అమెరికాకు నగుబాటు

ABN , First Publish Date - 2021-01-08T06:15:31+05:30 IST

జనవరి ఆరు అమెరికా చరిత్రలో ఒక దుర్దినంగా నిలిచిపోతుంది. ప్రజల చేతుల్లో ఘోరంగా ఓడిన ఓ అధ్యక్షుడు, గద్దెదిగడానికి నిరాకరిస్తూ పార్లమెంటుమీదకు తన మద్దతు దారులను దండెత్తించిన దృశ్యాలను ఈ ప్రాచీన ప్రజాస్వామ్య....

అమెరికాకు నగుబాటు

జనవరి ఆరు అమెరికా చరిత్రలో ఒక దుర్దినంగా నిలిచిపోతుంది. ప్రజల చేతుల్లో ఘోరంగా ఓడిన ఓ అధ్యక్షుడు, గద్దెదిగడానికి నిరాకరిస్తూ పార్లమెంటుమీదకు తన మద్దతు దారులను దండెత్తించిన దృశ్యాలను ఈ ప్రాచీన ప్రజాస్వామ్య దేశంలో చూసి యావత్‌ ప్రపంచం విస్తుపోయింది. ఎంతో కొంత హింస లేకుండా అమెరికా అధ్యక్ష పదవినుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ అంత సులభంగా దిగరన్న విశ్లేషకుల అంచనాలు చివరకు నిజమైనాయి. మెజారిటీ ప్రజలు పట్టంగట్టిన బైడెన్‌ను అధికారంలోకి రానివ్వకుండా, ఆయన విజయాన్ని తారుమారు చేసేందుకు ట్రంప్‌, ఆయన మద్దతుదారులు చిట్టచివరగా చేసిన విఫలయత్నం ఇది. మరోమారు అధికారం దక్కనందుకు రగిలిపోతున్న ఆ మాజీ అధ్యక్షుడి ప్రోద్బలం మేరకు జరిగిన ఈ హింసలో నాలుగు ప్రాణాలు పోయాయి, ప్రపంచం ముందు ఆ దేశం పరువు ప్రతిష్ఠలు దిగజారాయి.

 

జో బైడెన్‌, కమలా హారిస్‌ విజయాలను ఖరారు చేసే ప్రక్రియ పార్లమెంటులో ఆరంభం కాబోతున్న తరుణంలో, ట్రంప్‌ తన మద్దతుదారులను దండయాత్రకు ఉసిగొల్పిన ఫలితం ఈ హింస. వేలాదిమంది పార్లమెంటు భవనం వైపు కదలడం, గుమిగూడడం, నినాదాలు చేయడం, పరిస్థితి అదుపుతప్పడం కాకతాళీయంగా జరిగినవేమీ కావు. ఒక బడా వ్యాపారవేత్తగా సైతం ఇటువంటి ఘట్టాలను ట్రంప్‌ సృష్టింపచేయగలడు. ఆయన అభిమానులు నినాదాలకు, జేజేలకు పరిమితం కాలేదు. తమ నాయకుడే విజేతనీ, బైడెన్‌ పరాజితుడని నినదించి ఊరుకోలేదు. పార్లమెంటు భవనం గోడలెక్కారు, చొరబడ్డారు, భద్రతాబలగాలను భయంలో ముంచెత్తుతూ లోనంతా పరుగులు తీశారు, చేతికందినవన్నీ ధ్వసం చేశారు. స్పీకర్‌ సహా అనేకమంది శాసనకర్తలను ప్రాణరక్షణ కోసం పరుగులు తీసేట్టు చేశారు. స్పీకర్‌ మీద అవాకులూ చెవాకులూ పేలారు. ట్రంప్‌ ఓటమిని నిర్థారించే ప్రక్రియను అడ్డుకోవడం వీరికి సాధ్యం కాకపోవచ్చు కానీ, బలమైన నేతలందరూ బంకర్లలోకి పోయేట్టు మాత్రం చేయగలిగారు. బాగుంది, ఇక చాలు అన్న రీతిలో ఓ నర్మగర్భ సందేశం ట్రంప్‌ సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రత్యక్షమయ్యే వరకూ ఈ విధ్వంసం కొనసాగింది. రాబోయే పదమూడు రోజులూ అమెరికా ప్రశాంతంగా బతకాలన్నా, అధికార బదిలీ నిక్షేపంగా జరగాలన్నా ట్రంప్‌ ఎకౌంట్లను కనీసం రెండువారాలు మూసేయక తప్పదని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నిర్ణయించుకున్నాయి. 


