రైతుల పంట నగదు అందజేత

ABN , First Publish Date - 2021-06-22T04:31:13+05:30 IST

పంట తాలూకా నగదును రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బినామీ కమీషన్‌ వ్యాపారుల నుంచి ఖమ్మం మార్కెట్‌ కమీటీ పాలకవర్గం సోమవారం బాధిత రైతులకు నగదు ఇప్పించారు.b

రైతుల పంట నగదు అందజేత

 బినామీ వ్యాపారుల నుంచి నగదు ఇప్పించిన మార్కెట్‌ కమిటీ

ఖమ్మం మార్కెట్‌ , జూన్‌ 21: పంట తాలూకా నగదును రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బినామీ కమీషన్‌ వ్యాపారుల నుంచి ఖమ్మం మార్కెట్‌ కమీటీ పాలకవర్గం సోమవారం బాధిత రైతులకు నగదు ఇప్పించారు. రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ ఘటనపై  ఆరా తీశారు. సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇటీవల రైతులను మోసం చేసిన వ్యాపారులను చర్చలకు పిలిపించారు. ఎంత మంది రైతులకు పంట తాలూకా నగదు ఇవ్వాలో నిర్థారించారు. వ్యాపారుల వద్ద నుంచి మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు ఇప్పించారు. గత ఏప్రిల్‌ నెలలో మార్కెట్‌లో పంట అమ్మిన  ఇల్లందు మండలం 9వ మైలు తండా, కారేపల్లి మండలం సూర్యాతండా, గిద్దవారి గూడెం, మధిరకు చెందిన సుమారు 25 మంది మిర్చి రైతులకు రావాల్సిన సుమారు రూ.30 లక్షలను రికవరి చేసి అందచేశారు. బాధిత రైతుల తరుపున ఇటీవల ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తమకు పంట తాలూకా నగదు ఇప్పించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే హరిప్రియకు, ఖమ్మం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణకు ఛాంబర్‌ ప్రతినిధులకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వర్తక సంఘం సెక్రెటరీ గుడవర్తి శ్రీనివాసరావు, అడ్తీ వ్యాపారుల సంఘం (దిగుమతి) అధ్యక్షుడు దిరిశాల వెంకటేశ్వర్లు, కార్యదర్శి బజ్జూరి రమణారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-06-22T04:31:13+05:30 IST