అప్పులన్నీ తప్పులే

ABN , First Publish Date - 2021-08-02T08:19:38+05:30 IST

రాజ్యాంగానికి విరుద్ధంగా తమ కళ్లుగప్పి.. దొడ్డిదారిలో అప్పులు తేవడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌(ఏపీఎ్‌సడీసీ)పై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యకలాపాలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేసింది. దీనికి

అప్పులన్నీ తప్పులే

‘భవిష్యత్తు’ తాకట్టుపై కేంద్రం కన్నెర్ర

అభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు చెల్లదు

దానిద్వారా రుణాలు రాజ్యాంగ విరుద్ధం

266 (1), 293(3) అధికరణల అతిక్రమణ

ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి

ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడతారా?

కలెక్టరేట్‌, తహశీల్దార్‌ ఆఫీసుల బదిలీయా?

భవిష్యత్‌ ఆదాయం ఎస్ర్కో చేస్తారా?

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు పట్టించుకోరా?

ఈ ఉల్లంఘనలకు సమాధానం చెప్పండి

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

రుణాలకు గ్యారెంటీలపైనా తీవ్ర అభ్యంతరం

కేంద్రాన్ని కదిలించిన ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు


జగన్‌ ప్రభుత్వ ఆర్థిక అక్రమాలపై కేంద్రం కన్నెర్ర చేసింది.  ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అక్రమ మార్గాల్లో బ్యాంకుల నుంచి రుణం పొందడాన్ని ఆక్షేపించింది. రాజ్యాంగానికి విరుద్ధంగా తమ కళ్లుగప్పి.. దొడ్డిదారిలో అప్పులు తేవడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ)పై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యకలాపాలు పూర్తి రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ ఉల్లంఘనలకు జవాబివ్వాలని శ్రీముఖం పంపింది.


కేంద్రం కన్నెర్ర చేసినా జగన్‌ సర్కారు తీరు మార్చుకోలేదు. ఎస్‌డీసీ గుట్టు రట్టవడంతో అప్పులు తేవడానికి మరో కంపెనీని తెరపైకి తెచ్చింది.  డిపాజిట్లు స్వీకరించకూడని సంస్థగా ‘ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌’ పేరుతో ఆర్‌బీఐ వద్ద రిజిస్టర్‌ చేసి.. ప్రభుత్వ కార్పొరేషన్లు, విద్యాసంస్థల నుంచి ఏకంగా రూ.3 వేల కోట్ల డిపాజిట్లు స్వీకరించింది.


కొత్త ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ను ప్రైవేటు కంపెనీగా మార్చేశారు. డిపాజిట్లు చేయాలని ఆయా సంస్థలకు రాసిన లేఖపై ఐఏఎస్‌ అధికారుల సంతకం లేదు. దానిని ప్రైవేటు కన్సల్టెంటు రాయడమే విచిత్రం.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాజ్యాంగానికి విరుద్ధంగా తమ కళ్లుగప్పి.. దొడ్డిదారిలో అప్పులు తేవడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌(ఏపీఎ్‌సడీసీ)పై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యకలాపాలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, సదరు ఉల్లంఘనలకు జవాబివ్వాలని రాష్ట్రానికి లేఖాస్త్రం సంధించింది. ఏపీఎ్‌సడీసీ ద్వారా రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చి... పథకాలు అమలు చేసున్నామని సర్కారు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. దీనికోసం ప్రభుత్వ శాఖల ఆస్తులను ఏపీఎ్‌సడీసీకి బదిలీ చేయాలని నిర్ణయించారు. అలాగే... మద్యంపై అదనపు ఎక్సైజ్‌ రిటైల్‌ పన్ను విధించి, దానిని ఏపీఎ్‌సడీసీకి బదిలీ చేస్తున్నారు. ‘అవును... మద్యంపై అదనపు పన్ను విధించి... దానిని హామీగా చూపించి అప్పులు తెస్తున్నాం’ అని రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించింది. సర్కారు వారి అడ్డగోలు ఆర్థిక ఉల్లంఘనలు, ‘భవిష్యత్తు ఆదాయాన్ని’ తాకట్టు పెట్టి అప్పులు తేవడంపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక కథనాలు ప్రచురించింది.


