Abn logo
May 17 2021 @ 00:44AM

నేను తెలంగాణ రచయితనా, ఆంధ్ర రచయితనా, సీమ రచయితనా?

పి. రామకృష్ణగారి ‘సాహిత్యంలోనూ గదులేనా?’ (19.04.2021) వ్యాసంపై స్పందిస్తూ మొలక పల్లి కోటేశ్వరరావు, ఘట్టమరాజుగార్ల వ్యాసాలు (03.05.2021) పరిశీలించాక చాలాకాలంగా సాగుతున్న స్త్రీల సమస్యలపై స్త్రీలే బాగా రాస్తారు, దళితుల సమస్యలని దళితులే బాగా రాస్తారు, మైనారిటీ సమస్యలని మైనారిటీలే బాగా రాయగలరు అనడంలో కొంత నిజమున్నా, ఇతరులు రాయలేరు అనడంలో ఔచిత్యం లేదు. ఆ ముసుగులో కొన్ని స్థాయిలేని కథలు వస్తున్నాయన్న కోటేశ్వరరావుగారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఒక విషయం చెప్పదలిచాను. ఏ రచయితైనా సమాజంలో తను చూసిన, అను భవించిన జీవిత సమస్యల్ని తను స్పందించిన తీవ్రత మేరకు నిజాయితీగా చిత్రిస్తాడు. అను భవంలేని కొన్ని విషయాలు ఎక్కడో విన్నవో- చదివినవో రాయడం జరగదు. ఒకవేళ రాసినా వార్తా కథనాలుగానే ఉంటాయి. 


ఇటీవల రచయితలు కవులు గుంపులు గుంపులుగానే మసలుతున్నారు. ముఖ్యంగా కవులు. ఈ గ్రూపులో పక్షి అక్కడ వాలదు. ఆ పక్షులు ఇక్కడ వాలవు. ఇది భాగ్యనగరంలో చాలా కాలంగా గమనిస్తున్నదే. దాంతోపాటు ఇప్పుడు ప్రాంతీయతా చోటు చేసుకుంది. ఆంధ్రలో జరిగే సాహితీ సమావేశాలకు తెలంగాణలోని కవుల్ని రచయితల్ని పిలవడమేమిటి అని ఓ అభ్యుదయ సాహితీవేత్త తెగ బాధపడ్డం విని ఇదెక్కడి చోద్యం అనిపించింది.


రాను రాను రచయితలు కవులు (ఆడా మగా కూడా) విశ్వ మానవత్వాన్ని మరిచి తమ పరిధిని, కుల మత ప్రాంతాలతో పాటు స్త్రీ పురుష భేదాలకు తమకు తెలియకుండానే కుదించుకుంటున్నారు. పక్కవాడిని ప్రేమించ లేక వాడు రాసింది సహించలేక కళ్ళు మూసుకోవడమేమిటి? నేటి తరం సాహిత్య కారుల్లో కొంతమంది తాము రాసింది తప్ప ఇతర్లవి చదివే అలవాటు లేదు. 


చాలాకాలం కిందట విశాఖ జిల్లా రచయితల సంఘం స్థాపించబడింది. దాని ఉద్దేశం స్థానిక ఔత్సాహిక రచయితల్ని ప్రోత్సహించడమేకాని మరోటి కాదు. అటు నుండి కళింగ కథ, తెలం గాణ కథ, సీమ కథలుగా వచ్చాయి.


ఏ కథైనా చెప్పే విషయం మీదే రచయిత దృష్టి. ఆ సమస్య నేపథ్యానికి అనుగుణంగా అతి సహజంగా చిత్రించను ఒక స్వరాన్ని (యాసని) ఎంచుకుంటాడు. అంతేగాని ప్రాంతీయ తత్వంతో కాదు. యజ్ఞం కథని మరో ప్రాంత మాండలికంలో చదవాలను కోవడం ఎలా వుంటుందో ఆలోచించండి. ఆ కథా నేపథ్యానికి ఆ యాస (మాండలికం) అవసరం. అలాగే ‘చిల్లరదేవుళ్లు’ నవలకు తెలంగాణ యాస అందాన్నిచ్చింది. స్వామి ‘గద్దలాడతండాయి’ నవలకు సీమ పలుకే నప్పింది. ఇక్కడ వస్తువే దాని నేపథ్య అవసరార్థం యాసని/ మాండలికాన్ని ఎంచు కుంటుందన్నది సత్యం. 


సీమ కథ అంటే సీమలో పుట్టినవాళ్ళు రాసిన కతలా లేక సీమ సమస్యల మీద రాసిన కథలా అని ఆలోచించాలి. దళిత కథ అంటే దళితులు రాసుకున్నవే కాదు ఇతరులు రాసినవి కూడా అని వేరే చెప్పాలా? అలాగే స్త్రీవాద మైనారిటీ కథలు కూడా. 


ఒక సీమ రచయిత నాతో మాటల సంద ర్భంలో ‘‘మీరు తెలంగాణా, ఆ కథలే రాస్తారు’’ అంటూ వేరు చేశాడు. నేను సీమలో పుట్టి పెరిగినా సీమ రచయితను కాలేకపోయాను. తెలంగాణ రచయితలూ వాళ్ళ వాడిగా గుర్తిం చరు. ఇహ సర్కారు, ఉత్తరాంధ్ర వారి సంగతి చెప్పాల్సిన పని లేదు. నా వరకు కథా నేపథ్యం ఎక్కడి దైతే ఆ యాస వాడాను. ‘కిష్కింధ కాండ’, ‘విలువలు’ కథలు విశాఖ విజయనగరం నేపథ్యంలో, ‘జీవంలేని మొక్క’, ‘నిశ్శబ్ద సంకేతం’, ‘యాది’ కథలు తెలంగాణ నేపథ్యంలో, ‘జీవన వేదం’, ‘ఇదింతేనా’ కథలు సీమ నేపథ్యంలో రాశాను. మరి నేను తెలంగాణ రచయితనా? ఆంధ్రా రచయితనా? లేక సీమ రచయితనా?- - వాస్తవానికి ఎవరికీ చెందని తెలుగు రచయితను నేను. నాలాంటి త్రిశంకు రచయితలెందరో. 

వారాల కృష్ణమూర్తి

94402 34491

Advertisement
Advertisement
Advertisement