తోట దాటని పంట!

ABN , First Publish Date - 2020-04-03T08:43:20+05:30 IST

తోట దాటని పంట!

తోట దాటని పంట!

చెరువు గట్టెక్కని ఆక్వా ఉత్పత్తులు.. ధర తగ్గినా కొనే నాథుడు కరువు

ఉంచలేక, అమ్మలేక రైతు దిగాలు..అమలుకాని ప్రభుత్వ హామీ


అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి):  దేశమంతటా లాక్‌డౌన్‌ అమలవుతుండడంతో వ్యవసాయ రంగం ఒక్కసారిగా కుదేలైంది. పంట బాగానే పండినా మార్కెట్లు మూతపడి, ఉత్పత్తులు కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. రవాణా సౌకర్యం లేక పంట ఉత్పత్తుల ధరలు పాతాళానికి పడిపోయాయి. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. కనీసం మద్దతు ధర ఇచ్చినా చాలన్నట్టుగా ఉంది స్థితి. ఉద్యాన పంట ఉత్పత్తులు చేతికొచ్చి తోటల్లోనే నేలరాలిపోతున్నా అచేతనంగా ఉండిపోతున్నాడు. ఆక్వా రంగమూ అలాగే ఉంది. పంటను మార్కెటింగ్‌ చేసుకోలేక, రవాణా సౌకర్యం లేక, కనీస ధర రాక, పెట్టుబడులు దక్కక అప్పుల పాలయ్యే స్థితికిరాష్ట్ర రైతాంగం చేరుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా.. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు దిగజారిపోతుంటే.. రిటైల్‌గా మాత్రం ఆకాశాన్నంటున్నాయి.  ఆక్వా, ఉద్యాన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పినా.. ఆచరణలో అమలు కావడంలేదని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 


అరటి, చీనీ పంట నేలపాలు

రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అరటి, చీనీ పంటలు చేతికొచ్చి ఉన్నాయి. కానీ.. లాక్‌డౌన్‌తో రవాణా లేక, మార్కెట్లు మూతేయడంతో పంట తోటల్లోనే ఉండిపోయింది. కోతకొచ్చిన పంట కోయడానికి కూలీలు రాక, వచ్చినా మార్కెట్‌కు తరలించడానికి మార్గాలు లేక కాపు వదిలేయాల్సిన పరిస్థితి. దీంతో పంట నేలపాలవుతోంది. 


కూలీలు వెనుకంజ

కృష్ణా, ఉభయగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో పంటపైనా కరోనా ప్రభావం చూపింది. వరి పంట కోతకొచ్చినా.. కరోనా భయంతో కూలీలు రావడం లేదు.  ఇదే సమయంలో వరి యంత్రాలు మూలనపడ్డాయి.  అలాగే ఏటా రూ.11వేల కోట్ల ఆదాయం వచ్చే ఆక్వా రంగం  కుదేలైంది. కోళ్లకి కరోనా వైరస్‌ ప్రభావం లేదని పశుసంవర్థకశాఖ ప్రకటించాక చికెన్‌ విక్రయాలు కొద్దిగా పెరిగాయి. మార్చి ఆరంభంలో కిలో రూ.40కి పడిపోయిన చికెన్‌ ధర మళ్లీ పెరిగి, పౌల్ర్టీ రైతులు కొద్దిగా కుదుట పడుతున్నారు.

Updated Date - 2020-04-03T08:43:20+05:30 IST