నాడు ఘనం.. నేడు దయనీయం

ABN , First Publish Date - 2020-09-27T06:41:20+05:30 IST

నాలుగు మండలాలకు కూడలిగా.. రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్న ఆమనగల్లు పట్టణంలోని జవహర్‌ ఆంధ్ర శాఖా గ్రంథాలయం పరిస్థితి దయనీయంగా మారింది. దశాబ్దాల చరిత్ర....

నాడు ఘనం.. నేడు దయనీయం

మొక్కుబడిగా సాగుతున్న ఆమనగల్లు గ్రంథాలయం 

నాలుగేళ్లుగా ఖాళీగా లైబ్రేరియన్‌ పోస్టు 

ఎవరికీ పట్టని గ్రంథాలయ బాగోగులు 

శిథిలావస్థకు చేరిన దశాబ్దాల నాటి భవనం 

కొరవడిన జిల్లా అధికారుల పర్యవేక్షణ

మోడల్‌ లైబ్రరీ ప్రతిపాదనలకే పరిమితం 


ఆమనగల్లు: నాలుగు మండలాలకు కూడలిగా.. రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్న ఆమనగల్లు పట్టణంలోని జవహర్‌ ఆంధ్ర శాఖా గ్రంథాలయం పరిస్థితి దయనీయంగా మారింది. దశాబ్దాల చరిత్ర కలిగి నాడు వందలాది మంది పాఠకులతో కళకళలాడిన గ్రంథాలయం నేడు వెలవెలబోతోంది. గ్రంథాలయం బాగోగులు ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, స్థానికులు, పాఠకులు వాపోతున్నారు. ఏళ్లుగా రెగ్యులర్‌ గ్రంథపాలకుడు లేక  లైబ్రరీ మొక్కుబడిగా పనిచేస్తోంది. ఏటేటా పాఠకుల సంఖ్య పడిపోతూ ఎప్పుడు మూతబడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు పత్రికలు చదవడానికి వస్తున్నవారే తప్ప రెగ్యులర్‌ పాఠకులు పూర్తిగా తగ్గిపోయారు. ఫలితంగా గ్రంథాలయంపై పాఠకుల్లో విశ్వాసం క్రమంగా తగ్గిపోతోంది. 


నాలుగేళ్లుగా గ్రంథపాలకుడి నియామకమేదీ?

ఆమనగల్లు గ్రంథాలయానికి నాలుగేళ్ల్ల కాలంగా గ్రంథపాలకుడి పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ గ్రంథపాలకుడిగా పనిచేసిన హర్షవర్దన్‌ 2016 జూలైలో ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించలేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి గ్రంథపాలకుడు బుచ్చయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత బుచ్చయ్యకు పదోన్నతి వచ్చి బదిలీ కావడంతో మళ్లీ మాడేళ్ల క్రితం తలకొండపల్లి గ్రంథపాలకుడు సత్యనారాయణకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన సైతం చుట్టపుచూపులా నెలకు రెండు మూడు సార్లు వచ్చిపోతున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి. స్వీపర్‌ ముంతాజ్‌ గ్రంథాలయ ముందు  భాగంలో గల రీడింగ్‌ రూమ్‌ను తెరవడంతో కొందరు దిన పత్రికలు మాత్రం చదివి వెళ్లిపోతున్నారు. 


సభ్యత్వం ఉన్నా ఫలితం నిల్‌!

గ్రంథాలయంలో మెంబర్‌షిప్‌ ఉన్నా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. గ్రంథపాలకుడు లేక, పుస్తకాల గదికి తాళం ఉండడంతో సభ్యత్వం ఉన్న వారికీ పుస్తకాలు అందడం లేదు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు పుస్తకాలు అందుబాటులో లేక వేల రుపాయాలు వెచ్చించి బయట కొనుక్కొంటున్నారు. గ్రంథాలయానికి దశాబ్దాల క్రితం ఇచ్చిన పాత పుస్తకాలే తప్ప కొత్తగా పుస్తకాలు కూడా రాలేదని తెలుస్తోంది.


