Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉసిరికి సరిలేదు!

ఇప్పుడు ఎవరిని కదిలించినా ఇమ్యూనిటీ విషయంలో తగ్గేదేలె అంటున్నారు. ఉసిరి ఇమ్యూనిటీకి పవర్‌హౌజ్‌లాంటిది!  విరివిగా లభించే ఈ సీజన్‌లో ఉసిరిని ఎంత తీసుకుంటే ఇమ్యూనిటీ అంత పెరుగుతుంది. ఉసిరితో చేసే కొన్ని రెసిపీలు ఇవి. ఆ  రుచులను మీరూ ఆస్వాదించండి.


వందగ్రాముల ఉసిరిలో..


విటమిన్‌ సి - 600 మి.గ్రా

క్యాలరీ - 50

ప్రొటీన్‌ - 0.5గ్రా

కార్బోహైడ్రేట్లు - 13.7గ్రా


ఉసిరిలో సి- విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర నిలువలను నియంత్రించడంలోనూ ఉసిరి సహాయపడుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఉసిరిలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్‌, యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

గోన్‌ అవాల్‌ 


కావలసినవి


ఉసిరికాయలు - అరకేజీ (వీటికి ఒక టీస్పూన్‌ ఉప్పు కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి), నూనె - పావుకేజీ, కరివేపాకు - కొద్దిగా, ఉల్లిపాయలు - పావుకేజీ, వెల్లుల్లి - 100గ్రా, బెల్లం - ఒకటేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.


మసాలా కోసం : కశ్మీరీ కారం - 200గ్రా, లవంగాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒకటీస్పూన్‌, దాల్చినచెక్క - రెండు అంగుళాల ముక్క, అల్లం - కొద్దిగా, పసుపు - ఒక టీస్పూన్‌, వెల్లుల్లి - 100గ్రా, గోన్‌ వెనిగర్‌ - 250ఎంఎల్‌.


తయారీ విధానం


ముందుగా  మసాలా కోసం రెడీ చేసి పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి పేస్టులా తయారుచేసుకోవాలి.


స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక కరివేపాకు వేయాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.


తరిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగులోకి మారే వరకు వేయించుకోవాలి.


ఇప్పుడు ఉసిరికాయలు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించాలి. 


తరువాత రెడీ చేసి పెట్టుకున్న మసాల పేస్టు వేసి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.


బెల్లం వేయాలి. తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి మరో పదినిమిషాలు ఉడికించాలి.


స్టవ్‌పై నుంచి దింపి చల్లారనివ్వాలి. మిశ్రమం చల్లారిన తరువాత జాడీలోకి మార్చుకోవాలి. 


అన్నంలోకి లేదా రోటీతో తింటే రుచిగా ఉంటుంది.

ఆమ్లా జాట్జికి


కావలసినవి


ఉసిరికాయలు - ఆరు, పెరుగు - పావుకేజీ, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, మిరియాలు - 3గ్రా, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - చిటికెడు, పుదీనా - ఒకకట్ట, ఎండుమిర్చి - రెండు, గుమ్మడి విత్తనాలు - 10గ్రా, ఆలివ్‌ ఆయిల్‌ - తగినంత. 


తయారీ విధానం


వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలి. మిరియాలు పొడి చేసుకోవాలి. పుదీనాను శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి. ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకోవాలి. గుమ్మడి విత్తనాలను డ్రై రోస్ట్‌ చేసుకోవాలి.


ఒక బౌల్‌లో పెరుగు తీసుకోవాలి. తరువాత అందులో ఉసిరికాయల తురుము వేసి, ఉప్పు, దంచిన వెల్లుల్లి, ఇంగువ, పుదీనా, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి.


తరువాత ఎండుమిర్చి దంచి వేయాలి. గుమ్మడి విత్తనాలు వేసి కలుపుకోవాలి.


ఆలివ్‌ ఆయిల్‌తో గార్నిష్‌ చేసి కబాబ్స్‌తో సర్వ్‌ చేసుకోవాలి.

ఆమ్లా మిక్స్‌డ్‌ వెజిటబుల్‌  కట్‌లెట్‌


కావలసినవి


బీట్‌రూట్‌లు - రెండు, ఉసిరికాయలు - రెండు, పచ్చిబఠాణీలు - అరకప్పు, స్వీట్‌కార్న్‌ -  అరకప్పు, బంగాళదుంప - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి - రెండున్నర టేబుల్‌స్పూన్లు, కారం - అరటీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత.


తయారీ విధానం


బీట్‌రూట్‌లను, బంగాళదుంపను ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి.

 

ఉసిరికాయలను మెత్తగ ా చేసుకోవాలి. పచ్చిబఠాణీలను ఉడికించి గుజ్జుగా చేసి పెట్టుకోవాలి. 


స్వీట్‌కార్న్‌ను ఉడికించి మెత్తగా చేసి పెట్టుకోవాలి.


ఒక బౌల్‌లో గుజ్జుగా చేసుకున్న బీట్‌రూట్‌, ఉసిరికాయల గుజ్జు, పచ్చిబఠాణీల గుజ్జు, స్వీట్‌కార్న్‌ గుజ్జు తీసుకుని అందులో బియ్యప్పిండి, కొత్తిమీర, కారం, గరంమసాల, వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి కలుపుకోవాలి.


ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న బంతుల్లా చేసుకోవాలి. ఒక్కో బంతిని తీసుకుంటూ చేతితో కట్‌లెట్‌లా ఒత్తుకుంటూ నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి.


ఏదైనా చట్నీతో వేడి వేడి కట్‌లెట్స్‌ సర్వ్‌ చేసుకోవాలి.

ఉసిరికాయ జ్యూస్‌


కావలసినవి


ఉసిరికాయలు - రెండు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, పుదీనా - కొద్దిగా, అల్లం - చిన్నముక్క, బెల్లం - ఒకటేబుల్‌స్పూన్‌, బ్లాక్‌సాల్ట్‌ - చిటికెడు, నీళ్లు - అరకప్పు, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.


తయారీ విధానం


ఉసిరికాయలను శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. 


ఆ ముక్కలను జార్‌లోకి తీసుకుని నిమ్మరసం, పుదీనా, అల్లం ముక్క, కొద్దిగా నీళ్లు పోసి బ్లెండ్‌ చేసుకోవాలి.


తరువాత బెల్లం, బ్లాక్‌ సాల్ట్‌ వేసుకోవాలి.


ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లటి జ్యూస్‌ సిప్‌ చేయాలి.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...