Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేడ్కర్, ప్రజాస్వామిక జాగృతి

వర్తమాన భారతదేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా, చైతన్యశీలంగా ఉందా? అలా లేదు అనేందుకు కొన్ని సూచనలు కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం దృఢంగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం మనం ఒక రాజకీయ సంక్షోభాన్ని చవిచూస్తున్న నేపథ్యంలో భారత ప్రజాస్వామ్యం శక్తిమంతంగా ఉందన్న సమాధానం చాలా మందికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. అయితే ఇటువంటి సంక్షోభాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆనాడే ఊహించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఎన్నికల నిర్వహణలో మనం అనుసరిస్తున్న ఆదర్శప్రాయ పద్ధతులే ఆ అంచనాకు ప్రాతిపదిక. మన దేశంలో ఎన్నికల పద్ధతి ఒక పండగ వాతావరణాన్ని తలపించడం కద్దు. అది ప్రజలకు ఓటుహక్కుతో తమ వంతు బాధ్యతను గుర్తుచేస్తుంది. ఇదే మన ప్రజాస్వామ్యం ఘనత. ఇది హర్షించతగ్గ విషయమే, సందేహం లేదు. ఒకే వ్యక్తి, ఒకే ఓటు, ఒకే విలువ అనే సూత్రాన్ని మన రాజకీయాలు పూర్తిగా అంగీకరించాయి. అయితే ప్రజాస్వామ్యాన్ని కేవలం ఒక ప్రభుత్వ వ్యవస్థతోనే ముడిపెట్టడం సరికాదు. దేశ ప్రజల ప్రజాస్వామ్య జాగృతి (consciousness), ప్రజాస్వామ్య చైతన్యశీలత స్ఫూర్తిచిహ్నాలూ కేవలం ఎన్నికల వేడుకలకే పరిమితం కాకూడదు.


ప్రజాస్వామ్య విలువలను సామాజిక-, ఆర్థిక రంగాలలో బలంగా నాటిన నాడే దేశ రాజకీయ వ్యవస్థను కూడా మనం ఆదర్శంగా తీసుకోగలుగుతాం. ఇందుకు రెండు ఉదాహరణలు చెప్పవచ్చు. ఒకటి- ఇటీవల హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో ప్రధానపార్టీలు అన్నీ డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టాయి. తద్వారా ఓటు హక్కుకు ఉన్న గొప్ప శక్తిని నాశనం చేశాయి. ‘మీరు ఆ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నా పర్వాలేదు కానీ ఓటు మాత్రం మాకే వేయాలి’ అని ప్రధానపార్టీలు బహిరంగంగా ప్రకటించాయి. ఈ ప్రకటనలు సగటు పౌరుడికి ఇచ్చే సందేశం ఎటువంటిది? డబ్బు పంపకం అంతలా ఉందని రాజకీయ పార్టీలే బహిరంగంగా ఒప్పుకుంటున్నప్పుడు ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతపై పౌరులు ‘నమ్మకం’ ఎలా పెట్టుకోగలుగుతారు?


రెండో ఉదాహరణ- డాక్టర్ అంబేడ్కర్‌ ఇప్పుడు అందరివాడయ్యాడు. ఇందులో తప్పు లేదు. వీథి వీథిలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పుకుని ఆరాధిస్తున్నారు. ఇలా అందరివాడైనా అంబేడ్కర్‌ సమానత్వ ఆశయసాధనలో మాత్రం కొందరివాడే. ముందుగా చెప్పినట్టు దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిచిహ్నలు దేశ ప్రజాస్వామ్య జాగృతిని, చైతన్యశీల స్పందనను మార్చేస్తాయి. అంతటి శక్తి ఉన్న ఆశయాలు, విలువలను ఈ దేశ ప్రజాస్వామ్యం గౌరవించి ఆదరించకపోవడం బాధాకరం. ‘జై భీమ్’ నినాదంతో సభలను (అన్ని సభలు కాదనుకోండి) ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బహుశా అంబేడ్కర్‌ చెప్పిన సామాజిక ప్రజాస్వామ్య సూత్రాలను అర్థం చేసుకున్నారని చెప్పగలమా? ఒకవేళ అర్థం చేసుకుని ఉన్నట్టయితే ‘దళితబంధు’ పథకాన్ని ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చే వారు కాదు కదా. 