సెనేట్‌ సమావేశాల సందర్భంగా ఈ స్థాయిలో కాకున్నా ట్రంప్‌ మద్దతుదారుల నిరసనలు ఊహించినవే. కానీ, పార్టీ జెండాలూ, కర్రలే కాక ట్రంప్‌ మద్దతుదారులు చిన్నపాటి మారణాయుధాలతో సైతం వాహనాల్లో తరలివచ్చారన్న వార్తలే విస్తుగొలుపుతున్నాయి. భద్రతకు మారుపేరుగా ఉండాల్సిన ప్రాంతంలో ఏకంగా ఇలా మిలటరీని దించాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందో తెలియదు. యావత్‌ ప్రపంచాన్ని నివ్వెరపరచిన ఈ ఉన్మాదఘటనలో పాల్గొన్న ట్రంప్‌ మద్దతుదారులంటే ప్రధానంగా శ్వేతజాత్యహంకారులు, తుపాకీ హక్కుల, కుట్రసిద్ధాంతాల సమర్థకులు, నల్లజాతి వ్యతిరేకులు, ఆన్‌లైన్‌ దేశాభిమానులే. అమెరికా దృశ్యాలు చూసిన కొందరికైనా గతంలో భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి ఘటన గుర్తుకు వచ్చే ఉంటుంది. 


ట్రంప్‌ దుర్మార్గాన్నీ, ఈ విషాద ఘట్టాన్ని అటుంచితే, అక్కడి వ్యవస్థలు, వ్యక్తులు రాజ్యాంగ విలువలకు, నియమ నిబంధనలకు ఇచ్చిన విలువ, గౌరవం గమనించదగ్గవి. తిమ్మిని బమ్మిని చేయమన్న ట్రంప్‌ ఆదేశాన్ని తిరగ్గొట్టి ఉపాధ్యక్షుడు తన పదవి గౌరవాన్ని ఇతోధికంగా పెంచారు. ఇంకా చెప్పాలంటే, ఓటర్లు తమ ప్రాధాన్యతలను ప్రకటించిన తరువాత నుంచి  ఆయా రాష్ట్రాల్లోని శాసనకర్తలు, అధికారులు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా గీత దాటలేదు. అరవైకి పైగా కేసుల్లో న్యాయమూర్తులు సైతం తమ పార్టీ ప్రేమలను పక్కనబెట్టి న్యాయానికే కట్టుబడ్డారు. ట్రంప్‌ పక్షాన ఈ ఉమ్మడి పార్లమెంటు సమావేశంలో కొందరు సభ్యులు ఎన్నికల ఫలితాలను ప్రశ్నించినప్పటికీ, వాస్తవాన్నీ, కల్పననీ వేరు చేయడం దగ్గరకు వచ్చేసరికి న్యాయబద్ధంగానే వ్యవహరించారు. అంతిమంగా మెజారిటీ ప్రజల మనోభావానికి అద్దం పడుతూ, భావిపాలకులను నిర్థారించడంలో సమస్థ వ్యవస్థలూ సరైనదారిలోనే నడిచాయి. దారితప్పిన ట్రంప్‌ని మాత్రం చరిత్ర  క్షమించదు.

Updated Date - 2021-01-08T06:15:31+05:30 IST