కాంట్రాక్ట్ కిల్లర్‌ను కాల్చి చంపిన పోలీసులు.. తప్పించుకునే ప్రయత్నంలో హతం

ABN , First Publish Date - 2021-07-09T01:44:28+05:30 IST

నేరస్థుల ఏరివేత కొనసాగుతోంది. రెండు హత్య కేసుల్లో మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ అయిన వ్యక్తిని

కాంట్రాక్ట్ కిల్లర్‌ను కాల్చి చంపిన పోలీసులు.. తప్పించుకునే ప్రయత్నంలో హతం

గువాహటి: అస్సాంలో నేరస్థుల ఏరివేత కొనసాగుతోంది. రెండు హత్య కేసుల్లో మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ అయిన వ్యక్తిని చిరాంగ్ జిల్లా పోలీసులు నేడు కాల్చి చంపారు. పోలీసు అధికారి నుంచి తుపాకి లాక్కునేందుకు నిందితుడు ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదయం ఎగువ అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో ఓ పశువుల దొంగ పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు.


అస్సాం పోలీసులు జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు నిందితులపై కాల్పులు జరిపారు. కస్టడీలో ఉన్నవారు తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలో ఈ ఘటనలు జరిగాయి. వీరిలో ముగ్గురు మరణించారు. 


హోంగార్డ్ ఇయాద్ అలీ హత్య కేసులో అబ్దుల్ ఖలీక్ (20)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షలతో హోంగార్డు‌ను హత్య చేసేందుకు సఫియుర్ రహ్మాన్ అనే వ్యక్తి రూ. 1.5 లక్షలకు అబ్దుల్ ఖలీక్, అయూబ్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు అబ్దుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేసిన అబ్దుల్ ఓ కానిస్టేబుల్ వద్దనున్న తుపాకిని లాక్కుని అతడికి గురిపెట్టాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే కాల్పులు జరపడంతో అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు.


మరో ఘటనలో, కున్వల్‌దీప్ సింగ్ సిద్ధు అనే కిడ్నాపర్‌ హతమయ్యాడు. పోలీసు నుంచి తుపాకి లాక్కుని తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అతడిని మట్టుబెట్టారు. పోలీసు రికార్డుల ప్రకారం జూన్ 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 15 మంది గాయపడగా ముగ్గురు హతమయ్యారు. మరో ఘటనలో ఐదుగురు పశువుల దొంగలు గాయపడ్డారు. అత్యాచారం కేసులో ఇద్దరు, డ్రగ్ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు, అపహరణ కేసులో ఒకరు పోలీసుల కాల్పుల్లోగాయపడ్డారు. తీవ్రమైన నేరాలు ఎదుర్కొంటున్న వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తే కాల్పులు తప్పవని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తేల్చి చెప్పారు. 


Updated Date - 2021-07-09T01:44:28+05:30 IST