ఇలా ఇంకా ఎన్నో ఉదాహరణలు మన దేశ, రాష్ట్ర రాజకీయ వ్యవస్థ పని తీరును కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. సమానత్వం, ఆత్మగౌరవం అనే రాజ్యాంగసూత్రాలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం వర్థిల్లడానికి చాలా అవసరం. ఈ సత్యాన్ని మన పాలకవర్గాలు మరచిపోయాయి. అంతేకాదు, అంబేడ్కర్‌ ప్రవచించిన ప్రజాస్వామ్యాన్ని అవి అర్థం చేసుకున్న విధానమూ వాటిని ఇరకాటంలో పెట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు. 


‘పరస్పరానుబంధంతో కూడిన ఒక జీవన విధానం’గా ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ అంబేడ్కర్ అర్థం చేసుకున్నారు. అది ‘సమాజంలో ఒక ఆదర్శప్రాయమైన మార్పుకు అనుకూలమైనదిగా ఉండాలి’ అని ఆయన అన్నారు. తన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో అంబేడ్కర్‌ ఈ వివరణ ఇచ్చారు. అయితే కుల నిర్మూలనకు అవసరమైన ఒక మౌలిక సూత్రం సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య పద్ధతుల ఆచరణకు కులం కూడా ఒక పెద్ద అడ్డుగోడ అనేది వాస్తవం. ఈ సంకుచిత కులవైఖరిని సవాలు చేసి పోరాడే గుణం, శక్తిని సగటు భారతీయుడికి ఇచ్చిన ఘనత డాక్టర్ అంబేడ్కర్‌కే దక్కుతుంది. అందుకే పాలకవర్గాలు ఆయన చూపించిన ప్రజాస్వామ్య మార్గాన్ని విస్మరిస్తాయి. విస్మరిస్తూనే, ఆయనను కీర్తించడం వాటికి ఒక అలవాటు.


ఈ సందర్భంలో ఒక ప్రశ్నను మనకు మనం వేసుకోవడం ఎంతో అవసరం. సమానత్వ నైతికతను, వ్యవస్థలో రోజువారీ విలువగా శాశ్వతం చేసే బాధ్యతను పాలకవర్గాలు చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాయా? ఒకవేళ నిర్వహిస్తుంటే ఎటువంటి పద్ధతులను వాళ్ళు ఎంచుకుంటున్నారు? అలాగే విస్మరించే స్థితిలో ఉంటే ఎందుకు అలా చేస్తున్నారు అనే ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. విస్మరించడంలో కుల అహంకార ధోరణి ఉన్నప్పటికీ అంబేడ్కర్‌ను ఎన్నికల సమయంలో అందరు మాటవరుసకు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి రావడం సిగ్గుచేటు. రాజకీయ తత్వవేత్త, ‘దేశానికి’ విముక్తి బాట చూపించిన రాజ్యాంగవాద ప్రతిపాదకుడికి అటువంటి స్థితి కల్పించడం సముచితమేనా? ఏమైనా దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది.


