Abn logo
Oct 14 2021 @ 00:11AM

అల్లూరి ఆయుధ పూజ

విప్లవాల అగ్గిబరాటా.. అల్లూరి సీతారామరాజు.బ్రిటిష్‌ సైన్యాన్ని చిత్తుచిత్తు చేసి దేశం కోసం ప్రాణాలను అర్పించిన మన్యం వీరుడాయన. ఆయన ఉపయోగించిన విల్లు, కత్తి, ఖడ్గం.. ఇలా అనేక ఆయుధాలను భద్రపరిచారు నటుడు, తెలంగాణ సినీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు మంతెన నాగరాజు. ఆ ఆయుధాల కథేమిటి? వాటిని ఎలా పూజిస్తారు? ఎలా భద్రపరుస్తారు?  తదితర వివరాలను  ఆయన పంచుకున్నారు.


‘‘ల్లూరి సీతారామరాజు ఆయుధాలు గత 36 ఏళ్లనుంచీ నా దగ్గర ఉన్నాయి. వాస్తవానికి ఈ ఆయుధాలన్నీ నా భార్య కుటుంబానికి  వారసత్వంగా వస్తున్నాయి. వాళ్లు పాలకులు. వారి పూర్వీకులకు మంచి పేరుంది. పెళ్లయ్యాక దసరాకి మా మామయ్య ఇంటికి వెళ్లాను. ‘మేం ఆయుధపూజ చేస్తాం.. శబ్దాలు వస్తాయి. ఏమీ భయపడొద’దని మా బావమరిది చెప్పారు. నేను అదో హాస్యం అనుకున్నా. నేను లండన్‌, ఇతర దేశాలు చూసొచ్చాను కాబట్టి ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. ఆయుధాలను ప్రత్యేకంగా ఉంచిన గది పక్క నుంచి గదికి... అర్థరాత్రి దాటాక వెళ్తున్నా. ఏవో విచిత్రమైన శబ్దాలు, ఒకటే వైబ్రేషన్స్‌. అవి విన్నాక భయంతో వేగంగా నడుచుకుంటూ నా గదికి వెళ్లిపోయా. 

అలా ఆయుధాలు నాకొచ్చాయి.. 

మరుసటి రోజు ఆ ప్రత్యేకమైన గదిలో ఆయుధాలను పూజించారు. ఏవో శక్తులుంటాయి. వాటిని తృప్తిపరుస్తారు. పూజ సమయంలో రక్తతర్పణం తప్పనిసరి. మా మామయ్య ప్రతి ఏడాదీ గంటసేపు ఆయుధ పూజ చేసేవారు. ఓ పూజారి వచ్చేవారు. ఆయన ఆచమనం దగ్గరనుంచి తర్పణం వరకూ దగ్గరుండి అన్నీ చేసేవారు. ఇలా అల్లూరి వారి ఆయుధాలను దగ్గరగా చూశాక.. అవి నా దగ్గర ఉంటే బావుంటుంది అనుకున్నా. కట్నం కింద వీటిని తీసుకెళ్తానని మామయ్య గారిని సరదాగా అడిగా. ఆ తర్వాత అల్లూరి ఆయుధాలు ఆయన నాకు ఇచ్చారు.


మా ప్యాలెస్‌లోనే విద్య.. 

మా మామయ్య పేరు దాట్ల జోగి జగన్నాఽథరాజు. ఆయన ప్యాలె్‌సలో అల్లూరి సీతారామరాజు ఏడేళ్లపాటు చదువుకున్నారు. మంచి ప్రతిభావంతుడు కావటంతో మా మామయ్యగారి తాతయ్యగారు కృష్ణవర్మ విల్లంబులు వేయటమెలాగో అల్లూరికి నేర్పించారు. వాటి ప్రత్యేకత ఏంటంటే.. ఒకేసారి నాలుగు దిశల్లోకి నాలుగు బాణాలను సంధిస్తారు. ఆ శక్తి కృష్ణవర్మ గారికి ఉండేది. ఆయన ఆ విద్యను అల్లూరికి బోధించారు. కత్తి విద్య కూడా ఆయనే నేర్పించారు. అంతెందుకూ.. సీతారామరాజు చనిపోయే రోజు కూడా కృష్ణవర్మగారికి ‘వెళ్తొస్తా’ అని చెప్పి వెళ్లారట. తనని పట్టుకోవడానికి బ్రిటిష్‌ వారు డబ్బు ప్రకటించారని అల్లూరి అనేవారట. అల్లూరి సీతారామరాజుగారిని కలవటానికి మల్లుదొర, గంటందొర ఆ ప్యాలె్‌సకి వచ్చేవారట. ఆ ప్యాలెస్‌ రెండువందల ఏళ్లనాటిది. పాడైపోతే.. ఈ మధ్యనే పడగొట్టాం. అంతటి అనుబంధం నాది. 