ప్రతిపాదనల్లోనే మోడల్‌ గ్రంథాలయం ...

గ్రంథాలయ ఆధునికీకరణ, అభివృద్ధి, మోడల్‌ గ్రంథాలయ ఏర్పాటు నేతల హామీలు, అధికారుల ప్రతిపాదనలకే పరిమితమైంది. గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరింది. పాత భవనం ఓ మాదిరిగా ఉన్నా.. కొత్త భవనం వర్షం వస్తే కురుస్తోంది. మౌలిక వసతులు లేవు. గ్రంథాలయం ఎదుట దుకాణ సముదాయ నిర్మాణం ప్రతిపాదనల్లోనే నిలిచింది. దశాబ్దాలుగా పనిచేస్తున్న స్వీపర్‌కు కూడా సరైన వేతనం ఇవ్వడం లేదు. ఏళ్లుగా తనకు రెగ్యులర్‌ కాక లేడీ స్వీపర్‌ ఆవేదనకు లోనవుతోంది.


అధికారుల సందర్శన

ఆమనగల్లులో శిథిలావస్థకు చేరిన గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ సీహెచ్‌.రమణకుమార్‌, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల సందర్శించారు. ప్రస్తుత గ్రంథాలయ భవనాన్ని తొలగించి మోడల్‌ గ్రంథాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. పాత భవన తొలగింపునకు ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు జారీ అయినట్టు కొందరు నేతలు పేర్కొన్నా పనులు మాత్రం చేపట్టలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతిని ధులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండు రంగారెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆమనగల్లు పట్టణ ప్రజలు కోరుతు న్నారు. అలాగైతేనే ఇబ్బందులు తీరుతాయంటున్నారు.


రూ.కోటిన్నరతో మోడల్‌ లైబ్రరీ

ఆమనగల్లులో సుమారు రూ.కోటిన్నర వ్యయంతో నూతన మోడల్‌ గ్రంథాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ద్వారా ఇప్పటికే మోడల్‌ భవన నిర్మాణం కోనం ప్రభుత్వానికి, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డికి నివేదించాం. ఇటీవలే రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ కూడా గ్రంథాలయాన్ని సందర్శించారు. వీలైనంత త్వరగా భవన నిర్మాణానికి చర్యలు చేపడుతామని తెలిపారు. 

- వస్పుల జంగయ్య, గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్‌, ఆమనగల్లు 


గ్రంథాలయానికి పూర్వ వైభవం కల్పించాలి

నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న గ్రంథ పాలకుడి పోస్టును వెంటనే భర్తీ చేయాలి. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌  చొరవ తీసుకోవాలి. చుట్టూ నాలుగు మండలాలకు కూడలిగా ఉండి.. కీలకంగా మారిన ఇక్కడి గ్రంథాలయానికి వెంటనే కొత్త భవనాన్ని నిర్మించి వేలాది మంది పాఠకులకు మెరుగైన వసతులు కల్పించాలి. పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు, విద్యార్థులకు అవసరపడే అన్ని పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచాలి.

- పున్న దినేశ్‌, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర నాయకుడు, ఆమనగల్లు 


లైబ్రేరియన్‌ పోస్ట్‌ భర్తీ చేయాలి

ఆమనగల్లులో శాఖా గ్రంథపాలకుడి పోస్ట్‌ను వెంటనే భర్తీ చేయాలి. గ్రంథాలయాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దాలి. నాలుగు మండలాలకు కూడలిగా ఉన్న ఆమనగల్లు గ్రంథాలయంలో నిరుద్యోగ యువతకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలూ అందుబాటులో ఉంచాలి. మారిన సిలబస్‌ ప్రకారం పోటీ పరీక్షల పుస్తకాలను తెప్పించాలి. ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని ఆమనగల్లు లైబ్రరీకి పూర్వ వైభవాన్ని కల్పించాలి. అవసరమైన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలి.

- పాపిశెట్టి రాము, ఆమనగల్లు 

Updated Date - 2020-09-27T06:41:20+05:30 IST