నిధులపై నిర్మలవన్నీ అబద్ధాలే

ABN , First Publish Date - 2020-02-14T09:39:08+05:30 IST

‘‘కేంద్ర మంత్రి నిర్మల అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఐదేళ్లలో తెలంగాణ తరఫున కేంద్రానికి పన్ను ఆదాయంగా రూ.2.70 లక్షల కోట్లు

నిధులపై నిర్మలవన్నీ అబద్ధాలే

2.72 లక్షల కోట్ల రాబడి ఇచ్చాం..

కేంద్రం తిరిగిచ్చింది 1.15లక్షల కోట్లే

బీజేపీ మనుగడకే ప్రమాదం

ప్రాంతీయ పార్టీలే శాసిస్తాయి

సీఏఏను వ్యతిరేకిస్తున్నాం: కేటీఆర్‌ 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ‘‘కేంద్ర మంత్రి నిర్మల అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఐదేళ్లలో తెలంగాణ తరఫున  కేంద్రానికి పన్ను ఆదాయంగా రూ.2.70 లక్షల కోట్లు చెల్లించాం. ఇందులో కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చింది కేవలం రూ.1.15లక్షల కోట్లే. మిగతా రూ.1.60లక్షల కోట్లు ఏమయ్యాయి?’’ అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఢిల్లీలో గురువారం ‘టైమ్స్‌నౌ’ నిర్వహించిన సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాల ఆర్థిక అవసరాలను తీర్చే బాధ్యతను కేంద్రం సమదృష్టితో నిర్వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.  జీఎస్టీ బకాయిలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు. 


బీజేపీ మనుగడకే ప్రమాదం

బాధ్యత గల ఆర్థిక మంత్రి ఇలాంటి మోసపూరిత వ్యాఖ్యలు చేయడం వల్ల తెలంగాణలో బీజేపీ మనుగడకే ప్రమాదమని కేటీఆర్‌ హెచ్చరించారు. 


శరవేగంగా పురోగమిస్తున్నాం

తెలంగాణ అన్ని రంగాల్లో శరవేగంగా పురోగమిస్తోందని కేటీఆర్‌ తెలిపారు. సుస్థిర పరిపాలన కారణంగా విదేశీ సంస్థలు, ఔత్సాహికులు, పెట్టుబడిదారుల్లో విశ్వసనీయత పెరుగుతోందని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని, ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని తెలిపారు. పరిపాలన బాధ్యతలు, అభివృద్ధి అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 


ప్రాంతీయ పార్టీలే శాసిస్తాయి

ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారనేందుకు ఢిల్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇకముందు ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాలను శాసిస్తాయని, అందుకు ఇది ఆరంభమని అన్నారు. ‘‘రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయి. కేంద్రం రాష్ట్రాలతో సఖ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా కేంద్రంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ బలంగా ఉండొచ్చు, ఒక నాయకుడు గట్టివాడై ఉండొచ్చు.. కానీ, రాష్ట్రాల అభివృద్ధి విషయంలో రాజకీయాలకతీతంగా పనిచేయాల్సి ఉంటుంది’’ అని అన్నారు. కేంద్రం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ వంటి ఎన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టినా.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనన్న వాస్తవం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏ ప్రాజెక్టుకైనా రాష్ట్ర ప్రభుత్వాలే భూమి, విద్యుత్తు, నీరు వంటి సౌకర్యాలు, ప్రోత్సాహకాలు ఇస్తాయని గుర్తుచేశారు. కేంద్రం ఈ వాస్తవాన్ని గ్రహంచి ఉదారంగా వ్యవహరించాలని కోరారు. ‘‘భారతదేశం రాష్ట్రాల సమూహం. ఇక్కడ ఇచ్చే వారు.. పుచ్చుకునే వారు ఎవరూ ఉండరు. కేంద్రం ద్వారా రాష్ట్రాలకు దక్కాల్సిన నిధులు అందాల్సిందే’’ అని అన్నారు.


సీఏఏ అవసరం ఏమొచ్చింది?

పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని, ప్రజలు నిరసిస్తున్నారని కేటీఆర్‌ చెప్పారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై దృష్టి పెట్టాలే గానీ, సీఏఏ వంటి చట్టాలు తెచ్చి ప్రశాంతతను పాడుచేయొద్దని హితవు పలికారు. మాంద్యంతో సతమతమవుతున్న దేశాన్ని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలో ఆలోచించాలని, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఏఏతో కొత్తగా అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున టీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని వెల్లడించారు. సీఏఏతో ఎందుకు విభేదిస్తున్నామో కేంద్రానికి ఇప్పటికే స్పష్టంగా చెప్పామని తెలిపారు.

Updated Date - 2020-02-14T09:39:08+05:30 IST