కొవిడ్‌ పట్ల అప్రమత్తం చేయండి

ABN , First Publish Date - 2022-01-19T04:50:23+05:30 IST

జిల్లాలో రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ కోరారు.

కొవిడ్‌ పట్ల అప్రమత్తం చేయండి
మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ ్యశాఖ అధికారి మాలతి

జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌

   స్థాయి సంఘాల సమావేశంలో  అధికారులకు దిశానిర్ధేశం

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి18: జిల్లాలో రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ కోరారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జడ్పీస్థాయి సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, విద్యా - వైద్యం, ఆర్థిక- ప్రణాళిక, పనులు స్థాయి సంఘాల సమవేశాలను కొనసాగించారు. ఈ సందర్బంగా విద్య- వైద్యంపై జరిగిన సమీక్షలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి మాలతి మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఒకటో తారీకు నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయని, మూడు రోజులుగా విస్తృతంగా విజృంభిస్తోందని అన్నారు. గ్రామాల్లో ప్రజలు మాస్కులు ధరించడంలేదని, దీని మూలంగా ఇంకా కేసులు పెరిగే ఆస్కారం ఉందంటూ తన నివేదికల్లో వెల్లడించారు. దీనికి స్పందించిన లింగాల కమల్‌రాజ్‌ మాట్లాడుతూ జిల్లాలో అనూహ్యంగా కొవిడ్‌ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యఆరోగ్య సిబ్బంది, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కొవిడ్‌ నిబంధనలను అమలయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మాస్కులు, భౌతికదూరాన్ని పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను రెండు డోసులు పూర్తిచేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌.. జిల్లాలో సెగ్రిగేషన్‌ షెడ్లలో చెత్త విభజనతో పాటు సేంద్రీయ ఎరువులను తయారు చేస్తున్నామని వివరించారు. జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ మాట్లాడుతూ సభను ఇలా తప్పుదోవ పట్టించ వద్దు.. సెగ్రిగేషన్‌ షెడ్లలో ఎక్కడా చెత్త విభజన జరగడంలేదు.. గ్రామాల్లో పారిశుధ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఎంపీడీ వోలు, ఎంపీవోలు, ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ పంచాయతీల్లో మెరుగైన ఫలితాలు కనిపించడం లేదని చైర్‌ పర్సన్‌ కమల్‌రాజ్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి, విద్యా,ఆర్థిక- ప్రణాళిక, పనుల కమిటీలపై సాదాసీదాగానే సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వింజం వెంకట అప్పారావు, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్‌, కారేపల్లి, ఎర్రుపాలెం, కల్లూరు, పెనుబల్లి జడ్పీటీసీలు జగన్‌, కట్టా అజయ్‌కుమార్‌, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా స్థాయి సంఘాల సమావేశాలు గైర్హాజరయ్యారు. డీఆర్డీఏ , జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి, సహకారశాఖ అధికారులకు కరోనా వైరస్‌ సోకడంతో వారికి బదులుగా కిందిస్థాయి సిబ్బందిని పంపించినట్లు సమావేశంలో అధికారులు ఆయనకు వివరించారు. 

నేడు మూడు కమిటీల సమావేశం

 రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జిల్లాలో పెరిగిపోతున్న కొవిడ్‌ కేసుల పట్ల అప్రమత్తం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగంతో జిల్లా పరిషత్‌ సమావేశంలో సమీక్షిం చారు. దీంతో మధ్యాహ్నం నిర్వహించాల్సిన సమావేశాలను నేటికి వాయిదా వేశారు. వ్యవసాయ, స్త్రీశిశుసంక్షేమం, మహిళా సంక్షేమ కమిటీస్థియి సంఘాల సమావేశాలను బుధవారం నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో వింజం వెంకట అప్పారావు తెలిపారు. 


Updated Date - 2022-01-19T04:50:23+05:30 IST