ఇవి కేంద్రాన్ని సైతం కదిలించాయి. రాష్ట్ర ఖజానాకు జమ కావాల్సిన భవిష్యత్‌ పన్ను ఆదాయాన్ని అప్పుల కోసం ఎస్‌డీసీకి ఎస్ర్కో చేయడం.. రాజ్యాంగంలోని 266(1)వ అఽధికరణకు విరుద్ధమని కేంద్రం తేల్చిచెప్పింది. ఆ కార్పొరేషన్‌ నుంచి రూ.18,500 కోట్ల రుణం తీసుకురావడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఎస్‌డీసీ అక్రమ వ్యవహారాలు కేంద్రం దృష్టికి చేరేనాటికి రూ.18,500 కోట్ల రుణమే తెచ్చినప్పటికీ.. తాజాగా ప్రభుత్వం మరో రూ.3,000 కోట్ల అప్పు తెచ్చింది. దీంతో ఆ కార్పొరేషన్‌ నుంచి అక్రమంగా తెచ్చిన మొత్తం రుణం రూ.21,500 కోట్లకు చేరుకుంది. పైగా బ్యాంకుల నుంచి ఈ కార్పొరేషన్‌కు రుణాలు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కలెక్టరేట్‌, తహశీల్దార్‌ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను సదరు కార్పొరేషన్‌ పేరిట బదిలీ చేసి వాటిని బ్యాంకులకు తాకట్టు పెట్టడాన్నీ కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. ఇలా కలెక్టరేట్‌, తహశీల్దార్‌ కార్యాలయాలను, విశాఖలోని 213 ఎకరాలను రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు బదిలీ చేసిన తర్వాతే ఆ రూ.3,000 కోట్లను బ్యాంకులు రాష్ట్రానికి విడుదల చేయడం గమనార్హం.


ఎడాపెడా గ్యారెంటీలపై..

రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కాపాడేందుకు కేంద్రం రూపొందించిన ద్రవ్య నియంత్రణ-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టాన్ని జగన్‌ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఉల్లంఘిస్తోంది. కార్పొరేషన్లకు ఎడాపెడా గ్యారంటీలు ఇస్తూ వేల కోట్ల రుణాలు తెస్తూ.. వాటిని ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో చూపకుండా కేంద్రం, ఆర్‌బీఐల కళ్లకు గంతలు కడుతోంది. అయితే, ఇటీవలే ఈ ఎఫ్‌ఆర్‌బీఎం ఉల్లంఘనలను కేంద్రం కూడా గుర్తించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన అప్పుల పరిమితిలో రూ.18 వేల కోట్లకు కోత విధించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు చేయడం, లెక్కా పత్రం లేకుండా ఎడాపెడా గ్యారెంటీలు ఇచ్చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజా లేఖలో పేర్కొంది. దీనిపైనా స్పందించాలని సూచించింది.


రాజ్యాంగం ఏం చెబుతోంది..

ఆర్టికల్‌ 266(1): రాష్ట్ర ప్రభుత్వం/కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులైనా రాష్ట్ర ఖజానా నుంచే చేయాలి. అప్పులు లేదా బిల్లుల చెల్లింపునకు ఆదాయాన్ని మరో చోటికి మళ్లించకూడదు/ఎస్ర్కో చేయకూడదు. 

ఆర్టికల్‌ 293(3): రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి తెలియకుండా ఎలాంటి అప్పులూ చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ప్రతి రుణానికీ కేంద్రం అనుమతి ఉండాలి. ఒకవేళ ఆ అప్పులు చెల్లించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైతే రాష్ట్ర ఖజానా నుంచి ఆర్‌బీఐ నేరుగా ఆ అప్పులు చెల్లింస్తుంది. ఖజానాలో అప్పులు తిరిగి చెల్లించేందుకు కూడా డబ్బులు లేకపోతే కేంద్ర ఖజానా నుంచి ఆ అప్పులు చెల్లిస్తారు. అందుకే రాష్ట్రాలు చేసే ప్రతి అప్పునూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.




కళ్లకుగట్టిన ‘ఆంధ్రజ్యోతి’..

కేంద్రం లేఖలో రాసిన ప్రతి అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ ముందుగానే కథనాలు ప్రచురితం చేసింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు, భవిష్యత్‌ ఆదాయం ఎస్ర్కో చేయడం రాజ్యాంగ విరుద్ధమని, విశాఖ కలెక్టరేట్‌, తహశీల్దార్‌ కార్యాలయాలు, 213 ఎకరాల భూమిని కార్పొరేషన్‌కు బదిలీ చేసి వాటిని బ్యాంకులకు తాకట్టు పెట్టడాన్ని తీవ్రమైన ఆర్థిక నేరాలుగా పేర్కొంది. అలాగే, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండేళ్లలో లక్ష కోట్లకు పైగా అప్పులు కేంద్రానికి తెలియకుండా తెచ్చిందని, అందులో కొన్నింటిని బడ్జెట్‌ పుస్తకాల్లో కూడా ప్రచురించలేదనే అంశాలను కూడా వెలుగులోకి తెచ్చింది. సరిగ్గా వీటిపైనే వివరణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. 

Updated Date - 2021-08-02T08:19:38+05:30 IST