Abn logo
Nov 23 2020 @ 02:47AM

వరద సాయాన్ని పందికొక్కుల్లా తిన్నారు

Kaakateeya

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరదలు.. మెట్రో పిల్లర్ల నిండా ఆ పార్టీ పోస్టర్లే ఉన్నాయి

తొలగించకుండా ఎస్‌ఈసీ ఏం చేస్తోంది?

బీజేపీ నేతలకు ఓట్లడిగే అర్హత లేదు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే హైదరాబాద్‌ నగరాన్ని వరదలు ముంచెత్తాయని, బాధితులకు అందించాల్సిన వరద సాయాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పందికొక్కుల్లా తిన్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో రూ.67వేల కోట్లతో పనులు చేపట్టామని మంత్రి కేటీఆర్‌ చెబుతున్నారని, కానీ.. ఆ స్థాయి అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. కరోనాతో ప్రజలు చనిపోతున్నా పట్టించుకోకుండా సీఎం కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో పడుకున్నారని ఆరోపించారు. వరదలతో జనం బాధలు పడుతుంటే.. సీఎం గానీ, మంత్రులు గానీ వెళ్లి పరామర్శించలేదన్నారు.


గాంధీ భవన్‌లో పొన్నం ప్రభాకర్‌, కుసుమ్‌కుమార్‌, మధు యాష్కీ, శ్రీనివాస్‌ కృష్ణన్‌ తదితరులతో కలిసి ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు. మెట్రో పిల్లర్ల నిండా టీఆర్‌ఎస్‌ పోస్టర్లు అంటిస్తే.. తొలగించకుండా ఏం చేస్తున్నారు? అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించారు. తాము కోరినప్పుడు అనుమతి ఇవ్వకుండా.. కేటీఆర్‌ రోడ్‌షోలో ఎల్‌ఈడీ లైట్లు వినియోగించేందుకు అనుమతి ఎలా ఇచ్చారని నిలదీశారు.


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. యూపీఏ హయాంలో మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దు చేస్తే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చే సరికి అర్ధరాత్రి దొంగల్లాగా తమ పార్టీ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. వారికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనని, మెట్రో, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, కృష్ణ జలాల తరలింపు వంటి పనులన్నీ తమ పాలనలోనే జరిగాయని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.


పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌, కేటీఆర్‌ ఇతర మంత్రులు ఉన్న హోర్డింగ్స్‌ తొలగించాలని ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినా ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. హోర్డింగ్‌లను తొలగించేలా ఆదేశాలు జారీ చేయని పక్షంలో కార్యకర్తలతో కలిసి తామే తొలగిస్తామని హెచ్చరించారు.


ప్రచారానికి రెండు కమిటీలు ఏర్పాటు

ఎన్నికల ప్రచారంలో భాగంగా పది మంది సీనియర్లతో హైపవర్‌ మీడియా కమిటీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా మాజీ ఎంపీ మఽఽధుయాష్కీగౌడ్‌ వ్యవహరిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ప్రకటించారు. ఇందులో సీనియర్‌ దామోదర రాజనర్సింహా, జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, పొన్నం ప్రభాకర్‌, సంపత్‌ కుమార్‌, దాసోజు శ్రావణ్‌, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, తూర్పు జగ్గారెడ్డి, అమీర్‌ జావేద్‌ ఉన్నారు.


వీరిలో ఒకరు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడతారని ఉత్తమ్‌ వెల్లడించారు. అలాగే సోషల్‌ మీడియాలో ప్రచారం కోసం ఏడుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ సోషల్‌ మీడియా కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్‌గా చల్లా వంశీచందర్‌రెడ్డి వ్యవహరించనున్నారు. 


Advertisement
Advertisement