అమరావతి టూ అరసవల్లి

ABN , First Publish Date - 2022-09-12T10:13:10+05:30 IST

మరో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు మరో మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు.

అమరావతి టూ అరసవల్లి

నేటి నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర 

(ఆంధ్రజ్యోతి-గుంటూరు): మరో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు మరో మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. అమరావతి ఉద్యమానికి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. సోమవారం అమరావతిలోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు.  ఉదయం 5 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమరావతి రైతులు పాదయాత్రకు బయల్దేరుతారు. మొత్తం 60 రోజుల పాటు 630 కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర చేపట్టనున్నారు. అమరావతి నుంచి ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల గుండా శ్రీకాకుళంలోని అరసవల్లి  వరకు యాత్ర కొనసాగనుంది. గత ఏడాది న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి నుంచి తిరుమల తిరుపతి వరకు చేపట్టిన మహాపాదయాత్ర దిగ్విజయమైన సంగతి తెలిసిందే. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల గుండా మొత్తం 400 కిలో మీటర్ల మేర యాత్ర సాగింది. అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకు సంబంధించినది కాదని, రాష్ట్ర ప్రజలందరిది అని చాటి చెప్పింది. అదే స్ఫూర్తితో మరో యాత్రకు బయల్దేరారు. రాష్ట్రంలో అధికార పార్టీ మినహా అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతు ప్రకటించాయి. 


600 మందితో యాత్ర

గతేడాది నవంబరు 1న చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర కంటే తాజాగా చేపట్టిన పాదయాత్ర సుదీర్ఘమైనది. 600 మంది పాదయాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరంతా 60 రోజుల పాటు 630 కిలోమీటర్ల మేర పాదయాత్ర ముగిసే వరకూ యాత్రలో కొనసాగుతారు. పాదయాత్రకు ప్రభుత్వం, పోలీసు శాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది. 

Updated Date - 2022-09-12T10:13:10+05:30 IST