస్ఎన్ఎల్ 11.9 కోట్ల మంది సబ్‌స్కైబర్లతో నాలుగో స్థానంలో, 34 లక్షల మంది ఖాతాదారులతో ఎంటీఎన్ఎల్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.  




Updated Date - 2020-06-30T23:07:32+05:30 IST