1943 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన ‘ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ వర్కర్స్ స్టడీ క్యాంప్’ ముగింపు సమావేశంలో ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొన్ని దేశాలలో ఎందుకు నిలబడలేకపోయింది’ అనే అంశంపై అంబేడ్కర్‌ ప్రసంగించారు. ‘ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాలు రాజకీయ ప్రజాస్వామ్యానికి కణ జాలము-, తంతువులు వంటివి. ఇవే దానికి బలాన్ని చేకూరుస్తాయి. కణాలు, తంతువులూ బలమైనవిగా ఉండాలి. సమానత్వానికి మరో పేరు ప్రజాస్వామ్యం. స్వేచ్ఛ పట్ల ప్రగాఢవాంఛను పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పెంచింది కానీ, సమానత్వాన్ని మాత్రం పట్టించుకోలేదు. అంతేకాకుండా స్వేచ్ఛ, సమానత్వాల మధ్య కొంత సమతుల్యతను సాధించటంలో కూడా అది విఫలమైంది. ఫలితంగా స్వేచ్ఛ, సమానత్వాన్ని కబళించి అసమానతలను (progeny of inequities) మిగిల్చింది’ అని అంబేడ్కర్ ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇది నిస్సందేహంగా గొప్ప విశ్లేషణ. 


ప్రస్తుతం మనదేశంలో నెలకొని ఉన్న రాజకీయ వాతావరణంలో కూడా అసమానతల బహుళ రూపాలను మనం చూడవచ్చు. సామాజిక మమేకతా ప్రక్రియ నిలిచిపోయింది. పౌరులు కేవలం మార్కెట్ వినియోగదారులుగా మతపరమైన జాతీయవాదానికి వితండవాద భక్తులుగా మారారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఈ విధంగా కుల అసమానతలను శాశ్వతం చేసి ప్రజలను సామాజిక ప్రజాస్వామ్యానికి దూరం చేయడం ఒక చారిత్రక తప్పిదం.


ఇటీవల భారత ప్రభుత్వం అధికారికంగా ‘రాజ్యాంగ దినోత్సవ’ వేడుకలు నిర్వహించింది. సామాజిక ప్రజాస్వామ్య విలువలను ఎంతవరకు ఆచరిస్తూ రాజ్యాంగాన్ని ఆ విధంగా గౌరవించింది? అది, పాలకవర్గాలకే తెలియాలి. సామాజిక న్యాయసాధన చాలా ముఖ్యం. అయితే తరచు దానిని పక్కన పెడుతూ తమకు అవసరమైన సామాజికవర్గాలను సమీకరించుకునేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ 1948 నవంబర్‌లో ‘రాజ్యాంగ సభ’ చర్చలో అన్న మాటలను గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగ నైతికత, ప్రజాస్వామ్యం మధ్య ఉన్న సంబంధాన్ని విపులీకరిస్తూ అంబేడ్కర్ ఇలా అన్నారు: ‘రాజ్యాంగ నైతికత అనేది సహజంగా ఉండే భావన కాదు. ఆ భావనను ప్రతి వ్యక్తిలో రోజువారీగా పెంపొందించాలి’. ఆయన ఇంకా ఇలా హెచ్చరించారు: ‘Democracy in India is only a top-dressing on an Indian soil, which is essentially undemocratic’. ఇదెంత నిజమో మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజ్యాంగ సభలోనే మరో రెండు సందర్భాలలో కూడా భారతీయ సమాజంలో అంతర్నిహితంగా ఉన్న ప్రజాస్వామ్య విరుద్ధ దోరణుల గురించి అంబేడ్కర్ హెచ్చరించారు. మరి ఆ హెచ్చరికల సామంజ్యసాన్ని మనం ఇప్పటికైనా సంపూర్ణంగా గుర్తించామా? ఆయన ప్రజాస్వామిక దార్శనికతను మనం పునర్‌దర్శించవలసి ఉంది. ఆయన చింతనాస్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి. సామాజిక విముక్తి, జాతీయ సమైక్యత, ప్రజాస్వామిక ఔన్నత్యానికి ఒక సమున్నత ప్రతీకగా అంబేడ్కర్‌ను గుర్తించి, గౌరవించాలి. అటువంటి మార్పే ఆయనకు మనం అందించగలిగే నిజమైన నివాళి.

పల్లికొండ మణికంఠ

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

(రేపు అంబేడ్కర్‌ వర్ధంతి)

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...