రూ. 1.17 లక్షల కోట్లు... ‘5జీ’ కోసం వ్యయం చేయనున్న ఎయిర్‌టెల్‌...

ABN , First Publish Date - 2022-02-08T00:41:06+05:30 IST

వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘5జీ టెక్నాలజీ’ని ముందుగా అందించడం కోసం రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

రూ. 1.17 లక్షల కోట్లు...   ‘5జీ’ కోసం వ్యయం చేయనున్న ఎయిర్‌టెల్‌...

*  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడి

* గూగుల్ పెట్టుబడి రూ. 7,500 కోట్లు

* ఆమోదం కోసం 26 న ఈజీఎం

ముంబై : వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘5జీ టెక్నాలజీ’ని ముందుగా అందించడం కోసం రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఏ టెలికాం కంపెనీ ముందుగా 5జీని పరిచయం చేస్తే, భారతీయుల మద్దతు దానికే ఉంటుందని భావిస్తున్నారు. కాగా... 5జీ రేసులో జియో కంటే ఓ అడుగు ముందే ఉండేలా, భారతి ఎయిర్‌టెల్‌ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఇందుకోసం... తన అనుబంధ సంస్థలైన ఇండస్ టవర్స్, ఎనెక్ట్స్రా, భారతి హెక్సాకాంలను వినియోగించుకోనుంది. ఉపయోగించుకోనుంది. వీటి ద్వారా 5జీ విస్తరణ కోసం సుమారు రూ. 1.17 లక్షల కోట్లను వ్యయం చేయాలని నిర్ణయించింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.


ఈ వ్యయాలకు ఆమోదంతోపాటు, గూగుల్‌ నుంచి సుమారు రూ. 7,500 కోట్ల పెట్టుబడి కోసం 1.28 శాతం వాటాను కట్టబెట్టేందుకు, షేర్ల జారీ ఆమోదం పొందడానికి కూడా ఈ నెల 26 న ఎక్స్‌ట్రార్డినరీ జనరల్‌ మీటింగ్‌(ఈజీఎం) నిర్వహించనుంది.


ఈజీఎం నోటీసు ప్రకారం... మొబైల్ టవర్ కంపెనీ ఇండస్ టవర్స్‌తో చేసే బిజినెస్‌ ద్వారా రూ. 88 వేల కోట్లు, డేటా సెంటర్ సంస్థ ఎన్‌ఎక్స్‌ట్రా సేవలు పొందడానికి రూ. 15 వేల కోట్లు, భారతి హెక్సాకామ్‌తో రూ. 14 వేల కోట్ల వరకు లావాదేవీలను ఎయిర్‌టెల్‌ నిర్వహిస్తుంది.


ఇక రానున్న నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఇండస్ టవర్స్‌తో జరిపే లావాదేవీలపై రూ. 17 వేల కోట్లు, 2025-26 లో రూ. 20 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ఫైలింగ్‌లో భారతి ఎయిర్‌టెల్ తెలిపింది.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5జీ పరిణామాల దృష్ట్యా భారత్‌లోనూ 5జీ సాక్షాత్కరించే అవకాశముందంటూ ఇప్పటికే వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. మొదట కీలక నగరాల్లో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా తమ  నెట్‌వర్క్ ద్వారా దూసుకువెళతమని సంస్థ సారధులు చెబుతున్నారు. 5జీ  రోల్‌-అవుట్‌ సమయంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరాల కోసం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి, ఇండస్ టవర్స్‌తో సంవత్సరానికి రూ. 20 వేల కోట్ల వరకు లావాదేవీలు జరుపనున్నట్లు ఈజీఎం నోటీసులో కంపెనీ పేర్కొంది. 

Updated Date - 2022-02-08T00:41:06+05:30 IST