అల్లూరి సీతారామరాజు బతికింది కేవలం 29 ఏళ్లే. ధైర్యంగా జీవించారు.దేనికి భయపడలేదు. ఇక్కడ కనిపించే ఈ ఆయుధాలతోనే ఎంతో మంది శత్రువులను సంహరించారు అల్లూరి. ఈ విల్లుకి తాడు, దారం కట్టకూడదు. జంతువు నుంచి తీసిన నార  కడితే విల్లు మరింత శక్తిమంతం అవుతుంది. ఈ ఆయుధాలన్నీ వందేళ్ల కితం నాటివి. నేను 36 ఏళ్లనుంచీ వీటిని భద్రపరిచాను. ఇవంటే నాకు భక్తి. నా ప్రాణం. వీటికి లైసెన్స్‌ ఉంది. వీటిని దేవుడిచ్చిన వరంగా భావిస్తా. ఒక్కమాటలో ఇది.. నా ఆస్తి. ఒకప్పుడు మామయ్యగారు ఆయుధ పూజ ఎలా చేశారో అదే విధంగా నేను ఇప్పటికీ చేస్తున్నా. ఇవి నా దగ్గర ఉంటే సంతృప్తిగా, బలంగా అనిపిస్తుంది. మీడియా ద్వారా మా దగ్గర ఉండే ఆయుధాల గురించి ప్రజలకు తెలిసింది. ఎప్పుడూ వీటి గురించి గర్వంగా ఎక్కడా చెప్పుకోలేదు. ఎవరైనా హ్యాండిల్‌ చేయడంలో పాడు చేస్తే బాధ కలుగుతుంది.. అదిగాక వీటిని ముట్టుకోవాలంటే శుచిగా ఉండాలి. ఎవరంటే వాళ్లొచ్చి ముట్టుకోవడం వల్ల ఇవి వంగిపోతాయి. వీటిని ఎవరైనా పొరపాటున వంచితో నాకు ప్రాణం పోయినట్టవుతుంది. వీటితో అంత అనుబంధం.


నా వయసు 78 ఏళ్లు. పదమూడేళ్ల క్రితం ‘రంగ ది దొంగ’ చిత్రంతో విలన్‌గా ఇండస్ర్టీలోకి వచ్చా. మా నాన్న చిరంజీవిగారి తండ్రిగా ‘అల్లుడా మజాకా’ చిత్రంలో నటించారు. నేను ఇటీవల ‘సైరా’ తాతయ్యగా చిరంజీవిగారితో కలిసి నటించా. ఇప్పటిదాకా 19 సినిమాల్లో నటించానంతే. అయితే గత యాభై ఏళ్ల నుంచి పరిశ్రమతో అనుబంధం ఉంది. పంజగుట్టలో బాలాజీ భవన్‌ హోటల్‌ మాది. రామానాయుడుతో పాటు అక్కినేని, కృష్ణ, రజనీకాంత్‌.. ఇలా స్టార్లందరూ మా హోటల్‌కు వచ్చేవారు. వాళ్ల షూటింగ్‌ అవుతోంటే రాజుగారి హోటల్‌లో ముప్ఫయ్‌ గదులు బుక్‌ అయ్యేవి. భోజనాలు అద్భుతంగా ఉంటాయని చిరంజీవి, రజనీకాంత్‌తో పాటు తమిళం, కన్నడ నటులు వచ్చేవారు. అంతెందుకు... ముంబయి నుంచి అమితాబ్‌, మాధురీ దీక్షిత్‌, నగ్మా.. ఇలా ఎవరొచ్చినా మా హోటల్‌లో ఆతిథ్యం స్వీకరించేవారు. రాజుగారి భోజనం అంటే అంత పేరు. యాభై ఏళ్లనుంచీ అదే మన్ననల్ని పొందుతున్నాం. రాజులంటే స్వతహాగా భోజనప్రియులు. మా దగ్గరి వారికి భోజనాలు పెట్టి వాళ్లను సంతోషపరచటమంటే మాకిష్టం. పెద్దాయన రామారావుగారి తర్వాత ప్రభాస్‌ అంటే ఇష్టం.